చిన్న ఆలయాలకు చింతలేదు

11 Aug, 2021 02:36 IST|Sakshi

టీటీడీ నుంచే ఇక ప్రతి ఏటా రూ.40 కోట్లు ‘కామన్‌ గుడ్‌ ఫండ్‌’కు.. 

గతంలో ఏటా రూ.1.25 కోట్లు మాత్రమే కేటాయింపు

ఆదాయంలేని గుడుల్లో ధూప దీప నైవేద్యాలు, శిథిలమైన ఆలయాల అభివృద్ధికి ఉద్దేశించిందే సీజీఎఫ్‌

తొమ్మిది పెద్ద ఆలయాల నుంచి సీజీఎఫ్‌కు నిధులు

తాజాగా టీటీడీ వాటా పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం 

రూ.130 కోట్లకు పెరగనున్న నిధి

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో నిత్యం ధూప దీప నైవేద్యాలకు నోచుకోని వందల ఆలయాలకు మంచిరోజులు వస్తున్నాయి. శిథిలావస్థలో ఉన్న  ఆలయాల పునర్నిర్మాణం.. ఆగమ, వేద పాఠశాలల నిర్వహణ.. ధూప దీప నైవేద్య (డీడీఎన్‌ఎస్‌) స్కీం వంటి కార్యక్రమాలకు నిధులను వినియోగించే కామన్‌ గుడ్‌ ఫండ్‌ (సీజీఎఫ్‌)కు ఏటా కేటాయించే నిధులను రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. దీంతో ఇక నుంచి ఒక్క తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నుంచే ఏటా రూ.40 కోట్లు ఈ ఫండ్‌కు కేటాయిస్తారు. ఇప్పటివరకూ ఎన్నో ఏళ్లుగా టీటీడీ కేవలం రూ.1.25 కోట్లు మాత్రమే సీజీఎఫ్‌కు నిధులు కేటాయిస్తోంది. కానీ, దేవదాయ శాఖ ఆధీనంలో ఉండే శ్రీశైలం, శ్రీకాళహస్తి, విజయవాడ దుర్గగుడి వంటి దాదాపు తొమ్మిది ఆలయాలు అంతకంటే ఎక్కువ మొత్తంలోనే ఈ ఫండ్‌కు ఇస్తున్నాయి.

శ్రీశైలం దేవస్థానం దాదాపు రూ.11 కోట్లు వరకు అందజేస్తుండగా, శ్రీకాళహస్తి ఆలయం రూ.8 కోట్లు.. బెజవాడ దుర్గగుడి రూ.7 కోట్లు.. అన్నవరం ఆలయం రూ.5 కోట్లకు పైబడి.. ద్వారాక తిరుమల ఆలయం రూ.4.28 కోట్లు.. సింహాచలం ఆలయం రూ.4.54 కోట్లు.. కాణిపాకం ఆలయం రూ.3.72 కోట్లు దాకా నిధులు అందజేస్తున్నాయి. టీటీడీ మాత్రం 1987 నుంచి గత ఏడాది వరకు రూ.1.25 కోట్లు మాత్రమే ఇస్తోంది. దీంతో సీజీఎఫ్‌కు టీటీడీ వాటాను పెంచుతూ.. అందుకు దేవదాయ శాఖ చట్టానికి సవరణలు చేసేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఇటీవలే ఆమోదం తెలిపింది. 

కామన్‌ గుడ్‌ ఫండ్‌ అంటే..
ఏటా ఐదు లక్షలకు పైబడి ఆదాయం ఉండే ఆలయాల నుంచి వాటి ఆదాయంపై తొమ్మిది శాతం చొప్పున సీజీఎఫ్‌కు నిధులు కేటాయిస్తారు. వీటితో అవసరమైన శిథిల ఆలయాలకు నిధులు కేటాయించి వాటి పునర్నిర్మాణం.. లేదా ఆధునీకరణ పనులు చేపడతారు. ఆగమ, వేద పాఠశాలల నిర్వహణకూ ఈ ఫండ్‌ నుంచే నిధుల కేటాయిస్తారు. అలాగే, ఆదాయంలేని గ్రామీణ ప్రాంత ఆలయాల్లో నిత్య ధూప దీప నైవేద్యాలకు, అక్కడి అర్చకునికీ కొంత మొత్తం చెల్లిస్తారు. దేవదాయ శాఖ మంత్రి చైర్మన్‌గా, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్, టీటీడీ ఈఓలు సభ్యులుగా ఉండే కమిటీ ఎప్పటికప్పుడు సమావేశమై నిబంధనల ప్రకారం అవసరమైన వాటికి నిధులు కేటాయిస్తారు. ఇక రాష్ట్రంలో దేవదాయ శాఖ ఆధీనంలో ఉండే దాదాపు 1,500 ఆలయాలు మాత్రమే ఏటా ఐదు లక్షలకు పైబడి వార్షిక ఆదాయం పొందుతున్నాయని.. వాటి ద్వారా సీజీఎఫ్‌కు ఏటా రూ.80 కోట్ల నుంచి రూ.92 కోట్ల మధ్య నిధులు సమకూరుతున్నాయని అధికారులు వెల్లడించారు.

2008 నుంచి డీడీఎన్‌ఎస్‌ పథకం
నిజానికి రాష్ట్రంలో దేవదాయ శాఖ పరిధిలో వేలాది ఆలయాలు ఉన్నప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఆలయాల్లో ఎక్కువ భాగం తగిన ఆదాయంలేక రోజువారీ ధూప దీప నైవేద్యాలకు నోచుకోవడంలేదని దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి గుర్తించి 2008లో డీడీఎన్‌ఎస్‌ పథకాన్ని ప్రవేశపెట్టారు. అప్పుడు తొలిసారిగా.. ప్రస్తుత 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌ పరిధిలో 1,610 ఆలయాలకు ఈ పథకం ద్వారా సీజీఎఫ్‌ నుంచి నిధులు కేటాయించారు.  ప్రస్తుతం 1,660 ఆలయాలకు ఈ పథకం అమలుచేస్తున్నారు. కానీ, మరో 5,119 ఆలయాలకు ఈ పథకం నుంచి నిధులు కేటాయించాలంటూ దేవదాయ శాఖకు అందిన దరఖాస్తులను గత తెలుగుదేశం ప్రభుత్వం పెండింగ్‌లో పడేసింది. అలాగే, పాడుబడిన ఆలయాల ఆధునీకరణ, పునర్నిర్మాణానికీ వచ్చిన వందల దరఖాస్తులనూ ఆ సర్కార్‌ పట్టించుకోలేదని అధికారులు వెల్లడించారు. 

ఏటా రూ.130 కోట్లకు పైగా..
రాష్ట్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో ఒక్క టీటీడీ నుంచే ఇప్పుడు సీజీఎఫ్‌కు రూ.40 కోట్లు సమకూరితే.. సీజీఎఫ్‌కు ఇకపై ఏటా రూ.130 కోట్లకు పైగా వస్తాయని అధికారులు చెబుతున్నారు. దీంతో ఆదాయంలేని ఆలయాల అభివృద్ధికి గతం కంటే మెరుగ్గా నిధులు కేటాయించే అవకాశం ఉంటుంది. అలాగే, అర్చక సంక్షేమ నిధికి ఏటా మరో ఐదు కోట్లు, ఈఏఎఫ్‌ (ఎంప్లాయ్‌మెంట్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఫండ్‌)కు మరో ఐదు కోట్లు చొప్పున మొత్తం రూ.50 కోట్లు టీటీడీ నిధులు కేటాయించేలా ప్రభుత్వం చట్ట సవరణలు చేయనుంది.   

మరిన్ని వార్తలు