మరింత తగ్గిన దోమకాటు జ్వరాలు

24 Feb, 2021 04:38 IST|Sakshi

గత 7 వారాల్లో నామమాత్రంగా కేసులు 

కోవిడ్‌ సమయంలోనూ నియంత్రణ చర్యలు 

ఇప్పటివరకు డెంగీ కేసులు 11 మాత్రమే నమోదు 

సత్ఫలితాలిచ్చిన దోమతెరల పంపిణీ 

రానున్న వేసవిలో సురక్షిత తాగునీటిపై దృష్టి 

డయేరియా, టైఫాయిడ్‌ నియంత్రణకు ప్రణాళిక 

సాక్షి, అమరావతి: ఈ ఏడాది దోమకాటు జ్వరాలు మరింతగా తగ్గాయి. జ్వరాల తీవ్రత లేకపోవడంతో పెద్ద ఉపశమనం లభించినట్లయింది. 2019–20తో పోలిస్తే 2020–21లో మలేరియా, డెంగీ, చికున్‌గున్యా కేసులు భారీగా తగ్గాయి. 2019తో పోలిస్తే 2020లోను, 2020తో పోలిస్తే 2021 రెండు నెలల్లోను ఈ కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి. ఈ ఏడాది అంటే జనవరి నుంచి ఫిబ్రవరి 21 వరకు ఏడు వారాల్లో లెక్కిస్తే చికున్‌గున్యా కేసులు ఒక్కటి కూడా నమోదు కాలేదు. ఫిబ్రవరి చివరికి వేసవిలోకి వచ్చినట్లే. దీంతో దోమకాటు జ్వరాల ప్రమాదం తక్కువే. ఇక చూసుకోవాల్సిందల్లా కలుషిత నీటివల్ల వచ్చే డయేరియా, టైఫాయిడ్‌ వంటి కేసులను నియంత్రించుకోవడమే. కొద్దినెలలుగా కోవిడ్‌ కారణంగా ప్రభుత్వ యంత్రాంగం తీవ్ర ఒత్తిడిలో ఉన్నా దోమకాటు వ్యాధుల నియంత్రణపై పైచేయి సాధించింది. 

కలుషిత నీటి నియంత్రణకు కార్యాచరణ 
సాధారణంగా వేసవి కాలంలో కలుషిత నీరు తాగడం వల్ల డయేరియా, టైఫాయిడ్‌ వంటి కేసులు వస్తుంటాయి. వీటి నియంత్రణకు వైద్య ఆరోగ్యశాఖ, మున్సిపల్, పంచాయతీరాజ్‌శాఖ సంయుక్త కార్యాచరణతో ముందుకెళుతున్నాయి. పల్లెటూరి నుంచి పట్టణాల వరకు తాగునీరు పరిశుభ్రంగా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఆయా శాఖల అధికారులు దృష్టి సారించారు. 

26 లక్షల దోమతెరల పంపిణీ లక్ష్యం
రాష్ట్రంలో ఏజెన్సీతో పాటు పట్టణ ప్రాంతాల్లో కూడా దోమల ప్రభావం ఎక్కువగా ఉన్న చోట దోమతెరల పంపిణీ సత్ఫలితాలు ఇస్తోంది. ఈ ఏడాది చివరి నాటికి 25.94 లక్షల దోమతెరలు పంపిణీ చేయాలని సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటివరకు 1.14 లక్షల దోమతెరలు పంపిణీ చేశారు. ఎల్‌ఎల్‌ఐఎన్‌ (లాంగ్‌ లాస్టింగ్‌ ఇన్‌సెక్టిసైడల్‌ నెట్స్‌) పేరుతో ఇచ్చే ఈ దోమతెరలు దోమల నుంచి ఊరటనివ్వగలవు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఇవి మంచి ఫలితాలిచ్చాయి. వచ్చే సీజన్‌ నాటికి వీలైనంత వరకు దోమతెరలు పంపిణీ చేయాలని ప్రయత్నిస్తున్నారు. 

తగ్గిన కేసుల తీవ్రత 
గతంతో పోలిస్తే దోమకాటు జ్వరాల సంఖ్య గణనీయంగా తగ్గింది. మా ముందున్న లక్ష్యం సురక్షిత మంచినీరు అందించి డయేరియా, టైఫాయిడ్‌ వంటి జబ్బులు రాకుండా నియంత్రించడమే. దీనికోసం కార్యాచరణ రూపొందించాం. మిగతా శాఖలతో సమన్వయం చేసుకుంటున్నాం. 
– డాక్టర్‌ గీతాప్రసాదిని, ప్రజారోగ్య సంచాలకులు  

మరిన్ని వార్తలు