బాబు పర్యటనకు దూరంగా గంటా శ్రీనివాసరావు

7 May, 2022 11:27 IST|Sakshi

మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు తెలుగుదేశం పార్టీలో ఇబ్బందులు ఎదురవుతున్నాయా? విశాఖ పర్యటనలో చంద్రబాబు కనీసం గంటా వైపు కన్నెత్తి చూసేందుకు కూడా ఇష్టపడలేదా? పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో కింద సీటుకే పరిమితమవ్వాల్సి వస్తుందన్న భయంతోనే పార్టీ సమావేశానికి మాజీ మంత్రి దూరంగా ఉన్నారా? గంటాను బాబుకు దగ్గర చేసేందుకు మాజీ మంత్రి నారాయణ చేసిన యత్నాలు విఫలమయ్యాయా? మొదలైన ప్రశ్నల పరంపరకు టీడీపీలోని వర్గాలు అవుననే సమాధానం ఇస్తున్నాయి.  


సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : తెలుగుదేశం పార్టీలో గంటా, అయ్యన్న ఉత్తర దక్షిణ ధ్రువాలు. సాధారణంగా అధినేతకు ఒకరు దగ్గరైతే మరొకరు దూరంగా ఉంటారు. విచిత్రంగా ఈసారి చంద్రబాబు పర్యటనలో ఇద్దరి పాత్ర పరిమితంగానే కనిపించింది. ఇది ఇప్పుడు పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. బాదుడే బాదుడు పేరుతో చంద్రబాబు చేపట్టిన విశాఖ పర్యటన మొత్తంలో ఎక్కడా గంటా వాసన లేకుండా పార్టీ కార్యక్రమం నడిచింది. మరోవైపు మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు కూడా కార్యక్రమంలో ఎక్కడా యాక్టివ్‌గా కనిపించకపోవడం గమనార్హం.

కేవలం చంద్రబాబుతో కరచాలనానికే ఆయన పరిమితమవ్వడం ఆ పార్టీ వర్గాలను ఆశ్చర్యచకితులను చేసింది. తనకు, తన కుమారుడికి సీటు ఇవ్వాలంటూ అయ్యన్న పెట్టిన ప్రతిపాదనపై చంద్రబాబు నుంచి సానుకూలత రాకపోవడంతోనే అయ్యన్న కాస్త దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, బాదుడే బాదుడంటూ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేని ధరల పెరుగుదల అంశంపై కార్యక్రమం చేపట్టడంపై అంతర్గతంగా ఇష్టం లేకపోవడమూ ఒక కారణమని తెలుస్తోంది. మొత్తంగా చంద్రబాబు విశాఖ పర్యటన సందర్భంగా ఆ పార్టీ నేతల్లో ఉన్న విభేదాలు మరోసారి బహిరంగమయ్యాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.  

మధ్యవర్తిగా నారాయణ....! 
వాస్తవానికి విశాఖ సిటీలో ఉత్తర నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గంటా శ్రీనివాసరావు గెలుపొందారు. అయినప్పటికీ గత మూడేళ్లుగా పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొనడం లేదు. అంతేకాకుండా కాపు మేధావుల సమావేశంలో మాత్రం ప్రత్యక్షమవుతున్నారు. హైదరాబాద్‌తో పాటు విశాఖలో జరిగిన సమావేశంలోనూ ఆయన పాల్గొన్నారు. ఈ వ్యవహారంపై చంద్రబాబు గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. ఒకవైపు జనసేనతో పొత్తుకు బాబు ప్రయత్నిస్తుండగా.... మరోవైపు కొత్త కేంద్రాన్ని గంటా ప్రోత్సహిస్తున్నారనే కోపంలో బాబు ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే తాజా పర్యటనలోనూ పట్టించుకోలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గంటాను బాబుకు దగ్గరకు చేసేందుకు మాజీ మంత్రి నారాయణ ప్రయత్నించినట్టు తెలుస్తోంది. అయితే, చంద్రబాబు మాత్రం ససేమిరా అన్నట్టు సమాచారం. 

బురదలోంచి వానపాములంటూ...! 
బురదలోంచి వానపాములు వస్తున్నాయంటూ పరోక్షంగా గంటా గురించి మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు కొద్దిరోజుల క్రితం వ్యాఖ్యానించారు. పార్టీ కష్టాల్లో ఉన్న సమయంలో గత మూడేళ్లుగా బయటకు రాలేదని... ఇప్పుడు తిరిగి వస్తున్నారని మండిపడ్డారు. ఇదే నేపథ్యంలో తాజాగా చంద్రబాబు పర్యటన సందర్భంగా పాల్గొనేందుకు గంటా శ్రీనివాసరావు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే విశాఖ విమానాశ్రయానికి చంద్రబాబును పలకరించేందుకు వెళ్లినట్టు తెలిసింది. అయితే, కనీసం చంద్రబాబు మాట వరుసకు కూడా గంటా మొహం చూడలేదని పార్టీ వర్గాలే పేర్కొంటున్నాయి.

అంతేకాకుండా పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో కూడా గంటా పాల్గొనలేదు. ఒకవేళ గంటా పాల్గొన్నప్పటికీ కేవలం కింద సీటుకే పరిమితమవ్వాలన్న సంకేతాలు రావడంతోనే వెళ్లలేదన్న వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. మరోవైపు గంటా శ్రీనివాసరావుపై అవకాశం వచ్చినప్పుడల్లా అయ్యన్న విమర్శలు గుప్పిస్తూనే ఉన్నాయి. గతంలోనూ గంటా భూకబ్జాలపై పరోక్షంగా అయ్యన్న విమర్శలు చేశారు. తాజాగా టీఎన్‌ఎస్‌ఎఫ్‌ సమావేశంలోనూ బురద పాములు ఇప్పుడు బయటకు వస్తున్నాయని.... బురద పాములు ఎవరో మీకు తెలుసంటూ మాట్లాడారు.

ఈ నేపథ్యంలోనే చంద్రబాబు కూడా గంటాను దూరంగా పెడుతున్నామన్న సంకేతాలు ఇస్తున్నారు. అయినప్పటికీ అయ్యన్న కూడా తనకు, తన కుమారుడికి సీటు ఇవ్వాలని కోరినట్టు తెలుస్తోంది. దీనిపై చంద్రబాబు నుంచి సానుకూలంగా సంకేతాలు రాకపోవడంతో అలక వహించి అంటీముట్టనట్టు ఉన్నట్టు సమాచారం. ఏదీఏమైనప్పటికీ చంద్రబాబు విశాఖ పర్యటనతో ఆ పార్టీలోని అంతర్గత కుమ్ములాటలు బహిర్గతమయ్యాయన్న అభిప్రాయం మాత్రం వ్యక్తమవుతోంది. 

మరిన్ని వార్తలు