YSR Jagananna Colonies: కావాల్సినంత ఇసుక 

13 Apr, 2022 12:54 IST|Sakshi
బొబ్బిలిలో ఇసుక డిపో

వైఎస్సార్‌ జగనన్న కాలనీలకు పూర్తిస్థాయిలో ఇసుక సరఫరా  

ప్రతి మండలానికి ఒక స్టాక్‌ పాయింట్‌

17 వేల మెట్రిక్‌ టన్నులు ఉచితంగా అందజేత

హాలోగ్రామ్‌లున్న బిల్లులతో అక్రమాలకు అడ్డుకట్ట 

77 రీచ్‌లలో ఇసుక తవ్వకాలు

4 డిపోల్లో 41,850 మెట్రిక్‌ టన్నుల ఇసుక నిల్వ

సాక్షి ప్రతినిధి, విజయనగరం: పేదలందరికీ పక్కా ఇంటి భాగ్యం కల్పించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. దీనికోసం ‘పేదలందరికీ ఇళ్లు’ పథకాన్ని ఆచరణలోకి తెచ్చింది. జిల్లావ్యాప్తంగా లే అవట్లను వేసింది. వైఎస్సార్‌ జగనన్న కాలనీలుగా నామకరణం చేసి స్థలాలను కేటాయించింది. విశాలమైన రోడ్లు, తాగునీరు, విద్యుత్‌ తదితర మౌలిక సదుపాయాలు కల్పించింది. కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలకు కావాల్సిన సామగ్రిని విరివిగా సమకూర్చుతోంది. అందులో భాగంగా ఇసుకను ఉచితంగా సరఫరా చేస్తోంది. దీనికోసం ప్రతి మండలంలోనూ ఒక్కొక్కటి చొప్పు న స్టాక్‌ పాయింట్‌ను జిల్లా అధికారులు  ప్రారంభించారు.

సమీప ఇసుక డిపోల నుంచి వాటికి ఇసుకను చేరవేస్తున్నారు. ఇళ్ల నిర్మాణం కోసం గృహనిర్మాణ శాఖ ద్వారా జారీ అయిన బిల్లుల ఆధారంగా ఇప్పటివరకూ 17 వేల మెట్రిక్‌ టన్నుల ఇసుకను ఉచితంగా గృహాల లబ్ధిదారులకు సమకూర్చారు. ఆ బిల్లులపై హాలోగ్రామ్‌ ఉండడంతో అక్రమాలకు అడ్డుకట్ట పడింది. 77 రీచ్‌లలో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. జిల్లాలోని నాలుగు డిపోల్లో మంగళవారం నాటికి 41,850 మెట్రిక్‌ టన్నుల ఇసుక నిల్వ ఉంది. లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయడమే తరువాయి!.  

ఇళ్ల మంజూరు ఇలా...  
పేదలకు వైఎస్సార్‌ జగనన్న కాలనీల్లో 80,547 ఇళ్లు మంజూరయ్యాయి. వాటిలో చాలా ఇళ్ల నిర్మాణ పను లు వివిధ దశల్లో ఉన్నాయి. కొన్ని ఇళ్ల నిర్మాణం పూర్తయింది. దాదాపు 17వేల ఇళ్ల నిర్మాణ పనులను లబ్ధిదారులు ప్రారంభించాల్సి ఉంది. వారికి అవసరమైన అన్ని మౌలిక వసతులు సమకూర్చడంతో పాటు పనులు వేగవంతం కావడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలిచ్చింది. గృహనిర్మాణ శాఖ అధికారులు ప్రతి లేఅవుట్‌లోనూ ఇళ్ల నిర్మాణాలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటివరకూ ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించలేనివారితో మాట్లాడి వారికి సహాయ సహకారాలు అందజేస్తున్నారు. సలహాలు, సూచనలు ఇస్తున్నారు.

సక్రమంగా ఇసుక అందేలా... 
ఒక్కో ఇంటి నిర్మాణానికి 20 టన్నుల ఇసుకను లబ్ధిదారులకు ప్రభుత్వం ఉచితంగా అందజేస్తోంది. గతంలో ఇసుక సరఫరాలో ఏర్పడిన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని నూతన ఇసుక విధానాన్ని అమల్లోకి తెచ్చిన సంగతి తెలిసిందే. జేపీ పవర్‌ కన్‌స్ట్రక్ష న్స్‌కు ఇసుక సరఫరా బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. రీచ్‌ల నుంచి లారీల్లో ఇసుక జిల్లాలోని నాలుగు డిపోలకు వస్తోంది. అక్కడి నుంచి లబ్ధిదారులకు సులువుగా చేరవేసేందుకు వీలుగా మండలానికి ఒకటి చొప్పున స్టాక్‌ పాయింట్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జిల్లాలో ప్రస్తుతం 77 ఇసుక రీచ్‌లు ఉన్నా యి. వీటిలో ఒక్కోచోట వెయ్యి నుంచి రెండు వేల క్యూబిక్‌ మీటర్ల ఇసుక లభ్యమవుతోంది. ఆ ఇసుకను డిపోలకు, అక్కడి నుంచి స్టాక్‌ పాయింట్లకు తీసుకొస్తున్నారు. అక్కడ ఇళ్ల లబ్ధిదారులకు హాలోగ్రామ్‌ ఉన్న బిల్లుల ఆధారంగా ఇసుకను సరఫరా చేస్తున్నామని జేపీ పవర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ ప్రతినిధి హర్షవర్దన్‌ ప్రసాద్‌ చెప్పారు.

ఇసుక పక్కదారి పట్టకుండా... 
గ్రామ/వార్డు సచివాలయంలోని ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌  జనరేట్‌ చేసి ఇచ్చిన బిల్లును లబ్ధిదారులు  స్టాక్‌ పాయింట్‌కు తీసుకెళ్లి చూపిస్తే ఇసుక ఇస్తున్నారు. చేతిరాతతో ఇస్తే కుదరదు. హలోగ్రామ్‌ బిల్లులతో ఇసుక పక్కదారి పట్టకుండా నిరోధించగలుగుతున్నారు.

సత్వరమే బిల్లుల చెల్లింపు..
వైఎస్సార్‌ జగనన్న కాలనీల్లో ఇళ్లను నిర్మించుకుంటున్న లబ్ధిదారులకు గృహనిర్మాణ శాఖ ద్వారా బిల్లులను వారంలోగా జనరేట్‌ చేస్తున్నారు. ప్రతీ మండలం నుంచి ఆయా ఏఈలు, డీఈలు, వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌లు లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణ స్థాయిని బట్టి బిల్లులు వారి వ్యక్తిగత ఖాతాలకు పడేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇసుక, సిమెంట్‌ కొరత లేదు. జిల్లాలో ఇళ్ల నిర్మాణం జోరందుకుంది. ఇనుము కోసం చర్చలు జరుగుతున్నాయి. ప్రతి లబ్ధిదారునికీ వారంలోగా బిల్లులు వారి ఖాతాల్లోకి జమవుతున్నాయి.  
– ఎస్‌వీ రమణమూర్తి, ప్రాజెక్టు డైరెక్టర్, గృహనిర్మాణ శాఖ, విజయనగరం  

మరిన్ని వార్తలు