అధికార లాంఛనాలతో అమర జవాన్లకు అంత్యక్రియలు

6 Apr, 2021 10:36 IST|Sakshi

సాక్షి, విజయనగరం/గుంటూరు: ఛత్తీస్‌గఢ్‌ మావోయిస్టుల కాల్పుల్లో వీర మరణం పొందిన అమర జవాన్లు రౌతు జగదీష్, మురళీకృష్ణ పార్థివ దేహాలకు స్వగ్రామాల్లో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. విజయనగరం జిల్లా గాజులరేగలో జగదీష్‌ స్వగృహం నుంచి అంతిమ యాత్ర ప్రారంభం కాగా, విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌, ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి, మేయర్‌ వెంపడాపు విజయలక్ష్మి, విశాఖ రేంజ్ డీఐజీ కాళిదాసు రంగారావు నివాళర్పించారు. జోహార్ జగదీష్ అంటూ నినాదాలు చేస్తూ.. స్థానికులు పూల వర్షం కురిపించారు.

వీర జవాన్‌ మురళీకృష్ణ అంత్యక్రియలు
ఛత్తీస్‌గఢ్‌ వద్ద మావోయిస్టుల దురాగతానికి గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం గుడిపూడికి చెందిన సీఆర్‌పీఎఫ్‌ జవాను శాఖమూరి మురళీకృష్ణ భౌతిక కాయానికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. పేద వ్యవసాయ కుటుంబానికి చెందిన శాఖమూరి రవీంద్రబాబు, విజయకుమారి దంపతుల చిన్నకుమారుడైన మురళీకృష్ణ ఆరేళ్ల క్రితం సీఆర్‌పీఎఫ్‌ జవానుగా ఉద్యోగంలో చేరి భరతమాత సేవకు అంకితమయ్యాడు. కోబ్రా–210 విభాగానికి చెందిన మురళీకృష్ణ ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లో విధులు నిర్వహిస్తున్నారు

మురళీకృష్ణకు గత ఏడాది ఆగస్ట్‌ 13న వివాహం జరగాల్సి ఉన్నప్పటికీ దగ్గరి బంధువు చనిపోవటంతో వాయిదా పడింది. ఈ ఏడాది మే 22న వివాహం జరుప తలపెట్టారు. ఈ నేపథ్యంలో ఈ నెల ఒకటో తేదీన మురళీకృష్ణ తల్లికి ఫోన్‌ చేసి మాట్లాడాడు. సెలవు మంజూరైందని, మే 15న ఇంటికివస్తానని చెప్పాడు. అలా చెప్పిన మూడో రోజే శాశ్వతంగా సెలవు తీసుకుని ఎవరికీ అందని లోకాలకు వెళ్లిపోయారు.

మరిన్ని వార్తలు