AP: ‘తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌’లు సిద్ధం

31 Mar, 2022 03:59 IST|Sakshi
సిద్ధార్థ వైద్య కళాశాల ఆవరణలో ఉన్న తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వాహనాలు

రాష్ట్ర వ్యాప్తంగా సేవలందించనున్న 500 వాహనాలు

1న విజయవాడలో ప్రారంభించనున్న సీఎం జగన్‌

సాక్షి ప్రతినిధి, విజయవాడ: వైద్యానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న ప్రభుత్వం మరో బృహత్తర కార్యక్రమానికి సిద్ధమైంది. గర్భిణులు, బాలింతలకు ఉచిత రవాణా సేవలు అందించేందుకు ప్రతిష్టాత్మకంగా ‘డాక్టర్‌ వైఎస్సార్‌ తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌’లను ఏర్పాటు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాకు కనీసం 19 నుంచి 40 వాహనాలు.. 

మొత్తం 500 వాహనాలను విజయవాడలోని సిద్ధార్థ్ధ వైద్య కళాశాల ప్రాంగణంలో ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. ఏప్రిల్‌ 1న విజయవాడ బెంజి సర్కిల్‌లో సీఎం వైఎస్‌ జగన్‌ వీటిని ప్రారంభించనున్నారు. మహాత్మాగాంధీ రోడ్డులో ఈ వాహనాలను వరుస సంఖ్యలో ఉంచి, బెంజిసర్కిల్‌ మీదుగా రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు పంపనున్నారు. వీటి నిర్వహణ బాధ్యతను అరబిందో ఫార్మా సంస్థ చూడనుంది. ఇందుకోసం ప్రభుత్వం ఏడాదికి సుమారు రూ.24 కోట్లు చెల్లిస్తుంది.  ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏడాదికి మూడు లక్షల దాకా ప్రసవాలు జరగనున్నాయి. ఈ వాహనాల ద్వారా గర్భిణులను ఉచితంగా ఆస్పత్రిలో చేర్చి.. ప్రసవం జరిగాక బాలింతలను తిరిగి ఉచితంగా ఇంటికి చేరుస్తారు. 

కాగా, డాక్టర్‌ వైఎస్సార్‌ తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వాహనాల ప్రారంభోత్సవ ఏర్పాట్లపై కృష్ణా జిల్లా కలెక్టర్‌ జె.నివాస్‌ స్థానిక క్యాంప్‌ కార్యాలయంలో బుధవారం అధికారులతో సమీక్షించారు. ప్రతి ఐదు వాహనాలకు ఓ వీఆర్వో, ప్రతి జిల్లాకు సంబంధించిన వాహనాలను ఓ తహశీల్దార్‌ పర్యవేక్షించేలా ఉత్తర్వులివ్వాలని జాయింట్‌ కలెక్టర్లను ఆదేశించారు. 

మరిన్ని వార్తలు