మొన్నటి వరకు కరువు ఛాయలు.. ఇప్పుడు ఉద్యాన సిరులు

18 Sep, 2022 09:31 IST|Sakshi

వైఎస్సార్‌ జిల్లాలో పలు రకాల పండ్ల తోటల సాగు

51,451 ఎకరాల్లో బత్తాయి..8090 ఎకరాల్లో మామిడి..17059 ఎకరాల్లో అరటి ..3533 ఎకరాల్లో సన్న నిమ్మ

కొత్తగా ఖర్జూరం, డ్రాగన్‌ ఫ్రూట్, సీతాఫలం, అంజుర పంటల సాగు

మొత్తం 86,844 ఎకరాల్లో పండ్ల తోటల పెంపకం

వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం కొలువుదీరాక కావాల్సినన్ని నీళ్లు

సాక్షి ప్రతినిధి, కడప: వైఎస్సార్‌ జిల్లాలో పండ్ల తోటల సాగు ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతోంది. ఒకప్పుడు కరువు జిల్లాగా ఉన్న ఈ జిల్లాలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయ్యాక సాగునీటి వనరులు అందుబాటులోకి రావడంతో  పండ్ల తోటల సాగు పెరిగింది. గతంతో పోలిస్తే గడిచిన మూడేళ్లలో 70 శాతానికి పైగా సాగు పెరగడం గమనార్హం. అరటి, మామిడితోపాటు సన్ననిమ్మ, ఖర్జూరం, డ్రాగన్‌ ఫ్రూట్, సీతాఫలం, కమల, చీనీ, దానిమ్మ తదితర పండ్ల తోటలను జిల్లా వ్యాప్తంగా రైతులు పెద్ద ఎత్తున సాగు చేస్తున్నారు.

వైఎస్సార్‌ జిల్లాలోని 36 మండలాల పరిధిలో 86,844  ఎకరాల్లో ప్రస్తుతం పండ్ల తోటలు సాగులో ఉన్నాయి. గడిచిన మూడేళ్లలో జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురవడంతోపాటు ఎగువ రాష్ట్రాల్లో వర్షాలు కురవడంతో జీఎన్‌ఎస్‌ఎస్, తెలుగుగంగ పరిధిలోని అన్ని సాగునీటి వనరులను ప్రభుత్వం నీటితో నింపింది. దీంతో జిల్లా వ్యాప్తంగా భూగర్భ జలాలు దాదాపుగా భూమి పైకి వచ్చాయి. దీంతో మెట్ట ప్రాంతాల్లోనూ బోరు బావుల ద్వారా నీరు అందుబాటులోకి వచ్చింది. ఫలితంగా రైతులు వాణిజ్య పంటల సాగుకు మొగ్గు చూపిస్తున్నారు.  

అత్యధికంగా మామిడి సాగు
జిల్లాలో 36 మండలాల పరిధిలో ఒక్క లింగాల, పెద్దముడియం మండలాలు మినహా మిగిలిన 34 మండలాల్లోనూ రైతులు మామిడి సాగు చేశారు. చక్రాయపేట మండలంలో అత్యధికంగా 2825 ఎకరాల్లోనూ, ఆ తర్వాత సిద్దవటం మండలంలో 1514 ఎకరాల్లోనూ మామిడి సాగైంది. మిగిలిన మండలాల్లో 500 ఎకరాలకు తగ్గకుండా మామిడి సాగులో ఉంది. జిల్లా వ్యాప్తంగా 8090 ఎకరాల్లో మామిడి సాగైంది. ఇక జిల్లా వ్యాప్తంగా 51,451 ఎకరాల్లో బత్తాయి సాగులో ఉంది. సింహాద్రిపురం మండలంలో అత్యధికంగా 14,461 ఎకరాల్లో సాగైంది. జిల్లాలోని అన్ని మండలాల్లోనూ బత్తాయి పంట సాగులో ఉండడం గమనార్హం. దీంతోపాటు జిల్లాలో 3533 ఎకరాల్లో సన్న నిమ్మ సాగులో ఉంది. గోపవరం మండలం మినహా మిగిలిన 35 మండలాల్లోనూ నిమ్మను రైతులు సాగు చేశారు.

జిల్లా వ్యాప్తంగా 2285 ఎకరాల్లో రైతులు దానిమ్మ పంటను సాగు చేశారు. పోరుమామిళ్ల, అట్లూరు మండలాల్లో దానిమ్మ సాగు అధికంగా ఉంది. చాపాడు, దువ్వూరు, చక్రాయపేట, చెన్నూరు మినహా మిగిలిన 32 మండలాల్లోనూ దానిమ్మ పంట సాగులో ఉండడం గమనార్హం. జిల్లా వ్యాప్తంగా 17059 ఎకరాల్లో అరటి పంటను రైతులు సాగు చేశారు. అత్యధికంగా లింగాల మండలంలో 6317 ఎకరాలు, పులివెందులలో 2346 ఎకరాల్లో అరటి సాగైంది. జిల్లాలోని చెన్నూరు, వల్లూరు, చక్రాయపేట, ప్రొద్దుటూరు, రాజుపాలెం, అట్లూరు మండలాల్లో మినహా మిగిలిన 30 మండలాల్లోనూ అరటి పంట సాగైంది.

ఇక 1977 ఎకరాల్లో రైతులు బొప్పాయి పంటను సాగు చేశారు. మైదుకూరు, దువ్వూరు, కాశినాయన, వేముల తదితర మండలాల్లో రైతులు ఈ పంటను అధికంగా సాగు చేశారు. జిల్లా వ్యాప్తంగా 25 మండలాల్లో రైతులు బొప్పాయి పంటను సాగు చేశారు. వీటితోపాటు 2849 ఎకరాల్లో అంజుర, డ్రాగన్‌ ఫ్రూట్స్, జామ, ద్రాక్షతోపాటు పలు రకాల పండ్ల తోటలను  రైతులు సాగు చేశారు. రాజుపాలెం మినహా మిగిలిన 35 మండలాల్లోనూ ఈ తరహా పండ్ల తోటలు సాగులో ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా అత్యధికంగా సింహాద్రిపురంలో 15,165 ఎకరాల్లో పండ్ల తోటలు సాగు కాగా, లింగాలలో 14,098, ముద్దనూరు 5,324, కొండాపురం 4977, వీఎన్‌ పల్లె 4583, వేముల 4562, చక్రాయపేట 4196 ఎకరాల్లో పండ్ల తోటలు సాగయ్యాయి. మొత్తంగా జిల్లా వ్యాప్తంగా 86,844 ఎకరాల్లో పండ్ల తోటలు సాగు కావడం విశేషం.  

అరటికి మంచి ధర లభిస్తోంది
గడిచిన మూడేళ్లుగా అరటి పంటకు మంచి ధర లభిస్తోంది. కరోనా కష్టాల్లోనూ ప్రభుత్వం స్వయంగా అరటి కొనుగోలు చేసి రైతులను ఆదుకుంది. ఈ ప్రాంతంలో పండే అరటి తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ తదితర రాష్ట్రాలకు ఎగుమతి అవుతోంది. ఈ పంట సాగుతో ఆదాయం కూడా బాగుంది. అందువల్ల అరటి సాగువైపు రైతులు మొగ్గు చూపిస్తున్నారు.     
 – ఎ.భాస్కర్‌రెడ్డి, రైతు, నల్లపురెడ్డిపల్లె

అన్ని ప్రాంతాలకు మామిడి ఎగుమతులు
మా ప్రాంతంలో బేనీషా, లాల్‌ బహార్, అల్ఫాన్సా, నీలం తదితర మామిడి రకాలను పండిస్తున్నాము. బెంగళూరు, కేరళతోపాటు పలు రాష్ట్రాలకు ఇక్కడి మామిడి ఎగుమతి అవుతోంది. మేము 100 ఎకరాల్లో మామిడిని సాగు చేశాము. గడిచిన మూడేళ్లలో మామిడికి మంచి ధరే లభిస్తోంది. టన్ను రూ. 50 వేలకు తగ్గకుండా అమ్ముడవుతోంది.  అందువల్ల రైతులు మామిడి సాగుకు ఆసక్తి కనబరుస్తున్నారు.    
– సూర్యప్రసాద్‌రెడ్డి,  రైతు, చక్రాయపేట మండలం 

నీటి వసతితో పండ్ల తోటల సాగు 
వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయ్యాక జిల్లాలో సమృద్ధిగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రాజెక్టులకు నీళ్లు వచ్చాయి. దీంతో నీటి కొరత లేకుండా పోయింది. రైతులు చీనీ పంట అధికంగా సాగు చేశారు. చీనీ కాయలకు గిట్టుబాటు ధర లభిస్తోంది. టన్ను రూ. 80 వేల వరకు అమ్ముడుపోయింది. ప్రస్తుతం రూ. 30 వేల వరకు ధర ఉంది.   
  – అరవిందనాథరెడ్డి, రైతు, సింహాద్రిపురం   

పండ్ల తోటల సాగుకు రైతుల ఆసక్తి 
రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుండడంతో పండ్ల తోటల సాగుకు ఆసక్తి చూపుతున్నారు. స్థానికంగానే కాకుండా ఇతర ప్రాంతాల్లో డిమాండ్‌ మేర జిల్లా నుంచి వివిధ పండ్లను ఎగుమతి చేస్తున్నారు. ఒకవైపు అనుకున్న మేర దిగుబడులు రావడం, మరోవైపు మార్కెట్‌లో ఆయా పండ్లకు ఉన్న ప్రాధాన్యతను బట్టి రైతులు సాగు చేస్తున్నారు.   వ్యవసాయ పంటలకు ప్రత్యామ్నాయంగా ఉద్యాన పంటలు సాగు చేస్తున్న రైతాంగానికి మా వంతుగా తోడ్పాటు అందిస్తున్నాము.
– మైఖేల్‌ రాజీవ్,  జిల్లా ఉద్యానశాఖ అధికారి, వైఎస్సార్‌ జిల్లా  

దేశ వ్యాప్తంగా ఎగుమతులు
పులివెందుల నియోజకవర్గంతోపాటు జిల్లా వ్యాప్తంగా సాగు చేస్తున్న అరటి పంటను ఇక్కడి నుండి తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ, హైదరాబాదుతోపాటు పలు రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. ఈ సంవత్సరం టన్ను అత్యధికంగా రూ. 24 వేల వరకు ధర పలికింది. ప్రస్తుతం టన్ను రూ. 13 వేల ధర ఉంది. కరోనా సమయంలో అరటి రైతులు ఇబ్బందులు పడ్డారు. కడప ఎంపీ వైఎస్‌ అవినా‹Ùరెడ్డి చొరవతో ప్రభుత్వం టన్ను రూ. 3,500 చొప్పున రైతుల వద్ద కొనుగోలు చేసి ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసి రైతులను ఆదుకుంది. 

జిల్లాలో బేనీషా, అల్ఫోన్సా, లాల్‌ బహార్, బెంగుళూర, నీలం తదితర రకాల మామిడి సాగవుతోంది. ఈ పంటను బెంగుళూరు, కేరళ తదితర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. ఇక్కడ పండే బేనీషా దేశ వ్యాప్తంగానే కాకుండా గల్ఫ్‌ దేశాలకు ఎగుమతి అవుతోంది. గత మూడేళ్లలో మామిడికి మంచి ధరలే ఉన్నాయి. టన్ను రూ. 50 వేల నుంచి రూ. లక్ష వరకు అమ్ముడుపోయింది. రూ. 50 వేలకు ఎప్పుడూ తగ్గలేదు.   

జిల్లాలో పండుతున్న చీనీకి దేశ వ్యాప్తంగా మంచి డిమాండ్‌ ఉంది. తెలంగాణ ప్రాంతంలో పండే చీనీ కంటే మన జిల్లాలో పండుతున్న చీనీకి మంచి నాణ్యత కలిగినదిగా పేరుంది. ఈ రకం ఎక్కువ కాలం పాడవకుండా ఉంటుంది. గడిచిన మూడేళ్లలో చీనీకి మంచి ధర లభించింది. అత్య«ధికంగా టన్ను రూ. 80 వేల వరకు అమ్ముడుపోయింది. ప్రస్తుతం టన్ను రూ. 30 వేలకు పైగానే ధర ఉంది. చీనీ ఇక్కడి నుంచి బెంగళూరు, ఢిల్లీతోపాటు దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు ఎగుమతి అవుతోంది. వీటితోపాటు జిల్లాలో పండుతున్న అన్నిరకాల పండ్లు దేశ వ్యాప్తంగా ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి. గడిచిన మూడేళ్లుగా పండ్లకు మంచి ధర వస్తోందని, గిట్టుబాటు అవుతోందని రైతులు పేర్కొంటున్నారు. 

మరిన్ని వార్తలు