అచ్యుతాపురం సెజ్‌లో మళ్లీ గ్యాస్‌ లీక్‌ 

3 Aug, 2022 07:50 IST|Sakshi

100 మందికి పైగా ఉద్యోగినులకు అస్వస్థత 

సాక్షి, అనకాపల్లి:  అచ్యుతాపురం సెజ్‌లో మరోసారి విష వాయువులు లీకై బ్రాండిక్స్‌ సీడ్స్‌–2 కంపెనీలో పనిచేసే 100 మందికి పైగా మహిళా ఉద్యోగులు అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం రెండో షిఫ్ట్‌లో సుమారు 2 వేల మంది సిబ్బంది విధుల్లో ఉన్నారు. సాయంత్రం 6.30 గంటలకు టీ బ్రేక్‌ సమయంలో ఒక్కసారిగా గ్యాస్‌ లీకవడంతో ఉద్యోగినులకు శ్వాస తీసుకోవడం కష్టమైంది.

వాంతులు, వికారంతో అనేకమంది స్పృహ తప్పి పడిపోయారు. అక్కడి వైద్య సిబ్బంది కొందరికి ప్రాథమిక చికిత్స అందించారు. 45 మందిని అనకాపల్లి ఎన్టీఆర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరికొందరిని ప్రైవేట్‌ ఆసుపత్రులకు తరలించారు. జిల్లా కలెక్టర్‌ రవి పట్టాన్‌శెట్టి, ఎస్పీ గౌతమి సాలి హుటాహుటిన ఘటన స్థలానికి వెళ్లారు. మిగతా ప్లాంట్‌లలో సిబ్బందిని పరిస్థితి అడిగి తెలుసుకున్నారు.

బాధితులకు మెరుగైన వైద్యం అందించండి: మంత్రి అమర్‌నాథ్‌ 
అచ్యుతాపురం ఘటనపై పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నా«థ్‌ కలెక్టర్‌ రవి పట్టాన్‌శెట్టితో మాట్లాడారు. గ్యాస్‌ లీక్‌కు కారణాలను తెలుసుకున్నారు. తక్షణమే బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా అధికారులను ఆదేశించారు.  

ఇదీ చదవండి: విశాఖ తీరంలో అరుదైన జీవి.. రాలిన ఆకులా చదునైన శరీరం, ఇదే ప్రత్యేకత

మరిన్ని వార్తలు