అర్హులందరికీ పథకాలు

24 May, 2022 05:21 IST|Sakshi
కృష్ణా జిల్లా ముదునూరులో ఇంటింటికీ పర్యటిస్తున్న పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి

‘గడప గడపకు’ కార్యక్రమానికి వాడవాడలా విశేష స్పందన

సాక్షి నెట్‌వర్క్‌: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. వైఎస్సార్‌ జిల్లా, అనంతపురం, శ్రీసత్యసాయి, ఉమ్మడి కృష్ణాజిల్లాల్లో సోమవారం ఈ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ప్రజాప్రతినిధులు, ఇతర నేతలు, కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాల గురించి ఆరా తీశారు. స్థానిక సమస్యలు ఏమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు.

నెల్లూరు జిల్లా, శ్రీకాకుళం, అన్నమయ్య, ప్రకాశం జిల్లాల్లో ప్రజలు ప్రస్తావించిన సమస్యలను వెంటనే పరిష్కారం అయ్యే విధంగా చూడాలని నేతలు అధికారులను ఆదేశించారు. ఇంటింటికీ వెళ్లి పథకాల గురించి వివరించారు. పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అందజేస్తోందన్నారు. ఇంకా ఎవరైనా అర్హులు ఉన్నట్లయితే వారికి కూడా అందిస్తామన్నారు.

ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోనూ గడప గడపకు మన ప్రభుత్వం ఉత్సాహపూరిత వాతావరణంలో జరుగుతోంది. ఎక్కడికక్కడ ప్రజలు నేతలను కోలాహలంగా స్వాగతం పలుకుతున్నారు. అలాగే, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లో 13వ రోజూ ప్రజలు అదే ఆదరణ చూపించారు. మూడేళ్ల కాలంలో ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను నాయకులు ప్రజలకు వివరించారు. సీఎం వైఎస్‌ జగన్‌ రాసిన లేఖను ప్రతి ఇంటికీ అందించారు. ఎక్కడికక్కడ స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 

మరిన్ని వార్తలు