అక్రమార్జనకు ‘ఆధార్‌’ 

29 Oct, 2020 11:21 IST|Sakshi
నిందితులను అరెస్ట్‌ చూపుతున్న ఎస్పీ ఫక్కీరప్ప

రూటు మార్చిన ఆధార్‌ సెంటర్ల నిర్వాహకులు

దళారులను ఏర్పాటు చేసుకుని దందా

ఆధార్‌ కార్డుల డేటా ఇష్టారాజ్యంగా మార్పు 

గుట్టు రట్టు చేసిన పోలీసులు 

జిల్లా వ్యాప్తంగా 30 మంది అరెస్ట్‌ 

కంప్యూటర్లు, సెల్‌ఫోన్లు, ఇతర పరికరాల స్వాధీనం 

కర్నూలు: ఆధార్‌ సెంటర్ల నిర్వాహకులు బరి తెగించారు. దళారులను ఏర్పాటు చేసుకుని యథేచ్ఛగా దందా సాగించారు. ఆధార్‌ కార్డుల్లో వివరాలను ఇష్టారాజ్యంగా మార్పు చేసి.. వేలాది రూపాయలు వెనకేసుకున్నారు. ఈ ముఠాల గుట్టును జిల్లా పోలీసులు రట్టు చేశారు. 30 మంది నిందితులను కటకటాలకు పంపారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్‌ ఆడిటోరియంలో ఎస్పీ ఫక్కీరప్ప.. ట్రైనీ ఐపీఎస్‌ అధికారి కొమ్మి ప్రతాప్‌ శివకిశోర్‌తో కలిసి మీడియాకు వివరాలు వెల్లడించారు. పత్తికొండ, ఆదోని, నందవరం, బనగానపల్లె, పెద్దకడబూరు ప్రాంతాల్లోని ఆధార్‌ సెంటర్ల నిర్వాహకులు ముఠాలను ఏర్పాటు చేసుకుని.. ఆధార్‌ కార్డుల డేటా ఇష్టానుసారం మార్పు చేస్తూ భారీగా లబ్ధి పొందుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో  ఆయా పోలీస్‌ స్టేషన్ల సిబ్బందితో ప్రత్యేక  బృందాలు ఏర్పాటు చేసి దాడులు నిర్వహించారు. 

పత్తికొండ రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో కె.రామాంజనేయులు, ప్రసాద్, చంద్రశేఖర్, రామాంజనేయులు, బోయ వీరేష్‌, రవి, మల్లప్ప, హనుమంతరెడ్డి, హేమంత్‌ రెడ్డి, వెంకటేష్‌, అయ్యన్న, రమేష్‌, బాలప్ప, నగేష్‌ అనే వ్యక్తులను అరెస్టు చేశారు. వీరు కోసిగి, కౌతాళం, ఆదోని, పత్తికొండ, పెద్దతుంబళం ప్రాంతాలకు చెందిన వారు. వీరిలో ఎనిమిది మంది గతంలోనూ ఇదే వ్యవహారంలో అరెస్టయ్యారు. 
నందవరం పోలీసులు ఎమ్మిగనూరుకు చెందిన వీరేష్, పెద్దకడబూరుకు చెందిన విజయ్‌ మోహన్‌ రెడ్డిలను అరెస్ట్‌ చేశారు. పెద్దకడబూరు ఆధార్‌ సెంటర్లో తనిఖీలు నిర్వహించి..ల్యాప్‌టాప్, స్కానర్, ప్రింటర్, ఇతర పరికరాలు, పత్రాలు స్వాదీనం చేసుకున్నారు. ఆధార్‌ సెంటర్‌ను సీజ్‌ చేశారు.  
ఆదోని త్రీటౌన్‌ పీఎస్‌ పరిధిలో సత్యనారాయణ, మహమ్మద్‌ అలీ, హుస్సేన్‌ (ఆదోని టౌన్‌), మాబాషా(ఇస్వీ గ్రామం), ఆదోని టూటౌన్‌ పీఎస్‌ పరిధిలో అరవింద్, రాజు, షేక్షావలి, ఐశ్వర్య (వీరంతా ఆదోనివాసులు)లను అరెస్టు చేశారు. 
బనగానపల్లె పోలీసు సర్కిల్‌ పరిధిలో ఉప్పరి మద్దిలేటి, చాకలి నాగరాజు, కావలి రామాంజనేయులు, అప్పల్‌ రెడ్డి అమర్‌నాథ్‌ రెడ్డి, పోలూరు పుల్లయ్య, వర మహేంద్ర అనే వ్యక్తులను అరెస్టు చేశారు. వీరు అవుకు, బనగానపల్లె, తాడిపత్రి, పాణ్యం, గుంతకల్లు ప్రాంతాలకు చెందిన వారు. వీరి వద్ద నుంచి 3 ల్యాప్‌టాప్‌లు, 3 ఫింగర్‌ ప్రింట్‌ స్కానర్లు, 3 ఐరిస్‌ స్కానర్లు, 3 వెబ్‌ కెమెరాలు, 3 స్కానర్లు, ప్రింటర్లతో పాటు ఇతర పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.

వేల సంఖ్యలో కార్డుల మార్పిడి..
ఈ ముఠాల పరిధిలోని ఆధార్‌ సెంటర్లలో వేల సంఖ్యలో ఆధార్‌ కార్డుల డేటాను మార్పు చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో బయటపడిందని ఎస్పీ ఫక్కీరప్ప తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హత లభించేందుకు వీలుగా పుట్టిన తేదీ మార్చడం, పాన్‌కార్డు లేనివారికి నకిలీది సృష్టించి ఇవ్వడం, పాన్‌కార్డును ఆధారం చేసుకుని ఆధార్‌ కార్డుల్లో పుట్టిన తేదీ మార్పు చేయడం,  ఫొటోషాప్, మైక్రోసాఫ్ట్‌ పెయింట్‌ అప్లికేషన్ల సాయంతో డేటాను ఎడిట్‌ చేయడం వంటి అక్రమాలకు పాల్పడ్డారన్నారు. ఇందుకు గాను ఒక్కొక్కరి నుంచి రూ.5 వేల నుంచి రూ.6 వేల వరకు వసూలు చేశారన్నారు. జిల్లాలోని పది సచివాలయాలలో ప్రత్యేక పోలీసు బృందాలు విచారణ నిర్వహించగా.. 200 మందికి పైగా ఆధార్‌ కార్డుల్లో పుట్టిన తేదీ మార్పు కోసం దరఖాస్తు చేసుకున్నట్లు బయటపడిందన్నారు. ఈ వ్యవహారంలో ముఠా సభ్యులు కీలకంగా వ్యవహరించి దరఖాస్తులు చేయించారని, ఒక్కొక్కరు వందకు పైగా మార్పిడి చేయించినట్లు విచారణలో తేలిందని ఎస్పీ చెప్పారు. మీడియా సమావేశంలో సీఐలు సురేష్‌ బాబు, శ్రీరాములు, మహేశ్వరరెడ్డి పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు