గంటా ఆస్తుల వేలం..

12 Nov, 2020 08:42 IST|Sakshi

ఇండియన్‌ బ్యాంకుకు వడ్డీ సహా రూ.248.03 కోట్ల బకాయి 

నాలుగేళ్లుగా రుణం చెల్లించని ప్రత్యూష డైరెక్టర్లు

బకాయి రాబట్టేందుకు గంటా సహా డైరెక్టర్ల ఆస్తుల వేలానికి బ్యాంకు సన్నద్ధం 

ఇ–ఆక్షన్‌ సేల్‌ నోటీసు జారీ  

సాక్షి, విశాఖపట్నం: ఇండియన్‌ బ్యాంకుకు రుణం ఎగవేత వ్యవహారంలో టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పేరు మరోసారి తెరపైకి వచ్చింది. ఒకప్పటి ఆయన మానసపుత్రిక ప్రత్యూష కంపెనీ కోసం తీసుకున్న రుణం వడ్డీ సహా రూ.248.03 కోట్లు అయ్యింది. దీన్ని చెల్లించడానికి ప్రత్యూష డైరెక్టర్లు ముఖం చాటేయడంతో బ్యాంకు యాజమాన్యం బకాయిలను రాబట్టే చర్యలకు ఉపక్రమించింది. విశాఖ నగరంతో పాటు పలు ప్రాంతాల్లో బ్యాంకు గ్యారెంటీగా పెట్టిన ఆస్తులను ఈనెల 25న వేలం వేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఇందుకు సంబంధించిన ఇ–ఆక్షన్‌ సేల్‌ నోటీసును హైదరాబాద్‌లోని ఇండియన్‌ బ్యాంకు సామ్‌(ఎస్‌ఏఎం) బ్రాంచ్‌ జారీ చేసింది.     (గడువులోగా పోలవరం పూర్తి కావాల్సిందే)

పదవి నుంచి తప్పుకున్నా సరే.. 
ప్రత్యూష రిసోర్సెస్‌ అండ్‌ ఇన్‌ఫ్రా సంస్థ గతంలో తీసుకున్న రుణానికి సంబంధించి రూ.141.68 కోట్లు మేర బకాయి పడింది. దీన్ని చెల్లించాలని ఇండియన్‌ బ్యాంకు 2016, అక్టోబరు 4వ తేదీన తొలుత నోటీసులు పంపించింది. కానీ రుణ చెల్లింపుల్లో కంపెనీ చేతులెత్తేసింది. తదుపరి వడ్డీ సహా ఆ బకాయి రూ.248.03 కోట్లకు (రూ.248,03,85,547) చేరింది. దీంతో రుణం కోసం కుదువ పెట్టిన ప్రత్యూష గ్రూప్‌ ఆస్తులను వేలం వేయాలని బ్యాంకు నిర్ణయించింది. రుణాల చెల్లింపునకు బాధ్యులుగా గంటా శ్రీనివాసరావుతో పాటు పీవీ ప్రభాకరరావు, పీవీ భాస్కరరావు, నార్ని అమూల్య, పి.రాజారావు, కేబీ సుబ్రహ్మణ్యం, ప్రత్యూష రిసోర్సెస్‌ అండ్‌ ఇన్‌ఫ్రా, ప్రత్యూష గ్లోబల్‌ ట్రేడ్‌ లిమిటెడ్‌ సంస్థలను ఇండియన్‌ బ్యాంకు తన నోటీసులో పేర్కొంది. తాను సంస్థ డైరెక్టర్‌ పదవి నుంచి 2011 సంవత్సరంలోనే తప్పుకున్నానని, ఆ సంస్థ ఆర్థిక లావాదేవీలతో తనకు సంబంధం లేదని గంటా శ్రీనివాసరావు గతంలో ప్రకటించారు. వేలం వేయనున్న ఆస్తుల జాబితాలో ఆయనకు చెందిన ఆస్తులు కూడా ఉన్నాయి.  (బెయిల్‌ ఇప్పించి నిరసనలా?)

వేలం వేయనున్న ఆస్తులివే.. 
►నగరంలోని గంగులవారి వీధిలో ప్రత్యూష అసోసియేట్స్‌ పేరుతో ఉన్న వాణిజ్య భవనం (దీని రిజర్వు విలువ రూ.154.72 లక్షలు) 
►గంటా శ్రీనివాసరావు పేరుతో విశాఖలోని బాలయ్యశాస్త్రి లేఅవుట్‌లో త్రివేణి టవర్స్‌లోనున్న ఫ్లాట్, అదేచోట పి.రాజారావు పేరుతో ఉన్న 444 చదరపు గజాల విస్తీర్ణంలోనున్న మరో ఫ్లాట్‌ (వీటి విలువ రూ.150.75 లక్షలు) 
►ఎండాడ రెవెన్యూ గ్రామ పరిధిలో రుషికొండ గ్రామం వద్ద కేబీ సుబ్రహ్మణ్యం పేరుతో ఉన్న 503.53 చదరపు గజాల స్థలం (దీని రిజర్వు విలువ రూ.171.21 లక్షలు) 
►ప్రత్యూష అసోసియేట్స్‌ పేరుతో ద్వారకానగర్‌ మొదటి లైన్‌లోని శ్రీశాంతా కాంప్లెక్స్‌లో ఉన్న ఆస్తి (రిజర్వు విలువ రూ.94.19 లక్షలు) 
►పీవీ భాస్కరరావు పేరుతో తమిళనాడులోని కాంచీపురం జిల్లాలో షోలింగ నల్లూరులో 6వేల చదరపు గజాల భూమి (రూ.240 లక్షలు) 
►ప్రత్యూష అసోసియేట్స్‌ షిప్పింగ్‌ సంస్థకు తూర్పు గోదావరి జిల్లా కాకినాడ నగరంలోని సాంబమూర్తినగర్‌లో ఉన్న 1101 చదరపు అడుగుల విస్తీర్ణంలోనున్న ఆస్తి (రూ.308.46 లక్షలు), అదే సంస్థకు అక్కడే ఉన్న మరో 333.33 చదరపు గజాల విస్తీర్ణంలోని ఆస్తి (రూ.66.67 లక్షలు) 
►ఆనందపురం మండలం వేములవలసలో పీవీ భాస్కరరావు పేరుతో ఉన్న 4.61 ఎకరాల భూమి (రూ.2103.07 లక్షలు) 
►ప్రత్యూష రిసోర్సెస్‌ అండ్‌ ఇన్‌ఫ్రా సంస్థకు హైదరాబాద్‌లోని మణికొండలోని ల్యాంకో హిల్స్‌లో ఉన్న ఫ్లాట్‌ (రూ.247.69 లక్షలు)

మరిన్ని వార్తలు