కుళ్లిన కబాబ్‌.. పాచిపోయిన పకోడి

6 Jan, 2021 10:02 IST|Sakshi

సాక్షి, కుప్పం(చిత్తూరు)‌ : ఉల్లి పకోడీలో కప్ప ఏమిటని ఆశ్చర్యపోతున్నారా? కానీ.. ఇది నిజం. కుప్పం పట్టణం రాజీవ్‌ కాలనీలోని ఓ దుకాణంలో సోమవారం రాత్రి ఓ వినియోగదారుడు ఉల్లిపకోడీ కొనుగోలు చేశాడు. ఇంటికెళ్లి తింటుండగా పిండితో కలిసి మాడిపోయిన కప్ప చేతికి వచ్చింది. ఆ కుటుంబం మొత్తం ఒక్కసారి ఉలిక్కి పడింది. ఉదయం పకోడి ప్యాకెట్‌ తీసుకువెళ్లి దుకాణదారున్ని ప్రశ్నిస్తే తప్పు జరిగిందని సమాధానం ఇచ్చాడు. తమ కుటుంబానికి ఎలాంటి హానీ జరగలేదని, ఏదైనా ఆరోగ్య సమస్యలు తలెత్తితే పరిస్థితి ఏంటని వినియోగదారుడు వాపోయాడు. 

మాంసపు దుకాణాలపై శానిటరీ అధికారుల దాడులు 

మదనపల్లె : మున్సిపల్‌ శానిటరీ అధికారులు మంగళవారం పట్టణంలోని పలు మాంసం దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు. నిల్వ ఉంచిన, కుళ్లిపోయి పురుగులు పట్టిన మాంసాన్ని గుర్తించారు. వాసన వస్తున్న వాటిని రిఫ్రిజిరేటర్‌లో నిల్వచేసి సాయంత్రం వేళల్లో కబాబ్, చికెన్‌పకోడి చేసి విక్రయాలు చేస్తున్నట్లు నిర్ధారించారు. పట్టణంలో మొత్తం 47 దుకాణాల్లో తనిఖీలు నిర్వహించగా 19 షాపుల్లో కుళ్లిన మాంసం విక్రయిస్తున్నట్లు గుర్తించారు. 19 కిలోల చికెన్, 7 కిలోల మటన్‌ను సీజ్‌ చేశారు. దుకాణదారులపై కేసులు నమోదు చేసి రూ.7,800 జరిమానా వసూలు చేశారు. నిర్వాహకులకు నోటీసులు ఇచ్చారు. ఈ సందర్భంగా శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ బాలకృష్ణ మాట్లాడుతూ ప్రజల నుంచి ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో మాంసం దుకాణాలపై దాడులు నిర్వహించినట్లు చెప్పారు. పట్టణంలోని హోటళ్లలో సైతం తనిఖీ చేస్తామన్నారు. చికెన్, మటన్‌ దుకాణదారులు ప్రభుత్వ నిబంధనలు పాటించాలని, బహిరంగంగా మాంసాన్ని ప్రదర్శనకు ఉంచేటప్పుడు వాటిపై దుమ్ము పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వార్డు సచివాలయ శానిటరీ, ఎన్విరాన్‌మెంటల్‌ అధికారులు ప్రతిరోజు మాంసం దుకాణాలను తనిఖీ చేయాలని ఆదేశించినట్లు చెప్పారు. దాడుల్లో సచివాలయ సిబ్బంది జుబేర్, రాజారెడ్డి, సతీష్, రవీంద్రనాయక్‌ పాల్గొన్నారు. (చదవండి: పక్షుల కిలకిల.. మెరుగైన జీవవైవిధ్యం)

మరిన్ని వార్తలు