Visakhapatnam: టూరిజంలో వైజాగ్‌కు ట్రెండ్‌ సెట్‌ చేసే సత్తా

16 May, 2022 10:47 IST|Sakshi

గోవా కంటే మిన్నగా విశాఖ బీచ్‌లు 

10 విభిన్న రకాల పర్యాటకానికి పుష్కలంగా వనరులు 

వివిధ దేశాలకు ఛార్టర్‌ విమాన కనెక్టివిటీ పెరగాల్సిందే.. 

హోమ్‌స్టేలు పర్యాటకానికి ప్రధాన ఆకర్షణ 

అరకులోయను కూల్‌ డెస్టినేషన్‌గా తీర్చిదిద్దాలి 

పోర్ట్‌ ఆఫ్‌ కాల్‌గా క్రూయిజ్‌కు ఆహ్వానం పలికితే స్వర్గధామమే.. 

కేంద్ర పర్యాటక శాఖ మాజీ డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ గౌర్‌ కంజీలాల్‌

టీ ఆఫ్‌ డెస్టినీగా పిలుచుకునే విశాఖ నగరానికి పర్యాటక రంగంలో ట్రెండ్‌ సెట్‌ చేసే సత్తా ఉందని కేంద్ర పర్యాటక శాఖ మాజీ డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ గౌర్‌ కంజీలాల్‌ అన్నారు. ప్రణాళికా బద్ధంగా వ్యవహరిస్తూ ప్రాజెక్టులకు రూపకల్పన చేస్తే గోవా కంటే మిన్నగా విశాఖ బీచ్‌లను అభివృద్ధి చేయవచ్చన్నారు. అలాగే 10 విభిన్న రకాల టూరిజం డెస్టినేషన్‌గా వైజాగ్‌ను తీర్చిదిద్దవచ్చని వివరించారు. ఎయిర్‌ ట్రావెలర్స్‌ అసోసియేషన్‌ నిర్వహించిన సదస్సులో పాల్గొనేందుకు నగరానికి వచ్చిన గౌర్‌ కంజీలాల్‌.. టూరిజం రంగంలో విశాఖకు ఉన్న అవకాశాల్ని ‘సాక్షి’తో పంచుకున్నారు.   – సాక్షి, విశాఖపట్నం  

ప్రపంచంలో ప్రతి మనిషి ఆలోచనలు ఎప్పటికప్పుడు విభిన్నంగా మారిపోతున్నాయి. గ్లోబల్‌ మార్కెట్‌ టూరిజం ట్రెండ్‌కు తగినట్లుగా ఆలోచనలు చేస్తూ ప్రాజెక్టులను పరిచయం చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే ఒక ప్రాంతం గణనీయంగా అభివృద్ధి చెందేందుకు ఆస్కారం ఉంటుంది. ఈ వరుసలో అవకాశాలు పుష్కలంగా ఉన్న నగరాల జాబితాలో విశాఖపట్నం మొదటి స్థానంలో ఉంటుంది. ఇక్కడ పర్యాటక పరంగా వనరులు అపారంగా ఉన్నాయి. వాటన్నింటినీ అభివృద్ధి చేస్తే దేశంలో నంబర్‌ వన్‌గా మారుతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. 

క్లీన్‌ అండ్‌ పీస్‌ఫుల్‌ బీచ్‌లుగా..  
1952 నుంచి 1980 మధ్యలో భారత్‌లో పర్యటించింది కేవలం ఒక మిలియన్‌ పర్యాటకులు మాత్రమే. దీనిపై మేము లండన్‌ వెళ్లి అధ్యయనం చేశాం. అప్పుడే ఛార్టర్‌ విమానాలు నడపాలన్న ప్రతిపాదనలను తీసుకొచ్చాం. క్రమంగా ఒక్కో ప్రాంతానికి ఎయిర్‌ కనెక్టివిటీ పెంచుతూ పర్యాటకంగా అభివృద్ధికి దోహదపడింది. ఇదే కాన్సెప్ట్‌లో వైజాగ్‌కు పెద్ద సంఖ్యలో టూరిస్టులను ఆకర్షితుల్ని చెయ్యాలి. ఇందుకు కాన్సెప్ట్‌ డెవలప్‌మెంట్‌ చాలా అవసరం. దేశంలో ఉన్న 365 బీచ్‌లతో పోలిస్తే.. విశాఖలో మంచి బీచ్‌లున్నాయి. వీటన్నింటినీ క్లీన్‌ అండ్‌ పీస్‌ఫుల్‌ బీచ్‌లుగా తీర్చిదిద్దాలి. 

తీరప్రాంత వినియోగంతో అద్భుతాలు
విశాఖకు 135 కిలోమీటర్ల సువిశాల సాగర తీరం ఉన్నా.. టూరిజం పరంగా సరిగా వినియోగించుకోలేకపోతున్నారు. పోర్ట్‌ ఆఫ్‌ కాల్‌ పేరుతో క్రూయిజ్‌ టూరిజం అభివృద్ధి చేయవచ్చు. పెద్ద క్రూయిజ్‌ని సముద్ర మధ్య భాగంలో నిలిపి.. డైనింగ్, ఫంక్షన్‌లు నిర్వహించేలా, క్యాసినోలు మొదలైన కమర్షియల్‌ టూరిజంని ప్రవేశపెడితే అద్భుతంగా ఉంటుంది. గోవా ఈ తరహాలోనే అభివృద్ధి చెందింది. అక్కడ జనాభా 2 మిలియన్లుంటే.. వచ్చే పర్యాటకులు మాత్రం 5 మిలియన్లుంటారు. కారణం.. పర్యాటకుల అభిరుచికి అనుగుణంగా స్థానికుల్లోనూ మార్పు వచ్చింది. ఫలితంగా గోవా మొత్తం టూరిస్ట్‌ డెస్టినీగా మారిపోయింది. దానికంటే మిన్నగా విశాఖను అభివృద్ధి చేయవచ్చు. ప్రజలు ప్రభుత్వాలు ఆ దిశగా ఆలోచన చేస్తే... వైజాగ్‌ కచ్చితంగా.. దేశంలోనే నెంబర్‌ వన్‌ పర్యాటక ప్రాంతంగా మారుతుంది. 

ఛార్టర్‌లను అందుబాటులోకి తీసుకురావాలి.. 
ఛార్టర్‌లను విశాఖకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. పొరుగు దేశాల నుంచి ఛార్టర్లు వస్తే.. ఒకేసారి 400 మంది పర్యాటకులు వస్తారు. వారికి తగిన ఏర్పాట్లను కల్పించాల్సి ఉంది. దీనివల్ల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయి. గల్ఫ్, ఖతార్, కౌలాలంపూర్, బ్యాంకాక్, సింగపూర్, దుబాయ్, కొలంబో మొదలైన దేశాల నుంచి ఇక్కడి పర్యాటకులకు ఆహ్వానం పలికేలా ప్యాకేజీలు రూపొందించాలి. విదేశీ పర్యాటకులకు అనుగుణంగా ఎయిర్‌పోర్టులో మౌలిక వసతులు, నగరంలో సదుపాయాలు, హాస్పిటాలిటీ పెంచాలి. వైజాగ్‌ ప్రపంచాన్ని టూరిస్టులకు పరిచయం చేసేందుకు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ఉన్న స్టాఫ్‌ని నియమించుకోవాలి. 

10 విభిన్నతల టూరిజం..
బీచ్‌ టూరిజం, టెంపుల్‌ టూరిజం, క్రూయిజ్‌ టూరిజం, సస్టైనబుల్‌ టూరిజం, ఎకోటూరిజం, విలేజ్‌ టూరిజం, కల్చరల్‌ టూరిజం, అగ్రి టూరిజం, క్రియేటివ్‌ టూరిజం, డార్క్‌ టూరిజం.. ఇలా పది విభిన్న రకాల పర్యాటక అభివృద్ధికి కావల్సిన వనరులు విశాఖలో ఉన్నాయి. ఉదాహరణకు అరకులో కూల్‌ టూరిజం అభివృద్ధి చేయవచ్చు. గ్రామీణ విశాఖ, అరకు ప్రాంతంలో అగ్రి టూరిజం, విలేజ్‌ టూరిజం ప్రమోట్‌ చేస్తే అంతర్జాతీయ నగరాల నుంచి పర్యాటకులు క్యూ కడతారు. అదేవిధంగా.. హోమ్‌ స్టే సంస్కృతి తీసుకురావాలి. టూరిజం మార్కెట్‌లో హోమ్‌స్టేలకు మంచి డిమాండ్‌ ఉంది.   

మరిన్ని వార్తలు