19 నుంచి ఉచిత బియ్యం పంపిణీ

8 Nov, 2022 05:00 IST|Sakshi

చౌకదుకాణాలు, సచివాలయాల్లో లబ్ధిదారుల జాబితా

సాక్షి, అమరావతి: ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన (పీఎంజీకేఏవై) కింద మూడునెలల పాటు ఉచిత బియ్యాన్ని పంపిణీ చేస్తున్నట్లు  పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ హెచ్‌.అరుణ్‌కుమార్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జాతీయ ఆహార భద్రత కార్డుదారులు రేషన్‌ దుకాణాల వద్ద ప్రతినెల 19వ తేదీ నుంచి 28వ తేదీలోగా బియ్యాన్ని తీసుకోవాలని సూచించారు. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అవసరమైన నిల్వలను కేటాయించిందని, దీన్లో కొంత నాన్‌ సార్టెక్స్, మరికొంత నాన్‌ సార్టెక్స్‌ ఫోర్టిఫైడ్‌ బియ్యం ఉన్నాయని తెలిపారు.

నవంబర్‌లో ఆయా జిల్లాల్లో అందుబాటులో ఉన్న నిల్వల ఆధారంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, మన్యం, డాక్టర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, ఎన్టీఆర్, బాపట్ల, నెల్లూరు జిల్లాలకు నాన్‌ సార్టెక్స్, మిలిగిన 16 జిల్లాలకు నాన్‌ సార్టెక్స్‌ ఫోర్టిఫైడ్‌ బియ్యాన్ని సరఫరా చేస్తున్నట్లు వివరించారు. 2.68 కోట్ల మంది ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ లబ్ధిదారుల జాబితాను చౌకదుకాణాలు, సచివాలయాల్లో ప్రదర్శిస్తున్నట్టు తెలిపారు.

ఒక్కో వ్యక్తికి ఐదుకిలోల వంతున బియ్యం ఇస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో సంపూర్ణ పోషణ ధ్యేయంగా ఏడు జిల్లాల్లో ఫోర్టిఫైడ్‌ బియ్యాన్ని పంపిణీ చేస్తున్నామని, వచ్చే ఏప్రిల్‌ నాటికి అన్ని జిల్లాలకు విస్తరిస్తామని తెలిపారు. ఇందులో ఐరన్, ఫోలిక్‌ ఆమ్లం, విటమిన్‌ బీ12 సమృద్ధిగా ఉంటాయని, వీటివల్ల రక్తహీతన తగ్గి, గర్భస్థ శిశువుకు మేలు జరగడంతోపాటు నాడీవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుందని వివరించారు. ఫోర్టిఫైడ్‌ బియ్యం తేలికగా ఉండి నీటిలో తేలడంతో కొంతమంది ప్లాస్టిక్‌ బియ్యంగా అపోహపడుతున్నారని పేర్కొన్నారు.  

రేషన్‌ అక్రమ రవాణాకు ఆస్కారం లేదు 
రేషన్‌ బియ్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రత్యేకంగా దృష్టి సారించినట్టు తెలిపారు. 9,260 ఎండీయూ వాహనాల ద్వారా లబ్ధిదారుల వేలిముద్రలతో ఇంటివద్దకే బియ్యాన్ని సరఫరా చేస్తుండటంతో బియ్యం బయట మార్కెట్‌కు తరలించే ఆస్కారం లేదని పేర్కొన్నారు. ఎల్లో మీడియా పనిగట్టుకుని విషప్రచారం చేయడం సరికాదని హితవుపలికారు. చౌకదుకాణాలు, ఎండీయూ వాహనాలను నిత్యం ఆకస్మికంగా తనిఖీ చేస్తున్నట్లు తెలిపారు.

విజిలెన్సు కమిటీలను నియమించి ప్రజాపంపిణీలో లోపాలు, అక్రమాలు లేకుండా నిఘావ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు. ఫిర్యాదుల కోసం 1902 టోల్‌ ఫ్రీ నంబర్‌ను ఎండీయూ వాహనంపై ముద్రించి అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ మూడేళ్లలో పక్కదారిపట్టిన 31,073 టన్నుల రేషన్‌ బియ్యాన్ని సీజ్‌చేసి సెక్షన్‌ 6ఏ ప్రకారం 6,979 కేసులతోపాటు 1,603 మందిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేసినట్లు వివరించారు.

రైస్‌మిల్లుల్లో రేషన్‌ బియ్యాన్ని రీసైక్లింగ్‌ చేస్తూ పట్టుబడితే ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లింగ్‌చేసే అనుమతిని రద్దుచేయడంతోపాటు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండల స్టాక్‌ పాయింట్‌లో ఇటీవల కొన్ని అవకతవకలు చోటుచేసుకున్న నేపథ్యంలో ప్రాథమిక విచారణ అనంతరం స్టాక్‌ పాయింట్‌ ఇన్‌చార్జిని సస్పెండ్‌ చేయడంతో పాటు క్రిమినల్‌ చర్యలకు ఆదేశించినట్లు తెలిపారు. 

మరిన్ని వార్తలు