ప్రాణాపాయ స్థితిలో ఉన్న మహిళకు ఎమ్మెల్యే వంశీ ఆపన్నహస్తం

30 Nov, 2022 12:09 IST|Sakshi
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న దుట్టా పావని 

సాక్షి, హనుమాన్‌జంక్షన్‌ రూరల్‌ (గన్నవరం): ‘రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్నా.. నాకు బతకాలని ఉంది.. నా ప్రాణాలు కాపాడండి..’ అంటూ ఓ మహిళ కన్నీటితో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌ను వేడుకుంది. చలించిన ఆయన తాను న్నానంటూ ఆమె భరోసా ఇచ్చారు. అతిక్లిష్టమైన శస్త్రచికిత్సకు ఏర్పాట్లు చేయటంతో పాటు, అందుకు అయ్యే ఖర్చును భరించారు.

బాపులపాడు మండలం హనుమాన్‌జంక్షన్‌కు చెందిన దుట్టా ఉదయ కిరణ్‌ రోజువారీ కూలిపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి భార్య పావని (22), ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. గతే డాది గన్నవరం మండలం కేసరపల్లి వద్ద పావని రోడ్డు ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో ఆమె తల రోడ్డుకు బలంగా తగలడంతో మెదడులో రక్తం గడ్డకట్టింది. ఎడమవైపు పుర్రె భాగం తీవ్రంగా దెబ్బతింది. దీంతో పావనిని కుటుంబ సభ్యులు ఎనికేపాడులోని ఓ కార్పొరేట్‌ ఆస్పత్రిలో చేరి్పంచారు. ఆస్పత్రి వైద్యులు రెండు సార్లు పావని బ్రెయిన్‌కు ఆపరేషన్లు చేశారు.

తలలో దెబ్బతిన్న పుర్రె భాగాన్ని శస్త్రచికిత్స చేసేందుకు కొద్దిరోజులు భద్రపరిచినా, ఆ తర్వాత పూర్తిగా దెబ్బతిందని వైద్యులు నిర్ధారించారు. దీంతో కృత్రిమ పుర్రె (ప్లాస్టిక్‌ సింకుల్‌) అమర్చాల్సి ఉందని, ఈ సర్జరీ తమ వల్ల కాదని వైద్యులు తేల్చి చెప్పారు. అప్పటికే రూ.10 లక్షలకు పైగా ఖర్చు కావటంతో ఉదయకిరణ్‌కు ఏమి చేయాలో పాలుపోలేదు. ఈ తరుణంలో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వద్దకు వెళ్లి తన ప్రాణాలు కాపాడాలని పావని కన్నీటి పర్యంతమైంది. చిన్న వయస్సులో ఆమెకు వచ్చిన కష్టాన్ని చూసి చలించిన ఎమ్మెల్యే వంశీమోహన్‌ తనకు తెలిసిన కార్పొరేట్‌ ఆస్పత్రి వైద్యులతో మాట్లాడి ఆమెను పరీక్షించాల్సిందిగా సూచించారు.

పావని తలను పూర్తిస్థాయిలో పరిశీలించిన వైద్యులు ఆమె తలలో కొప్పా త్రీడీ టెక్నాలజీతో కూడిన కృత్రిమ పుర్రె భాగాన్ని పెట్టి, దానిలో మెదడును అమర్చితే ప్రాణాలు కాపాడొచ్చని వైద్యులు తెలిపారు. పుర్రె తయారీకి రూ.3 లక్షల ఖర్చవుతుందని చెప్పారు. ఆ మొత్తాన్ని ఎమ్మెల్యే వంశీమోహన్‌ తక్షణమే అందించి, ప్రత్యేకంగా పుర్రె భాగాన్ని సిద్ధం చేయించారు. త్వరలోనే పావని తలకు ఆపరేషన్‌ పూర్తి చేసి పుర్రె అమర్చనున్నారని ఎమ్మెల్యే కార్యాలయం తెలిపింది.

మరిన్ని వార్తలు