శాంతించిన గోదావరి

20 Jul, 2022 04:31 IST|Sakshi
ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నెమ్మదించిన వరద ప్రవాహం

గోదావరిలో మరింత తగ్గిన వరద 

ధవళేశ్వరం, భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక ఉపసంహరణ 

నేడు రెండో ప్రమాద హెచ్చరిక ఉపసంహరణకు అవకాశం 

18.59 లక్షల క్యూసెక్కులకు తగ్గిన ప్రవాహం 

17.40 అడుగుల నీటి మట్టం 

సాక్షి, అమరావతి/ధవళేశ్వరం: ఎగువన వర్షాలు తెరిపివ్వడం.. ఉప నదుల్లో ప్రవాహం తగ్గుతుండటంతో గోదావరి వరద ప్రవాహం మంగళవారం మరింతగా తగ్గింది. మంగళవారం రాత్రి 8 గంటలకు ధవళేశ్వరం బ్యారేజీలోకి 18,59,913 క్యూసెక్కుల ప్రవాహం చేరుతుండగా.. నీటి మట్టం 17.40 అడుగులకు తగ్గింది. దాంతో మూడో ప్రమాద హెచ్చరికను అధికారులు ఉపసంహరించుకున్నారు. ధవళేశ్వరం వద్ద నీటిమట్టం 13.75 అడుగుల దిగువకు వచ్చే వరకు రెండో ప్రమాద హెచ్చరికను కొనసాగించనున్నారు. బ్యారేజీ నుంచి గోదావరి డెల్టాకు 5,400 క్యూసెక్కులను విడుదల చేస్తూ.. మిగులుగా ఉన్న 18,54,413 క్యూసెక్కులను 175 గేట్లు ఎత్తి సముద్రంలోకి వదిలేస్తున్నారు.  

భద్రాచలంలోనూ తగ్గుముఖం 
ఎగువ భద్రాచలం వద్దకు వచ్చే వరద కూడా క్రమేణ తగ్గుతోంది. మంగళవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద 12,51,999 క్యూసెక్కులకు ప్రవాహం తగ్గడంతో నీటిమట్టం 49.6 అడుగులకు తగ్గింది. దాంతో అక్కడ కూడా మూడో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకున్నారు. భద్రాచలం వద్ద నీటి మట్టం 48 అడుగుల కంటే దిగువకు తగ్గే వరకూ రెండో ప్రమాద హెచ్చరికను కొనసాగించనున్నారు. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఎగువన కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీలోకి వచ్చే వరద 8,62,200 క్యూసెక్కులకు తగ్గింది.

దాని దిగువన తుపాకులగూడెం (సమ్మక్క) బ్యారేజీలోకి చేరుతున్న వరద 9,10,400 క్యూసెక్కులకు, సీతమ్మ సాగర్‌లోకి వస్తున్న వరద 11,65,362 క్యూసెక్కులకు తగ్గింది. వచ్చిన వరదను వచ్చినట్టుగా దిగువకు విడుదల చేస్తున్నారు. బుధవారం నాటికి భద్రాచలం వద్ద 43 అడుగుల కంటే దిగువకు గోదావరి ప్రవాహం చేరుకునే అవకాశం ఉంది. అప్పుడు మొదటి ప్రమాద హెచ్చరికను కూడా అధికారులు ఉపసంహరించుకుంటారు. వరద ప్రవాహం తగ్గినా పోలవరం ప్రాజెక్టు వద్ద అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. వచ్చిన వరదను వచ్చినట్టుగా దిగువకు విడుదల చూస్తూ.. వరదను సమర్థవంతంగా నియంత్రిస్తున్నారు.  

మరిన్ని వార్తలు