సంక్షేమ పథకాలతో ఎంతో మేలు 

20 May, 2022 04:08 IST|Sakshi
తిరుపతి జిల్లా వెరుబొట్లపల్లిలో నేలటూరు నాగమ్మతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి

గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో లబ్ధిదారుల సంతోషం

సాక్షి నెట్‌వర్క్‌: గత కొద్దిరోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం విజయవంతంగా సాగుతోంది. వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ఉత్సాహపూరిత వాతావరణంలో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఏలూరు, పశ్చిమ గోదావరి , విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని వివిధ నియోజకవర్గాల్లో గురువారం ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమాన్ని ఉత్సాహపూరిత వాతావరణంలో నిర్వహించారు.

పల్లె ప్రజలు నేతలు, అధికారులను సాదరంగా ఆహ్వానించారు. తమకు సంక్షేమ పథకాలు అందుతున్న తీరును తెలియజేశారు. విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లో ఈ కార్యక్రమానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో విశేష స్పందన లభించింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని ప్రజాప్రతినిధులు అడిగి తెలుసుకుని వాటి గురించి వివరించారు. స్థానిక సమస్యలను నేతలు ఆరా తీశారు. అలాగే, ఉమ్మడి కృష్ణా, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో ఈ కార్యక్రమం అట్టహాసంగా జరుగుతోంది.
విశాఖలోని గంగవరంలో ప్రభుత్వ పథకాల గురించి వృద్ధురాలికి వివరిస్తున్న ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి  

నేతలు ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పథకాలను తెలియజేస్తున్నారు. గురువారం వర్షాన్ని సైతం లెక్కచేయకుండా కార్యక్రమంలో నేతలు పాల్గొన్నారు. సంక్షేమ పథకాలతో తమకు ఎంతో మేలు జరుగుతోందని కర్నూలు జిల్లా ప్రజలు ఎమ్మెల్యేలతో చెప్పుకున్నారు. ఇక తమ దృష్టికి వచ్చిన సమస్యలు పరిష్కరించాలని ప్రజాప్రతినిధులు అధికారులను ఆదేశించారు. వైఎస్సార్‌ కడప జిల్లా, శ్రీకాకుళం, అన్నమయ్య, ప్రకాశం జిల్లాల్లో అయితే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి అనూహ్య స్పందన లభిస్తోంది. ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజలతో మమేకమయ్యారు. ప్రజలు సైతం  జేజేలు పలుకుతూ నేతలకు స్వాగతం పలికారు. 

టీడీపీ మాజీ జెడ్పీటీసీకి రూ.2.84 లక్షల లబ్ధి 
పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీకి చెందిన పాలకొల్లు జెడ్పీటీసీ మాజీ సభ్యురాలు కోడి విజయలక్ష్మికి నవరత్నాల ద్వారా రూ.2,84,192ల మేర లబ్ధి చేకూరింది. గడప గడపకు.. కార్యక్రమంలో భాగంగా జెడ్పీ చైర్మన్, పాలకొల్లు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి కవురు శ్రీనివాస్‌ వారి ఇంటికెళ్లి పథకాలు పొందిన వివరాలతో కూడిన పత్రాన్ని ఆమెకు అందజేశారు. ఇవి మీరు పొందారు నిజమేనా అంటూ ఆమెను పలకరించారు. ఆమె నవ్వుతూ ‘అవునండి.. నిజమే’ అని బదులిచ్చారు. విజయలక్ష్మి భర్త విజయభాస్కర్‌ ప్రస్తుతం టీడీపీ మండలాధ్యక్షుడిగా ఉన్నారు. 

మరిన్ని వార్తలు