చింత గింజలోయ్‌.. మంచి కాసులోయ్‌..

26 Jun, 2022 08:27 IST|Sakshi

రూ.లక్షలు కురిపిస్తున్న చింత గింజలు

కాకినాడ జిల్లాలో చింత గింజల ప్రాసెసింగ్‌ యూనిట్లు

ఇతర దేశాలకు చింత గింజల పౌడర్‌ ఎగుమతి

మంత్రాలకు చింతకాయలు రాలతాయో లేదో తెలీదు కానీ.. చింత కాయలతో పాటు వాటి గింజలకూ కాసులు రాలుతున్నాయి. చింత పిక్కలాట.. వామన గుంటలు.. వైకుంఠపాళీ.. అష్టా–చెమ్మా వంటి ఆటలకు మాత్రమే వినియోగించే చింత గింజలు వ్యాపారులకు, కూలీలకు సిరులు కురిపిస్తున్నాయి. వివిధ పరిశ్రమలకు ముడి సరుకుగా  మారిన చింత పిక్కలు ఇప్పుడు అమెజాన్‌ లాంటి ఈ–కామర్స్‌ ఆన్‌లైన్‌ సైట్లలోనూ అమ్ముడుపోతున్నాయి. ఏటా వేలాది టన్నుల చింత గింజలు మన రాష్ట్రం నుంచి ఇతర దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. దేశానికి విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించి పెడుతున్నాయి.

పిఠాపురం: చింత గింజలూ వ్యాపార వస్తువుగా మారాయి. వ్యాపారులకు మంచి ఆదాయాన్ని ఇస్తున్నాయి. దీంతో కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలుతో పాటు పలు ప్రాంతాల్లో చింత గింజల ప్రాసెసింగ్‌ యూనిట్లు వెలిసాయి. చింతపండు వ్యాపారుల నుంచి చింత గింజలను కొనుగోలు చేసి ప్రాసెసింగ్‌ యూనిట్లకు తరలిస్తున్నారు. అక్కడ వాటిని శుభ్రం చేసి.. గింజలకు పైన ఉండే తోలు తొలగించి గుజరాత్, మహారాష్ట్ర, సూరత్‌ తదితర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. తోలు తీసిన చింత గింజల టన్ను ధర రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు పలుకుతోంది.

కాకినాడ జిల్లాలో రోజుకు 60 టన్నుల వరకు చింత గింజలు లభ్యమవుతుండగా 20 టన్నుల వరకు ప్రాసెసింగ్‌ జరుగుతోంది. రాష్ట్రంలో విస్తరించి ఉన్న అన్ని అటవీ ప్రాంతాలతో పాటు ఉమ్మడి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విజయనగరం, శ్రీకాకుళం, చిత్తూరు, హిందూపురం తదితర ప్రాంతాల్లో చింత గింజలు లభ్యమవుతున్నాయి. కాకినాడ, విజయనగరం, చిత్తూరు జిల్లాల్లో చింత గింజల్ని ప్రాసెసింగ్‌ చేసే యూనిట్లు ఉన్నాయి. రాష్ట్రం నుంచి ఏటా 18 వేల టన్నుల చింత గింజలు ఎగుమతి అవుతుండగా.. వాటి విలువ రూ.36 కోట్ల పైమాటే. వీటి కొనుగోళ్లు, ఎగుమతుల ద్వారా ఏడాదికి సుమారు రూ.65 కోట్ల మేర లావాదేవీలు జరుగుతున్నాయి.

ఏడాదంతా వ్యాపారం
చింత పిక్కలను ప్రాసెసింగ్‌ చేసే ఫ్యాక్టరీలు ఏడాదంతా పని చేస్తున్నాయి. చింతపండు సీజనల్‌గా మాత్రమే లభిస్తున్నప్పటికీ.. కోల్డ్‌ స్టోరేజిలలో నిల్వ ఉంచి ఏడాదంతా గింజలు తొలగించి అమ్ముతుంటారు. దీనివల్ల ఏడాదంతా చింత గింజలు అందుబాటులో ఉంటున్నాయి. చింతగింజలను కేజీ రూ.5 నుంచి రూ.8కి కొంటున్నారు. తోలు తీసిన తరువాత  కేజీ రూ.20కి పైగా అమ్ముతారు. ప్రత్యక్షంగా చింతపండు గింజలు తీసే కుటుంబాలు రాష్ట్రంలో 10 వేలకు పైగా ఉండగా.. వ్యాపారాలు, ఫ్యాక్టరీలలో పని చేసే కార్మిక కుటుంబాలు వెయ్యి వరకు ఉన్నాయి. చింతపండు వ్యాపారులే గింజలను సేకరిస్తారు. ఐదు కేజీల చింతపండులోంచి కేజీ చింత గింజలు వస్తాయి. 

ప్రాసెసింగ్‌ ఇలా..
చింతపండు నుంచి వేరు చేసిన గింజలను చింతపండు వ్యాపారులు ఫ్యాక్టరీలకు విక్రయిస్తారు. వాటిని ప్రాసెసింగ్‌ యూనిట్లలోని బాయిలర్‌లో (240 డిగ్రీల వేడి వద్ద) నీటితో శుభ్రం చేస్తారు. అనంతరం దానిపై ఉండే తొక్కను తొలగించి బస్తాల్లో నింపుతారు. వాటిని ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వ్యాపారులు కొనుగోలు చేసి తీసుకెళతారు. రాష్ట్రంలోని హిందూపురంలో చింత గింజల పౌడర్‌ తయారు చేస్తున్నారు. దీంతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఫ్యాక్టరీలలో ఈ గింజలను వైట్‌ పౌడర్‌గా మార్చి.. ఏ1, ఏ2, ఏ3, ఏ4 గ్రేడ్‌లుగా విభజించి  జర్మనీ, జపాన్, ఇండోనేషియా, మలేషియా, టర్కీ, రష్యా తదితర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. చింత గింజల పౌడర్‌ ధర కేజీ రూ.400 వరకు ఉంది. 

ఉపయోగాలివీ
రంగులు చిక్కగా.. పటిష్టంగా ఉండడానికి ఆయా కంపెనీలు చింతగింజల పౌడర్‌ను ఉపయోగిస్తాయి. పట్టు వస్త్రాలకు తళతళలాడే మెరుపుతో పాటు పెళుసుగా ఉండేందుకు, గంజి పట్టించేందుకు వస్త్ర పరిశ్రమలూ ఈ పౌడర్‌ను వినియోగిస్తున్నాయి. మస్కిటో కాయిల్స్‌ తయారీలోనూ (యూరప్‌లో దీనిని ఎక్కువగా వాడుతున్నారు) దీనిని ఉపయోగిస్తున్నారు. కొన్ని రకాల మందుల తయారీలోనూ వాడుతుండటం వల్ల ఫార్మా కంపెనీలు ఈ పౌడర్‌ను కొనుగోలు చేస్తున్నాయి. ప్లైవుడ్‌ షీట్స్, పేపర్‌ తయారీతోపాటు జూట్‌  పరిశ్రమలోనూ ఉపయోగిస్తారు. పాలిస్టర్‌ గమ్, ప్లాస్టిక్‌ తయారీలోనూ దీనిని వాడతారు. చింత గింజల్లో ఫైబర్, ప్రొటీన్స్, ఎమినో యాసిడ్స్, ఫ్యాటీ యాసిడ్స్, మినరల్స్‌ ఉండటంతో ఇవి ఆరోగ్యాన్ని ఇస్తాయని చెబుతుండటంతో పలువురు వంటకాల్లోనూ వినియోగిస్తున్నారు.

ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్నాం
చింత గింజలను శుభ్రం చేసి గ్రేడ్‌ల వారీగా విభజిస్తున్నాం. మా వద్ద ఉన్న సరుకు వివరాలను ఆన్‌లైన్‌లో పెడితే.. ఇతర రాష్ట్రాల వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. మా గ్రామంలో చాలాకాలంగా చింతపండు నుంచి గింజలను వేరుచేసే పనిని మహిళలు చేస్తుంటారు. అందువల్ల మా గ్రామంలో ఎక్కువగా చింత గింజలు లభ్యమవుతాయి. దీంతో నేను చింత గింజల ఫ్యాక్టరీ నడుపుతున్నాను. 
–ఓరుగంటి రాంబాబు, చింత గింజల ఫ్యాక్టరీ యజమాని, చేబ్రోలు, గొల్లప్రోలు మండలం


తూర్పు గోదావరి జిల్లాలో ఒకటే ఉంది
చింత గింజల ప్రాసెసింగ్‌ యూనిట్లు పెద్దగా ఎక్కడో గాని ఉండవు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో చింతపిక్కల ఫ్యాక్టరీ ఒకటి మాత్రమే రిజిస్టర్‌ అయ్యింది. జిల్లాలో చింత గింజల ఉత్పత్తి ఎక్కువగానే ఉంటుంది. వీటిని సేకరించి ఇక్కడే తొక్క తీసి ఎగుమతి చేస్తుంటారు. ఇతర రాష్ట్రాల్లో చింత గింజల్ని పౌడర్‌గా మార్చి ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఎవరైనా ఇలాంటి పరిశ్రమ ఏర్పాటు చేసుకుంటే పూర్తి సహకారం అందిస్తాం.
–తామాడి మురళి, జనరల్‌ మేనేజర్, జిల్లా పరిశ్రమల శాఖ, కాకినాడ

మరిన్ని వార్తలు