Andhra Pradesh: సంపూర్ణ సహకారం

5 Mar, 2022 04:09 IST|Sakshi
పశ్చిమగోదావరి జిల్లా తాడువాయి పునరావాస కాలనీ మ్యాప్‌ను పరిశీలిస్తున్న కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

పోలవరం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: పోలవరం ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసేందుకు అన్ని విధాలా రాష్ట్ర ప్రభుత్వానికి సంపూర్ణ సహకారం అందిస్తామని కేంద్ర జల్‌ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ స్పష్టం చేశారు. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రక్రియపై 15 రోజులకు ఒకసారి చొప్పున మూడు నెలల పాటు సమీక్షించి.. ఉత్పన్నమయ్యే సమస్యలను పరిష్కరిస్తే, ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేయడానికి మార్గం సుగమమవుతుందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన సూచనలపై ఆయన సానుకూలంగా స్పందించారు.

కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ), పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ), రాష్ట్ర జల వనరుల శాఖ ఉన్నతాధికారులతో 15 రోజులకు ఒకసారి పెండింగ్‌ డిజైన్లు, ప్రాజెక్టు పనులు, నిర్వాసితులకు పునరావాసం కల్పనలో ప్రగతి, రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయాన్ని రీయింబర్స్‌ చేయడం వరకు అన్ని అంశాలపై సమీక్షించి, సమస్యలను పరిష్కరించి, నివేదిక ఇవ్వాలని కేంద్ర జల్‌ శక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరాంను షెకావత్‌ ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టు పనుల ప్రగతిపై ప్రత్యేక డ్యాష్‌ బోర్డును ఏర్పాటు చేయాలన్నారు. దాని ద్వారా పనుల పురోగతిని ఎప్పటికప్పుడు తెలుసుకుని, పనుల్లో వేగం పెంచడానికి చర్యలు చేపట్టవచ్చని అధికారులకు దిశా నిర్దేశం చేశారు. శుక్రవారం ఆయన విజయవాడ నుంచి హెలికాప్టర్‌లో సీఎం జగన్‌తో కలిసి తూర్పుగోదావరి జిల్లా ఇందుకూరు, పశ్చిమ గోదావరి జిల్లా తాడ్వాయి వద్ద నిర్మించిన పునరావాస కాలనీలను పరిశీలించారు.


పోలవరం ప్రాజెక్టును పరిశీలిస్తున్న కేంద్ర మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్, సీఎం జగన్‌ తదితరులు

రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన నిర్వాసితుల కాలనీలు, గృహాలు, కనీస మౌలిక సదుపాయాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. జీవన ప్రమాణాలు మెరుగుపడేలా నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తామన్నారు. ఆ తర్వాత హెలికాప్టర్‌లో పోలవరం ప్రాజెక్టు వద్దకు చేరుకున్న సీఎం వైఎస్‌ జగన్, కేంద్ర జల్‌ శక్తి శాఖ మంత్రి షెకావత్‌ ఏరియల్‌ సర్వే ద్వారా పనుల ప్రగతిని పరిశీలించారు. అనంతరం వ్యూపాయింట్‌ నుంచి పనులను పరిశీలించారు. అక్కడ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. ఆ తర్వాత పోలవరం ప్రాజెక్టు స్పిల్‌ వే, స్పిల్‌ చానల్, ఎగువ కాఫర్‌ డ్యామ్, దిగువ కాఫర్‌ డ్యామ్, ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌ డ్యామ్‌ (ఈసీఆర్‌ఎఫ్‌), డయా ఫ్రమ్‌ వాల్‌ పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. అనంతరం సీఎం జగన్‌తో కలిసి కేంద్ర జల్‌ శక్తి, పీపీఏ, రాష్ట్ర జల వనరుల శాఖ, పునరావాస విభాగం ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు పనుల ప్రగతి, నిర్వాసితులకు పునరావాసంపై రాష్ట్ర జల వనరుల శాఖ అధికారులు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. 

15 రోజుల్లోగా పెండింగ్‌ డిజైన్లు కొలిక్కి.. 
గోదావరికి 2019, 2020లలో వచ్చిన వరదల ఉధృతికి దిగువ కాఫర్‌ డ్యామ్‌ జెట్‌ గ్రౌటింగ్, ఈసీఆర్‌ఎఫ్‌ డయాఫ్రమ్‌ వాల్‌లో కొంత భాగం కోతకు గురైందని.. కోతకు గురైన ప్రాంతాన్ని ఎలా పూడ్చాలనే అంశంపై డిజైన్‌లను ఇచ్చామని.. వాటిని ఇప్పటిదాకా పీపీఏ, సీడబ్ల్యూసీ ఖరారు చేయలేదని రాష్ట్ర జల వనరుల శాఖ అధికారులు కేంద్ర మంత్రికి వివరించారు. దీని వల్ల పనుల్లో జాప్యం జరుగుతోందన్నారు. ఈ వ్యవహారంలో పీపీఏ సీఈవో చంద్రశేఖర్‌ అయ్యర్‌ తీరుపై మంత్రి షెకావత్‌ అసహనం వ్యక్తం చేశారు. అనవసర జాప్యాన్ని సహించే ప్రశ్నే లేదని హెచ్చరించారు. దేశీయ, విదేశీ సాంకేతిక నిపుణుల సహకారంతో డిజైన్‌లు ఖరారు చేయాలని ఆదేశించారు. పెండింగ్‌ డిజైన్‌లపై వారంలోగా పీపీఏ, సీడబ్ల్యూసీ, రాష్ట్ర జల వనరుల శాఖ అధికారులు, డీడీఆర్పీ(డ్యామ్‌ డిజైన్‌ రివ్యూ ప్యానల్‌) అధికారులతో సమావేశం నిర్వహించాలని చెప్పారు. 15 రోజుల్లోగా డిజైన్‌లను ఖరారు చేసి, నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. డిజైన్‌ల వల్ల పనుల్లో జాప్యం చోటుచేసుకుంటే పీపీఏ అధికారులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. 

ప్రాజెక్టు వ్యయాన్ని ఒక్కటిగా పరిగణించాలి 
పోలవరం ప్రాజెక్టు పనులకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయాన్ని రీయింబర్స్‌ చేసేందుకు పీపీఏ నియంత్రణ పెడుతోందని.. విభాగాల (కాంపొంనెంట్‌లు) వారీగా రీయింబర్స్‌ చేస్తోందని.. దీని వల్ల కుడి, ఎడమ కాలువల పనులు ముందుకు సాగని పరిస్థితి నెలకొందని కేంద్ర మంత్రి షెకావత్‌కు సీఎం వైఎస్‌ జగన్‌ వివరించారు. విభాగాల వారీగా వ్యయాన్ని రీయింబర్స్‌ చేస్తామనే షరతులు చూపి.. రూ.859.59 కోట్ల బిల్లులను పీపీఏ నిరాకరించిందని ఎత్తిచూపారు. ప్రాజెక్టు వ్యయాన్ని ఒక్కటిగానే పరిగణించి.. రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయాన్ని ప్రతి 15 రోజులకు ఒకసారి చెల్లిస్తే నిధుల కొరత ఉత్పన్నం కాదన్నారు.

ఇది ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేయడానికి దోహదపడుతుందని తెలిపారు. ప్రాజెక్టు పనులకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయం రూ.2,616 కోట్లను త్వరగా రీయింబర్స్‌ చేయాలని కోరారు. ఇందుకు కేంద్ర మంత్రి షెకావత్‌ సానుకూలంగా స్పందించారు. మిగతా 15 జాతీయ ప్రాజెక్టుల తరహాలోనే పోలవరం ప్రాజెక్టులో నీటి సరఫరా, తాగునీటి వ్యయాన్ని ఒక్కటిగా పరిగణించాలని సీఎం కోరారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి 2017–18 ధరల ప్రకారం సవరించిన అంచనా వ్యయం రూ.55,548.87 కోట్లుగా సీడబ్ల్యూసీ ఖరారు చేసి, ఆమోదించిందని.. దానికి ఇన్వెస్ట్‌మెంట్‌ క్లియరెన్స్‌ ఇవ్వాలన్నారు. ఆ మేరకు నిధులు విడుదల చేస్తే ప్రాజెక్టు సకాలంలో పూర్తి చేయడానికి అవకాశం ఉంటుందన్న సీఎం ప్రతిపాదనపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు.


జలవనరుల శాఖ అధికారులతో సమీక్షిస్తున్న కేంద్ర మంత్రి షెకావత్, సీఎం జగన్‌. చిత్రంలో మంత్రులు

నిర్వాసితులకు నగదు బదిలీ రూపంలో పరిహారం 
పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాస ప్యాకేజీ కింద చెల్లించాల్సిన నగదు పరిహారాన్ని డీబీటీ (ప్రత్యక్ష నగదు బదిలీ) విధానంలో వారి ఖాతాల్లో జమ చేయాలని సీఎం వైఎస్‌ జగన్‌ చేసిన ప్రతిపాదనపై వెంటనే చర్యలు చేపట్టాలని కేంద్ర మంత్రి జల్‌ శక్తి శాఖ అధికారులను ఆదేశించారు. నిర్వాసితులను ముంపు గ్రామాల నుంచి కాలనీలకు తరలించడంపై నిర్దిష్ట కార్యాచరణ ఉండాలని అధికారులకు సూచించారు. నెలవారీ కార్యాచరణ తయారు చేసి, ఆ మేరకు పునరావాసం కల్పించాలన్నారు. పునరావాస కల్పనపై పీపీఏ స్థాయిలో, కేంద్ర జల్‌ శక్తి మంత్రిత్వ శాఖ స్థాయిలో వారాల వారీగా ప్రగతి నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు. 

రాజమండ్రికి పీపీఏ కార్యాలయం 
పోలవరం ప్రాజెక్టు అథారిటీ కార్యాలయాన్ని రాజమండ్రికి తరలించాలని కేంద్ర జల్‌ శక్తి శాఖ మంత్రి షెకావత్‌కు సీఎం వైఎస్‌ జగన్‌ సూచించారు. దీని వల్ల పనులను ఎప్పటికప్పుడు పరిశీలించవచ్చని చెప్పారు. తద్వారా సమన్వయ లోపం తలెత్తదని.. çపనులు వేగంగా పూర్తి చేయడానికి అవకాశం ఉంటుందన్నారు. దీనిపై షెకావత్‌ సానుకూలంగా స్పందించారు. తక్షణమే పీపీఏ కార్యాలయాన్ని రాజమండ్రికి తరలించడానికి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సమీక్ష సమావేశం అనంతరం కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడారు. పునరావాసం కల్పనపై నిర్వాసితులతో మాట్లాడామని, రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి వారికి మెరుగైన రీతిలో వసతులు కల్పించడానికి చర్యలు తీసుకున్నామన్నారు. ప్రాజెక్టు పనులకు అడ్డంకిగా మారిన అంశాలపై సమీక్షించామని, ప్రాజెక్టును గడువులోగా పూర్తి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రులు ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్, ధర్మాన కృష్ణదాస్, మంత్రులు పి.అనిల్‌ కుమార్, పేర్ని నాని, కురసాల కన్నబాబు, తానేటి వనిత, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ, పినిపే విశ్వరూప్, శ్రీరంగనాథరాజు, పీపీఏ సీఈఓ జె చంద్రశేఖర్‌ అయ్యర్, జల వనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు