భద్రతకు ‘దిశ’ నిర్దేశం

16 Sep, 2021 02:22 IST|Sakshi

మహిళల రక్షణకు పూర్తి భరోసా

దిశ యాప్‌తో తక్షణ సాయం

53 లక్షల దిశ యాప్‌ డౌన్‌లోడ్లు

స్పందనలో ఫిర్యాదుతో సత్వర పరిష్కారం

పోలీస్‌ స్టేషన్లలో హెల్ప్‌ డెస్క్‌లు

సైబర్‌ మిత్రతో వేధింపులకు కట్టడి

మహిళా పోలీసు, మహిళా మిత్రలతో ప్రజలకు చేరువ

సత్ఫలితాలిస్తున్న ఫ్రెండ్లీ పోలీసింగ్‌ విధానాలు

సాక్షి, అమరావతి: చిత్తూరు జిల్లా బి.కొత్తకోటలో ఓ యువకుడు ఇద్దరు బాలికలను మంగళవారం రాత్రి 7.20 గంటలకు వారి ఇంటి మేడ మీదకు తీసుకువెళ్లి అసభ్యకరంగా తాకుతూ వేధించాడు. వెంటనే ఓ బాలిక కిందకు దిగొచ్చి, అమ్మమ్మకు విషయం చెప్పింది. అంతకు రెండు రోజుల ముందే వార్డు వలంటీర్‌ ఆమె మొబైల్‌ ఫోన్లో దిశ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేశారు. దాంతో ఆమె 7.26 గంటలకు దిశ యాప్‌లోని ఎస్‌వోఎస్‌ బటన్‌ నొక్కారు.  7.30 గంటలకు పోలీసులు అక్కడికి చేరుకుని ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.

పోస్కో, నిర్భయ చట్టాల కింద కేసు నమోదు చేశారు. ‘వామ్మో పోలీసులా.. కంప్లైంట్‌ ఇవ్వాలంటే పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లాలా.. అంతకంటే మౌనంగా ఉండటమే నయం.’ ఇదీ రాష్ట్రంలో రెండున్నరేళ్ల క్రితం వరకు మహిళల పరిస్థితి. తమకు అన్యాయం జరిగినా, వేధింపులకు గురైనా.. ఇతరత్రా సమస్యలు వచ్చినా సరే పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు మహిళలు జంకేవారు. పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లాలంటేనే హడలిపోయేవారు. 2019లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యలు స్వీకరించాక పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఆపదలో చిక్కుకున్న మహిళలు దిశ యాప్‌లో ఎస్‌వోఎస్‌ బటన్‌ నొక్కితే చాలు.. క్షణాల్లో పోలీసులు వచ్చి రక్షణ కల్పిస్తున్నారు. 

ఫ్రెండ్లీ పోలీసింగ్‌..
స్పందన ద్వారా ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేస్తే చాలు.. సమస్య ఇట్టే పరిష్కారమైపోతోంది.. సైబర్‌మిత్ర వాట్సాప్‌ నంబరుకు సమాచారం ఇస్తే చాలు.. సైబర్‌ వేధింపులకు అడ్టుకట్ట పడుతోంది. ప్రతి గ్రామ/ వార్డు సచివాలయంలోనే మహిళా పోలీసులు తోబుట్టువులా అందుబాటులో ఉంటున్నారు. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా మహిళ మిత్ర గ్రూప్‌ సభ్యులు మేమున్నాంటున్నారు. పోలీస్‌ స్టేషన్లో సేవలన్నీ కూడా పోలీస్‌ సేవా యాప్‌ ద్వారా అరచేతిలోకి వచ్చాయి. పోలీస్‌ స్టేషన్‌కు వెళితే హెల్ప్‌ డెస్క్‌ సిబ్బంది సాదరంగా పలకరించి సమస్యను పరిష్కరిస్తున్నారు. దీంతో మహిళలు ధైర్యంగా ఫిర్యాదు చేయగలుగుతున్నారు.

మొత్తంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం మహిళా భద్రత కోసం చిత్తశుద్ధితో అమలు చేస్తున్న ఫ్రెండ్లీ పోలీసింగ్‌ విధానాలు సత్ఫలితాన్నిస్తున్నాయి. గ్రామ, వార్డు సచివాలయాలలో మహిళా పోలీసులు, దిశ పోలీస్‌ స్టేషన్ల ఏర్పాటు వంటి విప్లవాత్మక రీతిలో వ్యవస్థాగత సంస్కరణలు, మౌలిక వసతుల కల్పన... మరోవైపు సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటూ దిశ యాప్, ఆన్‌లైన్లో ఫిర్యాదుల కోసం స్పందన పోర్టల్‌ వంటి అద్భుత ఆవిష్కరణలతో రాష్ట్రంలో కొత్త చరిత్రకు నాంది పలికారు. సత్వరమే దోషులకు శిక్ష పడేలా తగిన వ్యవస్థను ఏర్పాటు చేశారు. 

భద్రత దిశగా కీలక నిర్ణయాలు 
► రాష్ట్రంలో ప్రత్యేకంగా 18 దిశ పోలీస్‌ స్టేషన్ల ఏర్పాటు. 
► గస్తీని పటిష్టం చేసేందుకు ప్రత్యేకంగా 900 స్కూటర్లు. 
► దిశ గస్తీ కోసం రూ.16.60 కోట్లతో 145 మహింద్రా స్కార్పియో వాహనాలను కొనుగోలుకు నిర్ణయం. 
► మహిళలపై లైంగిక నేరాలకు పాల్పడ్డ రికార్డు ఉన్న 2,11,793 మందిని జియో ట్యాగింగ్‌ ద్వారా నిఘా. 
► దాడులు, వేధింపులకు అవకాశం ఉన్న సున్నిత ప్రాంతాల మ్యాపింగ్‌. 
► దిశ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లను ఏర్పాటు. 58 మంది ఫోరెన్సిక్‌ నిపుణుల పోస్టుల భర్తీ 

తక్షణ భద్రత.. వేగంగా దర్యాప్తు
► దిశ యాప్‌ ద్వారా ఇప్పటివరకు 3,68,771 కాల్‌ రిక్వెస్టులు వచ్చాయి. కొత్తగా యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకున్న వారు చేసే టెస్టింగ్‌ కాల్స్‌ను మినహాయిస్తే, 4,366 కాల్స్‌ చర్యలు తీసుకునేవి ఉన్నాయి. వాటిపై పోలీసులు సత్వరం స్పందించి తగిన చర్యలు తీసుకున్నారు. 
► దిశ యాప్‌ ద్వారా నమోదు చేసిన కేసుల విచారణ పట్ల పోలీసు శాఖ ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది. రికార్డు స్థాయిలో ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి, కేసుల దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటివరకు 589 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు కావడం విశేషం. ఇందులో మహిళల గౌరవానికి భంగం కలిగించినవి 149, భర్త వేధింపులకు సంబంధించి 118, మహిళలను అవమానించడంపై 77 కేసులున్నాయి. 
► మహిళలపై నేరాలకు పాల్పడిన ఘటల్లో ఏడు రోజుల్లోనే 1,136 మందిపై చార్జిషీట్లు, 15 రోజుల్లో 2,265 చార్జిషీట్లు దాఖలు చేశారు.
► బాధితులు ఏ పోలీస్‌ స్టేషన్‌ నుంచి అయినా సరే ఫిర్యాదు చేసేందుకు జీరో ఎఫ్‌ఐఆర్‌ విధానాన్ని ప్రభుత్వం సమర్థంగా అమలు చేస్తోంది. 2019లో 59, 2020లో 338, 2021లో ఇప్పటి వరకు 224 జీరో ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. 
► దిశ యాప్‌ విజయవంతం కావడంతో రాష్ట్రంలో బుధవారం నాటికి రికార్డు స్థాయిలో 53,75,075 మంది ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. 
► స్పందన కార్యక్రమం/పోర్టల్‌ ద్వారా ఇప్పటి వరకు 1,40,341 ఫిర్యాదులు వచ్చాయి. ఇందులో 1.32 లక్షల కేసులను పరిష్కరించారు. లక్ష కేసులను కేవలం వారం రోజుల్లోనే పరిష్కరించడం విశేషం. 35,581 కేసుల్లో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. 
► పోలీస్‌ సేవా యాప్‌తో 87 సేవలు అందిస్తున్నారు. ఒక ఫిర్యాదు నుంచి పరిష్కారం వరకు మొత్తం 24 ఎస్‌ఎంఎస్‌లు ఫిర్యాదుదారులకు ఇస్తుండటం పోలీసుల నిబద్ధతకు నిదర్శనం. 
► సైబర్‌ మిత్ర వాట్సాప్‌ నంబరు 9121211100, సీఐడీ విభాగం వాట్సాప్‌ నంబరు 9701666667 ద్వారా కూడా ఫిర్యాదులకు అవకాశం కల్పించారు.  
► గ్రామ, వార్డు సచివాలయాల్లో 15 వేల మంది మహిళా పోలీసులను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ప్రతి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో 10 మంది సభ్యులతో మహిళా మిత్ర బృందాలను ఏర్పాటు చేశారు. 
► మహిళలపై దాడుల కేసుల్లో 148 మందిలో ముగ్గురికి ఉరి శిక్ష, 17 మందికి జీవిత ఖైదు, ముగ్గురికి 20 ఏళ్ల జైలు శిక్ష, 10 మందికి పదేళ్ల జైలు, మిగిలిన వారికి ఇతర శిక్షలు విధించారు.    

మరిన్ని వార్తలు