మరింత పారదర్శకతతో పని చేస్తాం: డీజీపీ

23 Dec, 2020 15:12 IST|Sakshi

సాక్షి, అమరావతి: 2020లో పోలీసులు ఎన్నో ఛాలెంజ్‌లు ఎదుర్కొన్నారని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ అన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రజారోగ్య పరిరక్షణకు ప్రాణాలొడ్డి పని చేశారని తెలిపారు. జాతీయ స్ధాయిలో ఏపీ పోలీస్ యాప్‌కు బంగారు పతకం వచ్చిందన్నారు. బుధవారం ఆయన పోలీసు శాఖ వార్షిక నివేదిక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కోవిడ్‌ కట్టడికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం త్వరితంగా స్పందించిందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నేతృత్వంలో కరోనాను విజయవంతంగా ఎదుర్కొన్నామని తెలిపారు. పోలీసులు కోవిడ్‌ ఫ్రంట్‌ లైన్‌లో ఉండి ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. ఈ క్రమంలో 14 వేల మంది ఏపీ పోలీసులు మహమ్మారి బారిన పడగా, 109 మంది చనిపోయారని, వారి కుటుంబాలకు సెల్యూట్‌ చేస్తున్నామన్నారు. 

పోలీసు శాఖకు ఎన్నో అవార్డులు
'పీపుల్ ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది ప్రధాన లక్ష్యం. పేద, బడుగు, బలహీన వర్గాల వారికి అందుబాటులో ఉండేలా పోలీసింగ్ తీసుకొచ్చాం. పోలీసులు, ఏపీ ప్రభుత్వం నిబద్ధత కారణంగా మాకు అవార్డులు వచ్చాయి. రాబోయే రోజుల్లో మరింత పారదర్శకతతో పని చేస్తాం. ఇసుక, మద్యం పాలసీల నేపథ్యంలో స్పెషల్ ఎన్‌ఫోర్సుమెంట్ బ్యూరో ఏర్పాటు చేశాం. గత ఏడు నెలల్లో మద్యం అక్రమ రవాణాపై ఎస్ఈబీ ద్వారా 69,688 కేసులు నమోదవగా మొత్తం 1.94 లక్షల కేసులు ఎస్ఈబీలో నమోదు చేశారు' అని డీజీపీ తెలిపారు. (చదవండి: ఏపీ పోలీస్‌.. దేశానికే ఆదర్శం)

వారం రోజుల్లోనే 16 వేల మందిని రక్షించాం
'మహిళా భద్రతకు సంధించిన కార్యక్రమాలు కూడా చాలా చేపట్టాం. దిశ పోలీసు స్టేషన్ల సామర్ధ్యాన్ని పెంచడంతో పాటు దిశ పోలీసులకు ప్రత్యేక వాహనాలు, ప్రత్యేక టెక్నాలజీ, ఇన్వెస్టిగేషన్ సంబంధించిన మొబైల్స్ ఇచ్చాము. దిశకు అనుబంధంగా విశాఖ, విజయవాడ, తిరుపతి లలో ఫోరెన్సిక్ ల్యాబ్ లు ఏర్పాటు చేశాము. దిశ చట్టం వస్తే ఈ విధానం మొత్తం అత్యంత బలోపేతం అవుతుంది. దిశ యాప్ ఉన్న ఫోన్లు మూడు సార్లు షేక్ చేస్తే సమాచారం పోలీసులకు వెళుతుంది. ఏడు రోజుల్లో కేసుల విచారణ పూర్తవ్వాలి అనేది దిశ ఉద్దేశం. మహిళా భద్రతలో భాగంగా మహిళా మిత్ర అనేది ప్రారంభించాం. 25,298 మంది చిన్నపిల్లలను ఆపరేషన్ ముస్కాన్ ద్వారా సంరక్షించాము. 16,257 మంది పిల్లలను ఒక వారం రోజుల్లోనే సంరక్షించాం. స్పందన ప్రోగ్రామ్‌లో 21,827 కేసులు FIR చేశాం. జిల్లా ఎస్పీ, కమిషనర్, డీజీపీ కార్యాలయం, సీఎం కార్యాలయం వరకూ స్పందన వివరాలు చేరతాయి' అని డీజీపీ పేర్కొన్నారు.

స్పందన ద్వారా వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు
'52% మహిళలు స్పందన ద్వారా ఫిర్యాదులు చేశారు. రూల్ ఆఫ్ లా అనేది స్పందన ద్వారా సాధ్యం అయింది. ఏపీ పోలీస్ సేవా యాప్ ద్వారా 87 పోలీసు సేవలు నేరుగా ప్రజలకు ఇంటి వద్దనే అందుతాయి. ఎఫ్ఐఆర్ కూడా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఎఫ్ఐఆర్ కోసం‌ లంచం అడిగిన 6 కేసుల్లో పోలీసులను ఎసీబీ ట్రాప్‌లో పట్టుకున్నాం. ఈ రోజు వరకు 114581 ఎఫ్ఐఆర్‌లు డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. పోలీస్ సేవా యాప్‌ను సిటిజన్ సేవ యాప్‌గా కూడా చెప్పవచ్చు. 5234 మిస్సింగ్ కేసులు పోలీసు సేవా యాప్‌లో సెర్చ్ చేశారు. 4876 గుర్తెరుగని మృతదేహాల విషయంలో‌ సెర్చ్ జరిగింది. 7654 అరెస్టుల సెర్చ్ జరిగింది. సెకండ్ హ్యండ్ వెహికల్ మీద ఉన్న కేసుల విషయంలో 28,252 సెర్చ్‌లు జరిగాయి' అని గౌతమ్‌ సవాంగ్‌ తెలిపారు. (చదవండి: హోంగార్డులు నిస్వార్థ సేవకులు)

మరిన్ని వార్తలు