స్వప్నం సాకారం దిశగా.. 

25 Jul, 2020 13:33 IST|Sakshi
చెక్‌డ్యామ్‌ నిర్మాణం కానున్న ప్రాంతం 

పాములకాలువ చెక్‌డ్యామ్‌ నిర్మాణానికి నిధులు 

పూర్తయితే 3,235 ఎకరాలకు సాగునీరు 

హర్షం వ్యక్తం చేస్తున్న రైతాంగం 

రైతుల చిరకాల స్వప్నం సాకారమయ్యే సమయం ఆసన్నమైంది. చాలాకాలంగా సాగునీరు వృథాగా పోతున్నా రైతులు చేసేది లేక మిన్నకుండిపోయారు. దీనిపై స్థానిక ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య గత ప్రభుత్వ హయాంలో అనేకసార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయితే అప్పటి టీడీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. అనంతరం ఏర్పడిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చెక్‌డ్యామ్‌ ఆవశ్యకతను గుర్తించింది. రూ.3.96 కోట్ల నిధులను మంజూరు చేసింది. 

తడ : మండలంలోని మాంబట్టు పంచాయతీ, ఎన్‌ఎంకండ్రిగ గ్రామానికి ఎగువన చిత్తూరు జిల్లా పరిధిలోని చెంచురామశెట్టి కండ్రిగ వద్ద పాములకాలువకు అడ్డుగా చెక్‌డ్యామ్‌ను పటిష్ట పరచడం ద్వారా పలు చెరువులకు నీరు పుష్కలంగా చేరుతుంది. కాళంగి గ్రాయిన్, నెర్రికాలువ కెనాల్‌ సిస్టం అభివృద్ధి, పాములకాలువ నెల్లూరు జిల్లా ప్రారంభ ప్రాంతంలో ఆనకట్ట కట్టడం వంటి పనుల ద్వారా తడ ఉత్తర ప్రాంతంలోని అనేక పంచాయతీలతోపాటు సూళ్లూరుపేట, దొరవారిసత్రం మండలాల పరిధిలోని రైతులకు లబ్ధి చేకూరనుంది. కాలువ పొడవునా కాంక్రీట్‌తో కట్ట బలోపేతంతో నీరు వృథా పోకుండా వేగంగా చెరువులకు చేరి నీటి ఇబ్బంది లేకుండా వేలాది ఎకరాల్లో పంటసాగు చేసుకోవచ్చు. 
చెరువులకు సాగునీరు 
చెక్‌డ్యామ్‌ వల్ల ఎన్‌ఎం కండ్రిగ, మాంబట్టు, వెండ్లూరుపాడు, కాదలూరు పెద్ద, చిన్న చెరువులకు పుష్కలంగా నీరు చేరుతుంది.  
కాదలూరు చెరువులో నీరు లేక వృథాగా ఉన్న సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంక్‌ (ఎస్‌ఎస్‌ ట్యాంక్‌)కి నీరు చేరి తడ మండలంలోని అన్ని గ్రామాలకు శుద్ధి చేసిన తాగునీరు అందుతుంది.  
ఐదు చెరువుల కింద మొత్తం 3,235 ఎకరాలకు (ఆయకట్టు 1,649 ఎకరాలు, డైరెక్ట్‌గా మరో 1,586 ఎకరాలకు) సాగునీరు అందుతుంది. 
ఎమ్మెల్యే సంజీవయ్య చొరవతో.. 
ఎమ్మెల్యే సంజీవయ్య గత టీడీపీ పాలనలో చెక్‌డ్యామ్‌ ఆవశ్యకతపై అనేక పర్యాయాలు అధికారులను కలిశారు. అయితే అప్పటి అధికార టీడీపీ స్పందించలేదు. 
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇరిగేషన్‌ శాఖ మంత్రి డాక్టర్‌ పి.అనిల్‌కుమార్‌యాదవ్‌కు చెక్‌డ్యామ్‌ ప్రయోజనాలను వివరించారు.  
మంత్రి అనిల్‌ వెంటనే రూ.3.96 కోట్ల నిధులను మంజూరు చేయించారు.  
మంజూరైన నిధుల్లో రూ.కోటితో చెక్‌డ్యామ్‌ నిర్మాణం, మిగిలిన నిధులతో 4.4 కిలోమీటర్ల పొడవున మెయిన్‌కెనాల్‌ సప్లై చానల్‌కి లైనింగ్‌ పనులు, బ్రిడ్జిలు నిర్మించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.  
అవసరాన్ని బట్టి మరిన్ని నిధులు మంజూరయ్యేలా చూస్తానని ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య తెలిపారు.  
పనులు త్వరితగతిన పూర్తిచేయాలని అధికారులకు సూచించారు.  

అనుమతులు వచ్చాయి    
చెక్‌డ్యామ్‌ నిర్మాణానికి అనుమతులు వచ్చాయి. సర్వే పనులు పూర్తి చేసి టెండర్ల ప్రక్రియ పూర్తయిన వెంటనే పనులు ప్రారంభిస్తాం. సాగునీటి సమస్య పరిష్కారం కోసం ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య సూచనలు చేస్తున్నారు. ఆ మేరకు తడ ఉత్తర భాగంలో మిగిలిపోయిన కొండూరు, గ్రద్ధగుంట, చేనిగుంట, అండగుండాల పంచాయతీల్లోని చెరువులకు కూడా సాగునీరు చేరేలా ప్రణాళికలు రూపొందిస్తున్నాం. తడ దక్షిణ భాగంలో సాగునీటి ఇబ్బందులు తొలగించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సి ఉంది.  –   సతీష్‌బాబు, ఇరిగేషన్‌ డీఈ, సూళ్లూరుపేట 

మరిన్ని వార్తలు