అమ్మా.. నేనేం పాపం చేశాను.! 

7 Feb, 2021 10:36 IST|Sakshi
అంత్యక్రియలకు శ్రీలేఖ మృతదేహాన్ని తరలిస్తున్న ట్రాన్స్‌జెండర్లు  

అందరు అమ్మల్లాగా నువ్వూ.. నవమాసాలు మోసి నాకు జన్మనిచ్చావు..  మగ పిల్లాడు పుట్టాడని సంతోషించావు.. కానీ.. ఆ దేవుడెందుకో నాకు మగతనం ఇవ్వలేదమ్మా.. ఇందులో నేను చేసిన తప్పేమిటమ్మా.. నేను ఎలా పుట్టాలో నా చేతిలో ఉందా అమ్మా.. ఎవరెన్ని మాటలు అన్నా నువ్వు నాకు అమ్మవే కదమ్మా..  మరి నేను ఈరోజు నీ బిడ్డను ఎందుకు కాలేకపోయానమ్మా.. నీ కడసారి చూపునకు కూడా నోచుకోనంతటి పాపం నేనేం చేశానమ్మా.. 
అమ్మా.. నీ మనసు నొప్పించి ఉంటే నన్ను క్షమించమ్మా.. 

(ఇది మరణించిన ఓ హిజ్రా ఆత్మఘోష..) 

కడప కల్చరల్‌: ఒక కాకి మరణిస్తే మిగతా కాకులు చుట్టూ చేరి ఆక్రందన చేస్తాయి. కోతి చనిపోతే సాటి కోతులు అక్కున చేర్చుకుని గోతిలో కప్పేస్తాయి. కానీ బాధ్యుడైన మనిషి మరణిస్తే సాటి మనిషి అటుంచి కన్న తల్లిదండ్రులే అసహ్యహించుకుంటే మానవత్వం బతికే ఉందనుకోవాలా? మనుషులమని చెప్పుకునేందుకే మనం సిగ్గుపడాలా? తన తప్పేమి లేకున్నా ట్రాన్స్‌జెండర్‌గా పుట్టిన కారణంగా కన్నబిడ్డను కాటికి చేర్చడానికి కన్నవారే ముందుకు రాకపోవడం మానవతా వాదులందరనీ కలచివేస్తోంది. వివరాలిలా ఉన్నాయి. జిల్లాలో దాదాపు 300కు పైగా ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు. వారు తనలాంటి మరికొందరితో కలిసి బృందాలుగా జీవిస్తున్నారు. భిక్షాటనతోనూ, ఉత్సవాల్లో నృత్యాలు చేసి జీవనం గడుపుతున్నారు. (చదవండి: వింత: కోడి ఆకారంలో మేక..)

కడప నగర శివార్లలో అలాంటి ఓ బృందం సభ్యురాలు శ్రీలేఖ శుక్రవారం మరణించింది. బృందం నాయకులు విషయాన్ని ఆమె తల్లికి తెలిపారు. ‘దాని పుట్టుకే వృథా.. మాకు అవమానకరం... చస్తే మేమేం చేయాలి.. మున్సిపాలిటీ వారికి చెప్పండి...ఈడ్చేస్తారు...అంటూ అసహ్యహించుకున్న సంఘటన ట్రాన్స్‌జెండర్ల బృందాన్ని ఆవేదనకు గురి చేసింది. తప్పనిసరి పరిస్థితుల్లో బృందం సభ్యులే తల్లిదండ్రుల బాధ్యతను భుజానికెత్తుకున్నారు. తమ నాయకురాలు సారిక ఆధ్వర్యంలో దాదాపు 150 మందికి పైగా ట్రాన్స్‌జెండర్లు ఆత్మబంధువులై నిలిచారు. శనివారం సహచరి మరణం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తూ అంత్యక్రియలు నిర్వహించారు. వారి గురించి తెలిసిన మానవతా వాదులైన పలువురు స్థానికులు ఈ కార్యక్రమానికి తమవంతు సహకారం అందించారు.(చదవండి: చేతిని అతికించి.. కుటుంబాన్ని బతికించారు

మరిన్ని వార్తలు