వైఎస్సార్‌సీపీ శ్రేణులో జోష్‌

14 Dec, 2022 11:48 IST|Sakshi

వచ్చే ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకం

మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు  98 శాతం అమలు 

సమన్వయంతో పనిచేస్తే గెలుపు నల్లేరుమీద నడకే

వైఎస్సార్‌సీపీ శ్రేణులకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దిశా నిర్దేశం

4 రోజులు.. 8 నియోజకవర్గాల్లో సమీక్ష సమావేశాలు

సాక్షి ప్రతినిధి, అనంతపురం :  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రీజినల్‌ కోఆర్డినేటర్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జిల్లాలో ఈ నెల 9 నుంచి 12 వరకు నిర్వహించిన సమీక్షలు పార్టీ శ్రేణుల్లో జోష్‌ నింపాయి. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పార్టీని   సంస్థాగతంగా మరింత పటిష్టం చేయాలన్న సీఎం వైఎస్‌ జగన్‌   మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పెద్దిరెడ్డి నాలుగు రోజుల పాటు 8 నియోజక వర్గాల్లో పర్యటించి విస్తృత స్థాయి సమీక్ష సమావేశాలు నిర్వహించారు. అక్కడక్కడ చిన్న చిన్న సమస్యలను అధిగమించేలా ద్వితీయ శ్రేణి నాయకత్వానికి సూచించారు. రానున్న ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకమని కార్యకర్తలకు చెప్పారు.    ఇంకా ఏమి సూచించారో ఆయన మాటల్లోనే... 

హామీలన్నీ అమలు చేశాం : మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 98 శాతం అమలు చేశాం. కులాలు, వర్గాలు, పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల వారికి లబ్ధి చేకూర్చాం. అర్హత కలిగిన ఏ ఒక్క కుటుంబమూ లబ్ధిపొందని పరిస్థితి లేదు. గడప గడపకూ మన ఎమ్మెల్యేలు వెళ్లి వారికి జరిగిన లబ్ధి వివరిస్తున్నారు. ఎక్కడా వ్యతిరేకత అన్నది లేదు. అన్ని వర్గాలకు లబ్ధి కలిగిన విషయాన్ని మరింతగా ప్రచారం చేయాలి. 

ప్రతి కార్యకర్తా సైనికుడే : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి ప్రతి కార్యకర్తా సైనికుడే. చిన్న చిన్న విభేదాలున్నా పక్కన పెట్టి సమన్వయంతో పనిచేయాల్సి ఉంది. కార్యకర్తలే పార్టీకి సైనికులు. క్షేత్రస్థాయిలో పోరాటం మీదే. ప్రత్యేక పరిస్థితుల్లో ఏర్పడిన ఈ పార్టీకి మీరే దిక్సూచి. 2019 ఎన్నికల్లో 151 స్థానాల్లో మన పార్టీ విజయం సాధించిందంటే అది మీ వల్లే. మీ పోరాటం వృథా కాకూడదనే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పేదలందరికీ లబ్ధి చేకూరుస్తున్నారు.  

ధైర్యంగా గడప గడపకూ వెళ్తున్నాం :అధికార పార్టీ ప్రజల్లోకి వెళ్లాలంటే కొంచెం భయం ఉంటుంది. కానీ మూడున్నరేళ్ల తర్వాత మనం ఇంటింటికీ ధైర్యంగా వెళ్తున్నామంటే అది మన నాయకుడిపై ఉన్న విశ్వాసం, నమ్మకమే. ప్రతి ఇంటికీ సంక్షేమ ఫలాలు అందిస్తున్న ఘనత మన ముఖ్యమంత్రిది. అప్పట్లో ఉచిత విద్యుత్‌పై వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మొదటి సంతకం చేస్తే, జగన్‌ తొలిరోజు నుంచే మేనిఫెస్టో అమలుకు కృషి చేస్తున్నారు.  

టీడీపీని నమ్మే స్థితిలో ప్రజలు లేరు : ప్రజా బలం లేనందు వల్లే  చంద్రబాబు పచ్చ మీడియాపై ఆధారపడి వెళ్తున్నారు. ప్రభుత్వంపై ఎన్ని నిందలు వేస్తున్నా జనం నమ్మడం లేదనేది తెలుసు. టీడీపీని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. పవన్‌ కళ్యాణ్‌ లాంటి వాళ్లతో   పొత్తులున్నా మనం భయపడాల్సిన పనిలేదు. కుటుంబం అన్నాక చిన్న చిన్న సమస్యలుంటాయి. వాటిని అధిగమించి రానున్న ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ        జెండాను ఎగురవేసి.. జగన్‌ను మళ్లీ సీఎంను చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. నాలుగు రోజుల పర్యటనలో పార్టీ శ్రేణులకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ మేరకు దిశానిర్దేశం చేశారు.    

మరిన్ని వార్తలు