అడవిలో వదిలేసిన అవ్వ చనిపోయింది

2 Aug, 2020 09:47 IST|Sakshi
పాడె మోస్తున్న తహసీల్దార్, అమ్మఒడి నిర్వాహకులు (ఇన్‌సెట్‌) మృతిచెందిన గుర్తుతెలియని వృద్ధురాలు(ఫైల్‌)

అమ్మఒడిలో కన్నుమూసిన వృద్ధురాలు 

అంతిమ సంస్కారాలు నిర్వహించిన తహసీల్దార్‌

తహసీల్దార్‌ మానవత్వంపై సర్వత్రా ప్రశంసలు 

పలమనేరు: కన్నవాళ్లు పట్టించుకోకుండా అవ్వను వదిలించుకున్నారు. అలా అడవికి చేరి అనాథలా పడి ఉన్న అవ్వ కథనం ‘సాక్షి’లో ప్రచురితమైంది. స్పందించిన తహసీల్దార్‌ ఆమెను చిత్తూరులోని అమ్మఒడి అనాథాశ్రమానికి చేర్చారు. అక్కడ అనారోగ్యంతో అవ్వ శనివారం మృతి చెందింది. పలమనేరు సమీపంలోని పెంగరగుంట అడవిలో 90ఏళ్ళ వృద్ధురాలు  పడి ఉండగా స్థానికులు గుర్తించారు. దీనిపై గతనెల 12న ‘అడవిలో వదిలేశారు’ శీర్షికన ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన గ్రామ సచివాలయ సిబ్బంది ఆ వృద్ధురాలికి భోజనం పెట్టించారు. సమాచారం అందుకున్న తహసీల్దార్‌ శ్రీనివాసులు ఆమెను పలమనేరు ఏరియా ఆస్పత్రిలో చేర్పించి వైద్య సేవలు అందేలా చేశారు.

ఆపై కొంత కోలుకున్నాక గత నెల 16న చిత్తూరులోని అమ్మఒడిలో చేర్పించి, నిర్వాహకులకు రూ.10వేల ఆర్థికసాయాన్ని అందించారు. అక్కడ సేదతీరుతున్న వృద్ధురాలు శనివారం మృతి చెందింది. విషయం తెలిసిన వెంటనే తహసీల్దార్‌ శ్రీనివాసులు అక్కడికి చేరుకున్నారు. అమ్మఒడి నిర్వాహకులతో కలసి అంతిమ సంస్కారాలను నిర్వహించారు. ఆమె పాడెను సైతం తహసీల్దార్‌ శ్రీనివాసులు, అమ్మఒడి నిర్వాహకుడు పద్మనాభనాయుడు మోసి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ విషయం సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో తహసీల్దార్‌ను జనం మెచ్చుకుంటున్నారు. కోవిడ్‌ నేపథ్యంలో సొంతవాళ్లు చనిపోతేనే ముట్టుకోని ఈసమయంలో తహసీల్దార్‌ చూపిన చొరవను ప్రశంసిస్తున్నారు.


 

మరిన్ని వార్తలు