అమ్మోనియం నైట్రేట్‌తో ఏపీకి ఎలాంటి ముప్పు లేదు

14 Aug, 2020 19:34 IST|Sakshi

సాక్షి, గుంటూరు: బీరూట్‌లో జరిగిన అమ్మోనియం నైట్రేట్ సంఘటనపై ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ గౌతమ్‌ సవాంగ్ స్పందించారు. అమ్మోనియం నైట్రేట్ వల్ల ఏపీకి ఎలాంటి ముప్పు లేదని డీజీపీ తెలిపారు. శుక్రవారం మంగళగిరి కార్యాలయం నుంచి జిల్లాల ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌లో గౌతమ్‌ సవాంగ్‌ కీలక వ్యాఖ‍్యలు చేశారు. గౌతమ్‌ సవాంగ్‌ మాట్లాడుతూ.. బీరూట్ లోని అమ్మోనియం నైట్రేట్ పేలుడుతో పోలీస్ శాఖ అప్రమత్తమైందని పేర్కొన్నారు. 

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అమ్మోనియం నైట్రేట్ నిల్వలు, వాడకం,  వినియోగంపై  ప్రత్యేక ద్రుష్టి సారించామని తెలిపారు. అమ్మోనియం నైట్రేట్‌ వినియోగం పై ఖచ్చితంగా నిబంధనలు అమలు చేయాలని కంపెనీలను ఆదేశించారు. నిబంధనలను అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు వెనకాడవద్దని గౌతం సవాంగ్ సూచించారు. కాగా అమ్మోనియం నైట్రేట్‌ పై 2012 సంవత్సరంలో రూపొందించిన నిబంధనలు :

లైసెన్సు లేకుండా ఎక్కడ కూడా తయారీకి అనుమతి లేదు.
అనుమతి లేకుండా ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి తరలించకూడదు.
లైసెన్స్ కలిగిన గిడ్డంగులలో మాత్రమే నిల్వ ఉంచాలి.
నిబంధనలకు లోబడి ఎగుమతులు, దిగుమతులు నిర్వహించాలి.
ఎంపిక చేసిన లైసెన్స్ కలిగిన వారికి మాత్రమే సరఫరా చేయాలి.
పేలుడు పదార్ధాలతో కలిపి అమ్మోనియం నైట్రేట్‌ను రవాణా చేయరాదు.
కొనుగోలు చేసిన అమ్మోనియం నైట్రేట్ కు అదనంగా రవాణాకు  అనుమతి లేదు.
18 ఏళ్ల లోపు వారిని, అంగవైకల్యం, అనారోగ్య సమస్యలతో ఉన్నవారిని ఉద్యోగులుగా నియమించకూడదు.
అనుమతి లేకుండా ఎక్కడ కూడా బ్లాస్టింగ్‌లకు ఉపయోగించరాదు.
అమ్మోనియం నైట్రేట్ ప్యాకింగ్ నిబంధనలను కచ్చితంగా పాటించాలి.

మరిన్ని వార్తలు