దిశ బిల్లు ఆమోదం కోసం.. కేంద్రాన్ని కోరతాం

21 Sep, 2021 04:11 IST|Sakshi
హీనా

మహిళా భద్రత దిశగా ఈ బిల్లు గొప్ప ముందడుగు  

రాష్ట్ర పోలీసు అధికారులతో పార్లమెంటరీ కమిటీ చైర్‌పర్సన్‌ హీనా విజయ్‌కుమార్‌ 

విలేకరుల సమావేశంలో డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ వెల్లడి 

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకువచ్చిన దిశ బిల్లు మహిళా భద్రత దిశగా అతిపెద్ద ముందడుగని ‘మహిళా సాధికారికతపై పార్లమెంటరీ కమిటీ’ ప్రశంసించిందని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ తెలిపారు. దిశ బిల్లును ఆమోదించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరతామని కూడా కమిటీ తెలిపిందన్నారు. మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ డాక్టర్‌ హీనా విజయ్‌కుమార్‌ నేతృత్వంలోని పార్లమెంటరీ కమిటీ శనివారం విశాఖపట్నంలో పర్యటించి పోలీసు శాఖలో మహిళా అధికారులు, ఉద్యోగులతో సమావేశమవడంతోపాటు దిశ పోలీస్‌ స్టేషన్‌ను సందర్శించిందని తెలిపారు. మహిళల భద్రత కోసం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం దిశ వ్యవస్థను తీసుకురావడం విప్లవాత్మక సంస్కరణగా పార్లమెంటరీ కమిటీ అభిప్రాయపడిందని చెప్పారు.

దిశ పోలీస్‌ స్టేషన్‌కు అనుసంధానంగా క్రైమ్‌ సీన్‌ మేనేజ్‌మెంట్‌ వాహనం ఏర్పాటు చేయడం ఎంతో ఉపయుక్తమైన అంశమని వైద్యురాలితోపాటు న్యాయవాది కూడా అయిన ఆమె ప్రశంసించారని తెలిపారు. దోషులను గుర్తించి 21 రోజుల్లో శిక్ష విధించాలనే నిబంధనలను దిశ బిల్లులో పొందుపరచడంతోపాటు అందుకు అవసరమైన దర్యాప్తు కోసం ఫోరెన్సిక్‌ ల్యాబొరేటరీల ఏర్పాటు, ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్ల నియామకం, ప్రత్యేక కోర్టుల ఏర్పాటుకు ప్రతిపాదించడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శమని చెప్పారని వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లో దిశ వ్యవస్థను తన స్వరాష్ట్రమైన మహారాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు, పోలీసు అధికారులు పరిశీలించి వెళ్లారని తెలుసుకుని ఆమె సంతోషం వ్యక్తం చేశారన్నారు. ఏపీ ప్రభుత్వం ఆమోదించిన దిశ బిల్లు వెంటనే చట్టంగా మారేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని, అందుకోసం కేంద్ర హోం, న్యాయ, మహిళా–శిశు సంక్షేమ మంత్రిత్వశాఖలతో చర్చిస్తామని చెప్పారని తెలిపారు. దిశ బిల్లు, అందులో నిబంధనలు, అంద్జుకు ఏర్పాటు చేసిన మౌలిక వసతుల వ్యవస్థపై పార్లమెంటరీ కమిటీ ప్రశంసలు కురిపించడం మహిళా భద్రత పట్ల రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని డీజీపీ పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు