ఎవరినీ ఉపేక్షించేది లేదు.. బాధ్యులపై చర్యలు

13 Aug, 2020 11:47 IST|Sakshi

ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌

సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌శాఖకు వివిధ అంశాల్లో జాతీయస్థాయిలో 26 అవార్డులు దక్కాయని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ అన్నారు. అభివృద్ధి మార్పులు, టెక్నాలజీ వంటి వివిధ విభాగాల్లో జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం సంతోషకరమన్నారు. ఆయన ఇందిరాగాంధీ స్టేడియంలో జరుగుతున్న 74వ స్వాతంత్ర్య దినోత్సవ రిహార్సల్స్ లో పాల్గొని పోలీసు, భద్రతా,రిజర్వ్ బలగాలు నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. చీరాల ఘటనలో ఎస్‌ఐపై వెంటనే చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. గతంలో ఏ ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకోలేదని తెలిపారు. ఇలాంటి ఘటనల్లో ఎవరినీ ఉపేక్షించేది లేదని డీజీపీ స్పష్టం చేశారు.

రాజమండ్రి శిరోముండనం ఘటనపై డీజీపీ స్పందిస్తూ తమ దృష్టికి రాగానే ఎస్‌ఐని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు పంపించామని తెలిపారు. తన 34 ఏళ్ల సర్వీసులో ఒక పోలీసు అధికారిని ఇంత త్వరితగతిన అరెస్ట్ చేసింది లేదని, ఇదే ప్రథమం అన్నారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ కేసులకు వెనుకాడవద్దని పోలీస్‌శాఖకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందని తెలిపారు. స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాద ఘటనలో బాధ్యులపై చర్యలు తీసుకుంటామని, ఘటనపై ప్రాథమిక దర్యాప్తులో ముగ్గురిని అరెస్ట్ చేశామని డీజీపీ వెల్లడించారు.


 

>
మరిన్ని వార్తలు