పేద వర్గాలకు వరం.. ‘దివ్య దర్శనం’

23 Dec, 2021 04:18 IST|Sakshi

వైకుంఠ ద్వారంలో ఉచితంగా శ్రీవారి దర్శనం

అందరికీ ఉచితంగా రవాణా, భోజనం, వసతి సదుపాయం  

తిరుమల: శ్రీవారి దివ్య దర్శనం విధానం పేద వర్గాలకు వరంగా మారుతోంది. బ్రహ్మోత్సవాల సమయంలో రాష్ట్ర భక్తులకు ప్రయోగాత్మకంగా ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసిన టీటీడీ.. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా పది రోజుల పాటు ఏపీ, తెలంగాణతో పాటు తమిళనాడు భక్తులకూ అదే తరహా ఏర్పాట్లకు సిద్ధమైంది. శ్రీవారిని క్షణకాలం దర్శించుకుంటే చాలు జీవితం ధన్యమవుతుందని భక్తులు భావిస్తారు. అయితే వ్యయప్రయాసలకోర్చి శ్రీనివాసుడిని చేరుకునేందుకు అష్టకష్టాలు పడుతున్న భక్తులు కోకొల్లలు. తమ జీవిత కాలంలో స్వామి కరుణించకపోతారా, ఎప్పటికైనా  దర్శన భాగ్యం లభించకపోతుందా అని నిరీక్షించే భక్తులను దృష్టిలో ఉంచుకుని టీటీడీ దివ్యదర్శనం కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా వెనుకబడిన ప్రాంతాలకు చెందిన పేద భక్తులకు ఉచిత రవాణా, వసతి, భోజన సౌకర్యాలతో స్వామివారి దర్శనభాగ్యం కల్పించేందుకు ఏర్పాట్లు చేపట్టింది.

అది కూడా పర్వదినాల సమయంలో కావడం విశేషం. బ్రహ్మోత్సవాల సమయంలో తొమ్మిది రోజుల పాటు 13 జిల్లాలకు చెందిన భక్తులకు ఈ సౌకర్యం టీటీడీ కల్పించింది. నిత్యం రెండు జిల్లాల భక్తులను తిరుమలకు తీసుకొచ్చి స్వామి దర్శనభాగ్యం కల్పించింది. ఇలా తొమ్మిది రోజుల పాటు 248 మండలాల నుంచి 6,464 మంది భక్తులు ఉచితంగా స్వామిని దర్శించుకున్నారు. ఇందులో ఎíస్సీలు 3,485 మంది, ఎస్టీలు 2,114 మంది, మత్స్యకారులు 382 మంది భక్తులకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సమయంలో దర్శన భాగ్యం కలిగింది. తమ చిరకాల వాంఛను ఇలా సులభతరంగా తీర్చిన టీటీడీకి వారు ధన్యవాదాలు తెలిపారు. 

ఏపీ, తెలంగాణ, తమిళనాడు భక్తులకూ.. 
శ్రీవారి బ్రహ్మోత్సవాల తరహాలోనే రానున్న వైకుంఠ ఏకాదశి పర్వదిన సమయంలో కూడా వెనుకబడిన ప్రాంతాలకు చెందిన భక్తులకు (రోజూ సుమారు 1000 మందికి) స్వామివారి దర్శనభాగ్యం ఉచితంగా కల్పించాలని పాలక మండలి తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈ సారి ఏపీతో పాటు తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల భక్తులకు స్వామి దర్శనం కలగనుంది. మామూలుగా స్వామి దర్శనమే మహద్భాగ్యంగా భక్తులు భావిస్తారు. అలాంటిది ఉచితంగా వైకుంఠ ద్వార దర్శనం లభిస్తుండటం భక్తులు పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నారు.  

నేడు వర్చువల్‌ సేవా దర్శన టికెట్ల విడుదల
తిరుమల శ్రీవారికి జనవరి 1, 2 తేదీలు, 13 నుంచి 22, 26 తేదీలలో వర్చువల్‌ విధానంలో జరిపే సేవా దర్శనానికి సంబంధించి 5,500 టికెట్లను గురువారం సాయంత్రం 4 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. అదేవిధంగా జనవరి 1, 13 నుంచి 22 తేదీల వరకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను రోజుకు 20 వేల చొప్పున, జనవరి 2 నుంచి 12, 23 నుంచి 31వ తేదీల వరకు రోజుకు 12 వేల చొప్పున టికెట్లను 24వ తేదీ ఉదయం 9 గంటలకు విడుదల చేస్తారు. తిరుమల వసతికి సంబంధించి  27న ఉదయం 9 గంటలకు విడుదల చేస్తారు. కాగా, జనవరి 11 నుంచి 14వ తేదీ వరకు వసతిని తిరుమలలో కరెంట్‌ బుకింగ్‌లో భక్తులు పొందవచ్చు. భక్తులు ఆన్‌లైన్‌లో ముందుగా దర్శన, వసతిని బుక్‌ చేసుకోవాలి.  

మరిన్ని వార్తలు