జగన్‌ పాలనలోనే ఎస్సీ, ఎస్టీలకు న్యాయం 

27 Jan, 2023 17:30 IST|Sakshi

ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ

కృష్ణాపురంలో గడపగడపకు మన ప్రభుత్వం

తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో కార్యక్రమం వంద రోజులు పూర్తి

తాడేపల్లిగూడెం రూరల్‌(పశ్చిమగోదావరి జిల్లా): సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి, సంక్షేమానికి వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. గురువారం సాయంత్రం తాడేపల్లిగూడెం మండలం కృష్ణాపురం గ్రామంలో వందవ రోజు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్‌ కట్‌ చేసి, ప్రజాప్రతినిధులకు, పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ఐదేళ్ల పాలనలో ఎస్సీల అభివృద్ధికి రూ.33,635 కోట్లు ఖర్చు చేస్తే, వైఎస్‌ జగన్‌ మూడున్నరేళ్ల పాలనలో రూ.48,909 కోట్లు ఖర్చు చేశారన్నారు.

ఎస్టీల అభివృద్ధికి చంద్రబాబు రూ.12,487 కోట్లు వెచ్చిస్తే, వైఎస్‌ జగన్‌ పాలనలో రూ.15,589 కోట్లు ఖర్చు చేశారన్నారు. దీన్ని బట్టి చూస్తే సీఎం జగన్‌ పాలనలోనే వారి అభివృద్ధికి అధిక నిధులు వెచ్చించినట్లు తేటతెల్లమవుతుందన్నారు. ఈ విషయాన్ని ఇటీవల ఎస్సీ, ఎస్టీలతో పవన్‌ ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రకటించకపోవడం శోచనీయమన్నారు. ఆయా సామాజికవర్గాలకు చంద్రబాబు హయాంలో అన్యాయం జరుగుతుంటే ఏనాడు పవన్‌ ప్రశ్నించలేదని దుయ్యబట్టారు. అయితే, జగన్‌ ప్రభుత్వంపై ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నారని విమర్శించారు. సంక్షేమ పథకాల పేరిట రాష్ట్రాన్ని జగన్‌ అప్పులపాలు చేస్తున్నారని విషప్రచారం చేస్తున్నారన్నారు.

చంద్రబాబు ఐదేళ్ళ పాలనలో పెద్దవాటాదారుడు ఎవరంటే రామోజీరావు అని వ్యాఖ్యానించారు. రూ.11వేల కోట్ల విలువైన పోలవరం ప్రాజెక్టును నామినేషన్‌ పద్ధతిలో రామోజీరావు అల్లుడికి కేటాయించిన ఘనుడు చంద్రబాబు అని విమర్శించారు. అటువంటి వ్యక్తులు నేడు పచ్చమీడియా వేదికగా ప్రభుత్వంపై అసత్యప్రచారాలు చేస్తున్నారన్నారు. దేశంలో అతి తక్కువ అప్పు కలిగిన రాష్ట్రంగా నాల్గవ స్థానంలోనూ, అప్పులు సక్రమంగా చెల్లిస్తున్న రాష్ట్రాల్లో ప్రథమ స్థానంలో ఆంధ్రప్రదేశ్‌ ఉందని, దీనిని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారని గుర్తు చేశారు. చంద్రబాబు హయాంలో ఏ రకమైన బడ్జెట్‌ ఉందో అదే విధమైన బడ్జెట్‌ నేడు జగన్‌ పాలనలో ఉందన్నారు. అయితే, నాడు చంద్రబాబు ఇంతటి సంక్షేమ పథకాలను ఎందుకు అమలు చేయలేదని నిలదీశారు.

రాష్ట్రంలో నేడు సమర్థవంతమైన పాలన సాగుతుందన్నారు. గతంలో వైఎస్సార్, సీఎం వైఎస్‌ జగన్‌ ప్రజలకు న్యాయం చేసేందుకు పాదయాత్రలు చేశారని, నేడు లోకేష్‌ పాదయాత్ర దేనికోసమని ప్రశ్నించారు. వార్డు మెంబరుగా కూడా గెలవలేని వ్యక్తి దొడ్డిదారిన ఎమ్మెల్సీగా, మంత్రిగా లోకేష్‌ పనిచేశాడన్నారు. మరలా ప్రజాక్షేత్రంలో పోటీ చేస్తే తుక్కుతుక్కుగా ఓడించారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు, పవన్‌ ధ్వయంలో పవన్‌ను సీఎం చేస్తానంటేనే గాని ఓట్లు పడే పరిస్థితి లేదని, దీనికి చంద్రబాబు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.

తొలుత గ్రామంలో రూ.60లక్షలు వ్యయంతో నిర్మించనున్న గ్రామ దేవత అలుసులమ్మ ఆలయానికి శంకుస్థాపన చేశారు. జెడ్పీటీసీ సభ్యుడు ముత్యాల ఆంజనేయులు, ఎంపీపీ పొనుకుమాటి శేషులత, వైస్‌ ఎంపీపీలు కట్టా రంగబాబు, సూర్పని రామకృష్ణ, సర్పంచ్‌లు రాజమహేంద్రవరపు లక్ష్మణరావు, పిచ్చుకల రాజారావు, ఎలిపే గాంధీ, ఎంపీటీసీ సభ్యులు మట్టా సత్యనారాయణ, మార్లపూడి సుబ్బారావు, జంపెల్ల సత్యవతి, నార్ని శంకరరావు, కళింగ కార్పొరేషన్‌ రాష్ట్ర డైరెక్టర్‌ సంపతరావు కృష్ణారావు, మండల సచివాలయాల కన్వీనర్‌ ముప్పిడి సంపత్‌కుమార్, జిల్లా నీటి సంఘం మాజీ డైరెక్టర్‌ ఈదర వెంకటేశ్వరరావు, సొసైటీ చైర్మన్లు వెలిశెట్టి నరేంద్రకుమార్, జడ్డు హరిబాబు, చిక్కాల సత్యనారాయణ, ఉప సర్పంచ్‌లు మేణ్ణి రామారావు, చిట్టూరి కాశీవిశ్వనాథం, తహసీల్దార్‌ వైకేవీ.అప్పారావు, ఎంపీడీవో ఎం.వెంకటేష్‌  పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు