కీలక రోడ్డు నిర్మాణాలు చేపట్టిన మేఘా

16 Oct, 2020 15:18 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అభివృద్ధిలో ప్రముఖ మౌళిక సదుపాయాల సంస్థ ‘మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ’ పాలుపంచుకుంటోంది. ఇప్పటికే దేశ విదేశాల్లో ఎన్నో అంతర్జాతీయ ప్రాజెక్టులు పూర్తిచేసిన ఆ సంస్థ  ఏపీలోని అత్యంత కీలకమైన ప్రాజెక్టులు చేపట్టింది. ఉత్తర భారతానికి, దక్షిణ భారత్ కు కీలకమైన ఏపీలోని రహదారులను నిర్మిస్తోంది. 

ఆంధ్రప్రదేశ్ లో రెండు కీలకమైన  ఈ రహదారులను మేఘా ఇంజనీరింగ్ సంస్థ నిర్మించనుంది. వీటిని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ శుక్రవారం వర్చువల్ పద్దతిలో శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షత వహించారు. పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ రెండు రోడ్ల నిర్మాణంతో రవాణా వాహనాలకు సమయం, ఇంధనం ఆదా కానున్నాయి. 

16వ నెంబర్ జాతీయ రహదారిలో భాగంగా  చిన్న అవుటపల్లి నుంచి గొల్లపూడి వరకు బైపాస్ రోడ్ నిర్మాణం ఎంఈఐఎల్ చేపట్టింది.  ఇది 30 కిలోమీటర్ల పొడవున్న  ఆరు లేన్ల రహదారి. ఈ రోడ్ నిర్మాణం పూర్తి అయితే వాహన దారులు, ముఖ్యంగా రవాణా వాహనాలకు ఎంతో  ఉపయుక్తంగా ఉంటుంది. ప్రస్తుతం హైదరాబాద్, కోల్ కతా నుంచి వచ్చే వాహనాలు విధిగా విజయవాడ నగరం గుండా చెన్నై  వెళ్లాలి. ఈ బైపాస్ రోడ్ నిర్మాణం పూర్తి అయితే  హైదరాబాద్, కోల్ కతా నుంచి చెన్నై వైపు వెళ్లే వాహనాలు ఇక నేరుగా వెళ్లవచ్చు. అలాగే  నాయుడుపేట-రేణిగుంట 71వ నెంబర్  జాతీయ రహదారి ని మేఘా ఇంజనీరింగ్ నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ రహదారి రెండు లేన్లలో మాత్రమే ఉంది. వాహనాల రద్దీ వల్ల నిత్యం ప్రమాదాలు, ట్రాఫిక్ జామ్‌తో అటు వాహన దారులు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.

ప్రధాన పుణ్యక్షేతం తిరుమలకు వెళ్లే రహదారుల్లో ఇది కీలక మైంది. ఈ 57 కిలోమీటర్ల  ఆరు లేన్ల రోడ్ నిర్మాణం పూర్తి అయితే అటు తిరుమలకు, ఇటు చెన్నై, అటు బెంగళూరు, రేణిగుంట విమానాశ్రయం, శ్రీకాళహస్తి దేవాలయంపై వెళ్లేవారికి ఉపయుక్తంగా ఉంటుంది. నాయుడుపేట, రేణిగుంత  జాతీయ రహదారిలోని  నాయుడుపేట, రేణిగుంట, శ్రీకాళహస్తి, ఏర్పేడు పట్టణాలకు బైపాస్ రోడ్డును ఎంఈఐఎల్ నిర్మిస్తోంది.

జాతీయ రహదారి ప్రోజెక్టుల శంకుస్థాపన సందర్భంగా కేంద్ర మంత్రి  గడ్కరీ మాట్లాడుతూ దేశాభివృద్ధిలో రోడ్లు కీలక పాత్ర పోషిస్తాయి అన్నారు. ఆంధ్ర ప్రదేశ్‌లో జాతీయ రహదారుల నిర్మాణానికి కేంద్రం తన వంతు సాయం చేస్తుందని హామీ ఇచ్చారు. ఏపీ రహదారుల సమస్యలపై త్వరలో కేంద్ర, రాష్ట్ర అధికారులతో సమావేశం అవుతామని, హైవేలపై రోడ్డు ప్రమాదాల నివారణకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని అన్నారు.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో రహదారుల నెట్‌వర్క్ అభివృద్ధికి సహకారం అందించాల్సిందిగా కేంద్ర మంత్రిని  కోరారు. ఇప్పటికే పలు ముఖ్యమైన జాతీయ రహదారుల ప్రతిపాదనలు కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్నాయని వాటిని ఆమోదించటంతో పాటు, తాము ప్రతిపాదించే మరికొన్నింటిని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిందిగా కోరారు. తమ ప్రభుత్వం రాష్ట్రంలో రహదారుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటుందని వివరించారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు