గర్భిణుల వైద్యపరీక్షలకు ఉచిత రవాణా

25 Jan, 2021 04:41 IST|Sakshi

వైద్య పరీక్షలకు ఇంటి వద్దకే వాహనం 

అనంతరం తిరిగి ఇంటి వద్ద దింపేందుకు కూడా 

ప్రభుత్వాస్పత్రులకు వచ్చే ప్రతి గర్భిణికీ సదుపాయం 

తొలిదశలో 5 జిల్లాల్లో ఉచిత రవాణాకు ఆరోగ్యశాఖ కసరత్తు 

ఆ తర్వాత రాష్ట్రమంతా విస్తరించేందుకు ప్రయత్నం 

లక్షల మంది గర్భిణులకు లబ్ధి 

సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వాస్పత్రులకు వైద్యసేవలకు వెళ్లే గర్భిణులు ఇకపై ఆటో కోసమో, బస్సు కోసమో ఎదురు చూడాల్సిన పనిలేదు. వీళ్లకోసం రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే ఇంటివద్దకే వాహనాన్ని పంపించే ఏర్పాట్లు చేస్తోంది. ఆపదలో ఉన్న వారి కోసం ఇప్పటికే 108 వాహనాలు పనిచేస్తున్నాయి. పల్లెల్లో మందులివ్వడానికి 104 వాహనాలున్నాయి. ప్రసవానంతరం తల్లీబిడ్డలను ఇంటికి తీసుకెళ్లేందుకు తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వాహనాలు నడుస్తున్నాయి. అయితే.. గర్భిణులు ప్రసవానికి ముందు ఆస్పత్రులకు వెళ్లి వైద్యపరీక్షలు చేయించుకోవాలంటే రవాణా సౌకర్యం లేదు. దీనికోసం ఇప్పుడు కొత్తగా వాహనాలను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. 

తొలిదశలో 170 వాహనాలు 
గర్భిణులు 9 నెలల కాలంలో విధిగా నాలుగు దఫాలు వైద్యపరీక్షలకు వెళ్లాలి. దీన్నే యాంటీనేటల్‌ చెకప్స్‌ అంటారు. ఈ సమయంలో ప్రతి గ్రామంలో ఉన్న గర్భిణులకు ఇంటివద్దకే వాహనాలను పంపిస్తారు. గర్భిణి ఎప్పుడు వైద్యసేవలకు వెళ్లాలో స్థానికంగా ఆశా వర్కర్‌కు, ఏఎన్‌ఎంకు అవగాహన ఉంటుంది. వీళ్లు ఆ సమయానికి మెడికల్‌ ఆఫీసర్‌కు ఫోన్‌చేసి, వాహనాన్ని ఇంటివద్దకే రప్పించి దాన్లో ఆస్పత్రికి పంపిస్తారు. వైద్యపరీక్షలు పూర్తయ్యేవరకు వాహనం అక్కడే ఉండి తిరిగి ఇంటివద్దకు చేరుస్తుంది. దీనికోసం తొలుత 5 జిల్లాల్లో 170 వాహనాల ఏర్పాటుకు టెండర్లు పిలిచేందుకు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు యత్నిస్తున్నారు. అనంతరం అన్ని జిల్లాలకు ఈ పథకాన్ని విస్తరిస్తారు. గర్భిణులకు ఉచితంగా రవాణా సదుపాయం కల్పించే వాహనాలు ప్రాథమిక ఆరోగ్యకేంద్రం వైద్యాధికారి ఆధ్వర్యంలో ఉంటాయి. ఏఎన్‌ఎం లేదా ఆశా కార్యకర్త ఎవరైనా డాక్టరుకు ఫోన్‌ చేయగానే ఆ గర్భిణి ఇంటివద్దకే వాహనాన్ని పంపిస్తారు. గర్భిణి ప్రయాణానికి వీలుగా ఉండేలా తుపాన్‌ వాహనాన్ని ఎంపిక చేసినట్టు తెలిసింది. తొలుత ఈ ఐదు జిల్లాల వాహనాలకు కలిపి ఏడాదికి రూ.10 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేశారు. 

3 లక్షల మంది గర్భిణులకు లబ్ధి 
రాష్ట్రంలో ఏటా 7 లక్షలకు పైగా ప్రసవాలు జరుగుతుండగా, అందులో 3 లక్షలమంది ప్రభుత్వాస్పత్రులకు వస్తున్నారు. వీళ్లలో ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల వారే. రవాణా సౌకర్యం లేక వైద్యపరీక్షలకు వెనుకాడుతున్నారు. ఉచిత రవాణా కల్పిస్తే ప్రతి ఒక్కరు వైద్యపరీక్షలకు వచ్చే అవకాశం ఉంది. క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవడం, సమస్యలున్నప్పుడు మందులు తీసుకోవడం వల్ల సుఖప్రసవాలు జరగడమే కాకుండా మాతాశిశు మరణాలు కూడా తగ్గే అవకాశం ఉంటుంది.   

మరిన్ని వార్తలు