మండు వేసవిలోనూ మంచినీరు

14 Apr, 2021 02:38 IST|Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చెరువుల నిండా సమృద్ధిగా నీరు ఉండటం, భూగర్భ జలాల అందుబాటుతో తాగునీటి ఇబ్బందులు తగ్గుముఖం పట్టాయి. భూగర్భ జలాలు పైపైకి ఉబికి రావడంతో రెండేళ్ల క్రితం వరకు పనిచేయని బోర్లు సైతం నిండు వేసవిలోనూ నీటి ధారలు కురిపిస్తున్నాయి. 2019 ఏప్రిల్‌ మొదటి వారంలో 3,422 గ్రామాల్లో తాగునీటి ఇబ్బందులు తలెత్తగా ప్రస్తుత వేసవిలో 285 గ్రామాల్లోనే సమస్య కనిపిస్తోందని అధికార వర్గాలు వెల్లడించాయి. ఇందుకు సంబంధించి గ్రామీణ మంచినీటి సరఫరా విభాగం (ఆర్‌డబ్ల్యూఎస్‌) అధికారులు ఎప్పటికప్పుడు రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో నివేదికలు తెప్పించుకుంటున్నారు. తాగునీటి సమస్య ఉన్న గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 2.08 లక్షల మంచి నీటి బోర్లు..
గ్రామీణ ప్రాంతాల్లో ఉండే రక్షిత మంచినీటి పథకాలకు తోడు రాష్ట్రవ్యాప్తంగా 2,08,094 మంచినీటి బోర్లు ఉన్నాయి. రెండేళ్ల క్రితం వరకు వేసవి వస్తే 60–70 వేల వరకు బోర్లు పనిచేసేవే కాదు. ఇప్పుడు 5–6 వేలు మినహా మిగిలిన అన్ని బోర్లు పనిచేస్తున్నాయని అధికారులు తెలిపారు. ఉదాహరణకు ప్రకాశం జిల్లాలో 26,007 బోర్లు ఉంటే.. రెండేళ్ల క్రితం వరకు వేసవి సీజన్‌లో 10 వేల బోర్లు పనిచేసేవి కావు. 

8 మీటర్ల లోతులోనే భూగర్భ జలాలు
ప్రకాశం జిల్లాలో గతంలో 16.09 మీటర్ల లోతున అందుబాటులో ఉన్న భూగర్భ జలాలు ఈ ఏడాది ఏప్రిల్‌ 10 నాటికి 8 మీటర్ల లోతులోనే ఉన్నాయని అధికారులు గ్రామీణ నీటి సరఫరా శాఖకు నివేదించారు. అలాగే రాయలసీమ జిల్లాల్లో 17.22 మీటర్ల లోతున ఉండే భూగర్భ జలాలు ఇప్పుడు సరాసరిన 7 మీటర్ల లోతుకే అందుబాటులోకి వచ్చాయి. మరోవైపు ప్రభుత్వం వేసవిలో ముందు జాగ్రత్తగా మార్చి నెలాఖరులోనే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న అన్ని తాగునీటి చెరువులను నీటితో నింపింది. 

నీటి ఇబ్బందులు తప్పాయి
రెండేళ్ల క్రితం వరకు మా గ్రామంలో నీళ్ల కోసం ఇబ్బంది పడేవాళ్లం. ట్యాంకర్‌ నీళ్ల కోసం పనులన్నీ మానుకొని ఇళ్లకాడ వేచి చూసేవాళ్లం. ట్యాంకర్‌ రాకుంటే పొలాలకు పోయి నీళ్లు తెచ్చుకునేవాళ్లం. మా ఊరిలో చెక్‌డ్యామ్‌ కట్టడంతో ఇప్పుడు చెరువు నిండా నీళ్లున్నాయి. రక్షిత మంచినీటి పథకం ద్వారా ప్రతి ఇంటికీ కొళాయిల ద్వారా నీళ్లు అందిస్తున్నారు. వేసవిలోనూ బోర్లలో సమృద్ధిగా నీరు లభిస్తోంది. 
– కుమారుల చెన్నక్రిష్ణమ్మ, బాదినేనిపల్లె, కొమరోలు మండలం, ప్రకాశం జిల్లా 

మరిన్ని వార్తలు