Gadapa Gadapaki Mana Prabhutvam: సంక్షేమం.. సంతోషం

26 May, 2022 10:38 IST|Sakshi

నెల్లూరు(సెంట్రల్‌): ‘సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు మాకు అండగా నిలుస్తున్నాయి. ఆర్థికంగా భరోసా కల్పిస్తున్నాయి. ఆయన పాలనలో మేం సంతోషంగా ఉన్నాం.’ అని ప్రజానీకం చెబుతోంది. జిల్లాలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం కొనసాగుతోంది. బుధవారం ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు ప్రజల వద్దకు వెళ్లారు. వారికి సాదర స్వాగతం పలికారు. ఎమ్మెల్యేలు స్వయంగా ప్రతి గపడకు వెళ్తుండడంతో మీ వెంటే మేముంటామని జనం ముక్త కఠంతో చెప్పారు. సీఎం వైఎస్‌ జగన్‌కు తమ ఆశీస్సులు ఉంటాయని ఆనందంగా తెలియజేశారు.

అధికారులతో మాట్లాడుతూ..
నెల్లూరు రూరల్‌ పరిధిలోని ఆమంచర్ల పంచాయతీ అప్పయ్యకండ్రిగ గ్రామంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉదయం నుంచి ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలతో మాట్లాడారు. పథకాలు అందుతున్నాయా? లేదా? అని ఆరాతీశారు. సమస్యలు తెలుసుకుని అప్పటికప్పుడు అధికారులతో మాట్లాడి వాటి పరిష్కారానికి కృషి చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం వైఎస్‌ జగన్‌ అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ పథకం అర్హులకు అందేలా అన్ని చర్యలు తీసుకున్నామన్నారు.

సమస్యలు తెలుసుకుంటూ..
కందుకూరు నియోజకవర్గ పరిధిలోని పలుకూరు ప్రాంతంలో ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజల సమస్యలు తెలుసుకుంటూ, పరిష్కార మార్గాలు చూపుతూ ముందుకు సాగారు. ప్రతి చోటా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల అమలు వివరాలు తెలుసున్నారు. మీ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి పథకాలు అమలు చేస్తున్నారని లబ్ధిదారులకు ఎమ్మెల్యే చెప్పారు.

భరోసా కల్పిస్తూ.. 
ఆత్మకూరు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ నాయకుడు మేకపాటి విక్రమ్‌రెడ్డి ఆత్మకూరు మున్సిపల్‌ పరిధిలోని 5, 12, 13 వార్డుల్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని జరిపారు. ప్రతి ఇంటికి వెళ్లి యోగ క్షేమాలు తెలుసుకున్నారు. సంక్షేమ పథకాల అమలు గురించి ఆరా తీశారు. సమస్యలను పరిష్కరిస్తామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు బాగుండాలని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు.  సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనపై ప్రజలు ఆనందంగా ఉన్నారని విక్రమ్‌రెడ్డి చెప్పారు. నియోజకవర్గాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు.   

మరిన్ని వార్తలు