ఆరో రోజూ అదే ఆదరణ

17 May, 2022 04:15 IST|Sakshi
తణుకులో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరరావు

సాక్షి నెట్‌వర్క్‌: ఆరో రోజైన సోమవారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో పండగ వాతావరణంలో సందడిగా సాగింది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. వివిధ నియోజకవర్గాల్లో ప్రజాప్రతినిధులను స్థానికులు సాదరంగా ఆహ్వానించారు.

పలు సమస్యలు తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కరించారు. గుంటూరు, బాపట్ల, కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో ఉత్సాహపూరితంగా కార్యక్రమం జరిగింది. నేతలు గడప గడపకు వెళ్లి ప్రభుత్వ పథకాలతో చేకూరుతున్న లబ్ధిని ప్రజలకు వివరించారు. ప్రభుత్వం చేస్తున్న మేలును ప్రజలు కొనియాడారు.

ప్రజల నుంచి పలు సమస్యలపై వినతులు స్వీకరించారు. సంక్షేమ పథకాలకు సంబంధించిన కరపత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. పలువురు వృద్ధులు తాము బతికున్నంత వరకూ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికే ఓటు వేస్తామని చెప్పారు. కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల్లోని వివిధ నియోజకవర్గాల్లో గడప గడపకూ కార్యక్రమం కోలాహలంగా జరిగింది. ప్రజలు అడుగడుగునా సాదర స్వాగతం పలుకుతూ హారతులు పట్టారు. 

మరిన్ని వార్తలు