Ravuri Arjuna Rao: కులం పేరు చెప్పాలని జైల్లో కొట్టారు

26 Dec, 2022 10:40 IST|Sakshi
100వ పుట్టిన రోజు సందర్భంగా భార్య మనోరమ, కుటుంబసభ్యులతో రావూరి (ఫైల్‌)

కుల,మత రహిత సమాజమే నా ఆకాంక్ష

నమ్మిన సిద్ధాంతానికే కట్టుబడతాను

స్వాతంత్య్ర సమరయోధుడు రావూరి అర్జునరావు

‘ఉప్పు సత్యాగ్రహంలో జైలుకెళ్లినప్పుడు కులం పేరు చెప్పని నాలాంటి వారిని పోలీసులు లాఠీలతో కొట్టారు. అయినా నా సిద్ధాంతానికి నీళ్లు వదల్లేదు. కుల మత రహిత సమాజాన్నే జీవితాంతం కోరుకుంటాను’ అంటూ నమ్మిన సిద్ధాంతానికే కట్టుబడ్డ స్వాతంత్య్ర సమరయోధుడు, నాస్తికుడు రావూరి అర్జునరావు. వర్ణ వివక్షకు, బ్రిటిష్‌ పాలనకు వ్యతిరేకంగా పోరాటం సాగించిన యోధుడు ఆయన. నాస్తికోద్యమ నాయకుడు, గాంధేయవాది గోపరాజు రామచంద్రరావు (గోరా) పెద్ద అల్లుడు రావూరి అర్జునరావు (104) వయోభారంతో ఆదివారం హైదరాబాద్‌లో తన చిన్నకుమారుడు డాక్టర్‌ పవర్‌ నివాసంలో కన్నుమూశారు. సుమారు తొమ్మిదేళ్ల ఏళ్ల క్రితం ‘సాక్షి’తో ఆయన పంచుకున్న అనుభవాలు ఆయన మాటల్లోనే... 

తొమ్మిది నెలల కఠిన కాగార శిక్ష                                                             
కృష్ణాజిల్లా గుడివాడ సమీపంలోని వానపాముల గ్రామంలో 1918లో జన్మించాను. 1940లో సంఘ సంస్కర్త గోపరాజు రామచంద్రరావు(గోరా) ముదునూరు వచ్చారు. అప్పుడే ఆయనతో పరిచయం ఏర్పడింది. నాస్తిక కేంద్రంలో అన్నే అంజయ్య సహకారంతో వయోజన విద్యా కార్యక్రమాల్లో పాల్గొన్నాను. అప్పుడు నా వయసు 22 ఏళ్లు. 1942లో గాంధీగారి పిలుపు మేరకు క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నందుకు బళ్లారిలోని ఆలీపురం క్యాంప్‌ జైల్లో తొమ్మిది నెలల కఠిన కారాగార శిక్ష అనుభవించాను.  

అస్పృస్యతా నివారణకు కృషి 
జైలు శిక్ష అనంతరం వానపాముల వచ్చి నాస్తికోద్యమ నాయకుడు గోరాతో కలిసి అస్పృస్యతా నివారణ కార్యక్రమాల్లో పాల్గొన్నాను. అప్పుడు దళితుల మధ్య కుల ద్వేషం ఎక్కువగా ఉండేది. నాలుగేళ్లు అక్కడే ఉండి రెండు కులాల్లో ఎవరి ఇంట్లో వివాహాలు జరిగినా కలిసి భోజనం చేయడం, బహు మతులు ఇచ్చి పుచ్చుకునేలా మార్పులు తీసుకొచ్చాం. ఆదర్శ వివాహాలకు ప్రాధాన్యమిచ్చాం. కులాంతర వివాహాల వల్ల సామాజిక అసమానతలు పోతాయని గోరా నమ్మేవారు. అదే ఆయనను గాంధీగారికి సన్నిహితుడిని చేసింది. 

గాంధీజీకి సపర్యలు 
జైల్లో ఉన్నప్పుడు గోరాతో నాకు మంచి సంబంధాలు ఏర్పడ్డాయి. తన పెద్ద కుమార్తె మనోరమను వివాహం చేసుకోవాలని ఆయన నన్ను కోరారు. ఎవరైనా మంచి వ్యక్తితో మనోరమ వివాహం చేయమన్నాను. మనోరమతో వివాహానికి నన్ను ఒప్పించారు. ఈ విషయాన్ని ఆయన గాంధీకి తెలిపారు. 1945లో మమ్మల్ని మద్రాస్‌ తీసుకురావాలని గాంధీజీ గోరాకు ఉత్తరం రాశారు. మనోరమతో గాంధీజీ మాట్లాడి కులాంతర వివాహాన్ని రెండేళ్ల తరువాత చేయాలని సూచించారు. నన్ను సేవాగ్రామ్‌లో ఉండి హిందీ నేర్చుకోవాలని, అందరితో పరిచయాలు పెంచుకుని మనోరమకు ఉత్తరాలు రాయాలని గాంధీజీ చెప్పారు. అలా 1946 ఫిబ్రవరి ఆరో తేదీ నుంచి 1948 ఏప్రిల్‌ వరకు గాంధీజీ సేవాగ్రాం ఆశ్రమం వార్ధాలో ఉంటూ ఆయనకు సపర్యలు చేశాను. 1948లో గాంధీజీ హత్యకు గురవ్వడంతో ఆయన సమక్షంలో జరగాల్సిన నా వివాహం నిలిచిపోయింది.  

మహామహులే పెళ్లి పెద్దలు 
గాంధీజీ లేరన్న శోకం నుంచి తేరుకున్నాక వార్ధాలోని మహాత్ముడి ఆశ్రమంలోనే అదే ఏడాది మార్చి 13న హరిజన్‌ సేవక్‌ సంఘ్‌ అధ్యక్షుడు ఠక్కర్‌బాబా ఆధ్వర్యంలో ‘సత్యసాక్షి’గా ప్రభాకర్‌జీ మా వివాహం జరిపించారు. భారత ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ, లోక్‌నాయక్‌ జయప్రకాష్‌ నారాయణ్, ఆచార్య కృపలానీ వంటి మహామహులు మా పెళ్లికి పెద్దలు. తరువాత విజయవాడ నాస్తిక కేంద్రానికి చేరుకున్నాం. 

20 మందికి ఆదర్శ వివాహాలు 
1953లో మా దంపతులం వానపాముల చేరుకుని కాపురం ప్రారంభించి, గాంధీ స్మారక నిధి తరఫున పని చేశాం. 1960లో గుడివాడకు మకాం మార్చాం. అక్కడే హరిజన సేవా సంఘం, బాలుర వసతి గృహం నడిపాం. ఖాదీ బోర్డులో కూడా పని చేసేవాడిని. గుడివాడ, కృష్ణా, నెల్లూరులలోని కొన్ని ప్రాంతాలలో మూఢనమ్మకాల నిర్మూలన, కుల మత రహిత సమాజ స్థాపనకు, సెక్యులర్‌ వ్యవస్థ నిర్మాణానికి కృషి చేశాం. సుమారు 20 మందికి ఆదర్శ వివాహాలు చేశాం. మనిషిని గౌరవించటం ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి. విజ్ఞానం పెరిగే కొద్దీ కులతత్వం పెరిగిపోతోంది. పూర్వం త్యాగం ఉండేది. స్వార్థం కోసమే కులతత్వం పెరుగుతోంది. ఆ బీజం నశించినప్పుడే నిజమైన నవ సమాజ స్థాపన జరిగినట్లు. 

విజయవాడకు రావూరి భౌతికకాయం 
రావూరి అర్జునరావు భౌతికకాయాన్ని హైదరాబాద్‌ నుంచి సోమవారం విజయవాడ బెంజి సర్కిల్‌లోని నాస్తిక కేంద్రానికి తీసుకురానున్నారు. సోమవారమే అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రావూరి అర్జునరావుకు భార్య, నలుగురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.

మరిన్ని వార్తలు