ప్రజల ముంగిటకు సంక్షేమ ఫలాలు

7 May, 2022 11:05 IST|Sakshi

వైఎస్సార్‌సీపీ ముఖ్యనేతల భేటీలో  రీజినల్‌ కో ఆర్డినేటర్ల దిశానిర్దేశం

కాకినాడ, కోనసీమ జిల్లాల్లో నేడు భేటీ

పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం

11 నుంచి గడపగడపకూ కార్యక్రమం

సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: మూడేళ్లుగా ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల ఫలాలను ప్రజల ముంగిటకు తీసుకువెళ్లేందుకు వైఎస్సార్‌ సీపీ శ్రేణులు సిద్ధమవుతున్నాయి. ఆ పార్టీ ప్రజాప్రతినిధులను, శ్రేణులను సమాయత్తం చేసే దిశగా అగ్రనేతలు సన్నాహక సమావేశాలకు శ్రీకారం చుట్టారు. వైఎస్సార్‌ సీపీని క్షేత్ర స్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇటీవల ప్రాంతీయ సమన్వయకర్తలను, కొత్త జిల్లాలకు అధ్యక్షులను నియమించి, కొత్త ఉత్సాహం నింపారు. ఈ క్రమంలో పార్టీ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ప్రాంతీయ సమన్వయకర్తలుగా నియమితులైన ఎంపీలు పిల్లి సుభాష్‌చంద్రబోష్, పెద్దిరెడ్డి మిధున్‌రెడ్డి తూర్పు సెంటిమెంట్‌గా శుక్రవారం తొలి సమావేశం నిర్వహించారు. రాజమహేంద్రవరంలో జరిగిన ఈ భేటీలో మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. శనివారం కాకినాడ, కోనసీమ జిల్లాల్లో ఇటువంటి సమావేశాలు నిర్వహించనున్నారు.

పార్టీ కార్యకర్తలకు గుర్తింపు
కార్యకర్తల నుంచి వచ్చే సూచనలు, సలహాలకు ప్రాధాన్యం ఇస్తామని చెబుతూ పార్టీలో వారికి గుర్తింపు ఉంటుందనే సంకేతాలను రీజినల్‌ కో ఆర్డినేటర్లు పంపించారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించడంతో పాటు చిన్నచిన్న లోపాలుంటే చక్కదిద్దేందుకు కూడా ముందుండాలని సూచించారు. ఏ కారణం చేతనైనా లబ్ధి పొందని వారుంటే సచివాలయంలో ఆరు నెలలకోసారి పరిశీలించి తిరిగి అమలు చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ నెల 11న అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో మత్స్యకార భరోసా కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వస్తున్నారని రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ తెలియజేశారు. మూడేళ్లలో దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా ప్రజల సంక్షేమానికి రూ.లక్షా 43 వేల కోట్లు వినియోగించలేదన్నారు. ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే సీఎం జగన్‌ అమలు చేశారని వివరించారు.

మిధున్‌రెడ్డికి ఘన స్వాగతం
వైఎస్సార్‌ సీపీ ప్రాంతీయ సమన్వయకర్తగా నియమితులై తొలిసారి జిల్లాకు వచ్చిన లోక్‌సభలో పార్టీ ఫ్లోర్‌లీడర్‌ మిధున్‌రెడ్డికి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నుంచి నేతలు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి అఖండ స్వాగతం పలికారు. మూడు జిల్లాల నుంచి తరలి వచ్చిన నేతలతో రాజమహేంద్రవరం కోలాహలంగా మారింది. మధురపూడి విమానాశ్రయానికి చేరుకున్న మిధున్‌రెడ్డికి పార్టీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, లోక్‌సభలో పార్టీ చీఫ్‌ విప్‌ మార్గాని భరత్‌రామ్, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ తదితరులు స్వాగతం పలికారు.

అనంతరం ఎయిర్‌పోర్టు సమీపాన ఉన్న తోటలో రాజానగరం నియోజకవర్గ ముఖ్య నేతలను మిధున్‌రెడ్డికి రాజా పరిచయం చేశారు. అక్కడి నుంచి రాజమహేంద్రవరం ఆర్‌అండ్‌బీ అతిథి గృహానికి వచ్చిన మిధున్‌రెడ్డిని పుష్పగుచ్ఛాలతో స్వాగతించారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి తానేటి వనిత, మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్యేలు తలారి వెంకట్రావు, గెడ్డం శ్రీనివాసనాయుడు, డాక్టర్‌ సత్తి సూర్యనారాయణరెడ్డి, ఎమ్మెల్సీలు తోట త్రిమూర్తులు, పండుల రవీంద్రబాబు, జెడ్పీ చైర్మన్‌ విప్పర్తి వేణుగోపాలరావు, రాష్ట్ర హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ దవులూరి దొరబాబు, కో ఆర్డినేటర్‌ చందన నాగేశ్వర్, డీసీసీబీ చైర్మన్‌ ఆకుల వీర్రాజు, రాజమహేంద్రవరం నగరాభివృద్ధి సంస్థ చైర్‌పర్సన్‌ మేడపాటి షర్మిలారెడ్డి, రాష్ట్ర తెలకుల, గాండ్ల కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ భవానీప్రియ, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు గిరజాల బాబు, కర్రి పాపారాయుడు, గుబ్బల తులíసీకుమార్, వట్టికూటి రాజశేఖర్, వాసిరెడ్డి జమీలు, జిల్లా ట్రేడ్‌ యూనియన్‌ అధ్యక్షుడు అడపా వెంకటరమణ, నగర అధ్యక్షుడు నందెపు శ్రీనివాస్, మాజీ ఫ్లోర్‌లీడర్‌ పోలు విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

గడప గడపకూ ప్రచారం
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సూచించిన విధంగా ఈ నెల 11 నుంచి గడపగడపకూ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకువెళ్లాలని మిధున్‌రెడ్డి, బోస్‌ దిశానిర్దేశం చేశారు. మంత్రుల నుంచి ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే వరకూ ప్రతి ఒక్కరూ బాధ్యతగా ప్రజల ముందుకు వెళ్లి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న అన్ని అంశాలనూ ప్రజలకు వివరించాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు.

ప్రతి సచివాలయాన్ని సందర్శించి, ప్రజల సమస్యలను జిల్లా ఇన్‌చార్జి మంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు చొరవ తీసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ ప్రజలకు జవాబుదారీగా ఉండాలని సూచించారు. నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయ సాధన, పార్టీ శ్రేణుల సమస్యలు తెలుసుకుని పరిష్కరించే ప్రక్రియను తాము చేపడతామని ప్రాంతీయ సమన్వయకర్తలు చెప్పారు. నాయకులు, కార్యకర్తల సమస్యల పరిష్కారానికి కృషి చేయడంలో కూడా ముందుంటామని ప్రాంతీయ సమన్వకర్తలు భరోసా ఇచ్చారు.

పథకాలపై ఫోకస్‌
వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అధ్యక్షతన రాజమహేంద్రవరంలో జరిగిన అంతర్గత సమావేశంలో అధిష్టానం నిర్దేశించిన విధివిధానాలపై మిధున్‌రెడ్డి, బోస్‌ ప్రజాప్రతిని«ధులకు వివరించారు. ఈ వివరాలను మిధున్‌రెడ్డి, బోస్, మంత్రి వేణు మీడియాకు వివరించారు. మూడేళ్లుగా అమలు చేసిన సంక్షేమ పథకాలతో ప్రభుత్వం పేదలు ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేసిందన్నారు.

దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమ పథకాల కింద నేరుగా రూ.లక్షా 43 వేల కోట్లు అందజేసిన విషయాన్ని ప్రజల ముంగిటకు తీసుకు వెళ్లాలని ప్రాంతీయ సమన్వయకర్తలు సూచించారు. కుల, మత, ప్రాంతీయ వివక్షకు తావు లేకుండా ప్రజల ఖాతాల్లో పథకాల నిధులు జమయ్యేలా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి సాహసోపేత నిర్ణయం తీసుకున్న విషయాన్ని ప్రతి ఒక్కరికీ వివరించడంలో భాగస్వామ్యులు కావాలన్నారు. ఈ విషయాలపై మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలతో సమన్వయకర్తలు సుదీర్ఘంగా చర్చించారు.

మరిన్ని వార్తలు