ప్రతి జిల్లాలో ‘దిశ’ ప్రత్యేక కోర్టులు 

11 Jul, 2021 02:53 IST|Sakshi
మాట్లాడుతున్న డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ , తమ స్మార్ట్‌ఫోన్‌ల్లో ఎస్‌వోఎస్‌ బటన్‌ చూపిస్తున్న సచివాలయ మహిళా పోలీసులు, మహిళా మిత్రలు

డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌

సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాలో దిశ ప్రత్యేక కోర్డులను ప్రభుత్వం ఏర్పాటుచేయనుందని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ తెలిపారు. ఏయూ కన్వెన్షన్‌ సెంటర్‌లో విశాఖ రేంజ్‌ పరిధిలోని మూడు జిల్లాలకు సంబంధించిన సచివాలయ మహిళా పోలీసులు, మహిళా మిత్రలకు దిశ యాప్‌పై శనివారం అవగాహన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దిశ యాప్, సైబర్‌మిత్ర వాట్సప్, ఏపీ పోలీస్‌ సేవా యాప్‌ అందించే సేవలను నగర పోలీస్‌ కమిషనర్‌ మనీష్‌కుమార్‌ సిన్హా, టెక్నికల్‌ డీఐజీ పాలరాజు, దిశ డీఐజీ రాజకుమారిలు వివరించారు. అనంతరం డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర పోలీసులకు అదనపు బలంగా 15వేల మంది సచివాలయ మహిళా పోలీసులు మహిళల భద్రతకు సేవలందిస్తున్నారన్నారు. పోలీస్‌స్టేషన్‌ల్లో ఉండే మహిళా పోలీసులకు ఏవైతే అధికారాలు ఉంటాయో అవన్నీ సచివాలయ మహిళా పోలీసులకు ఉంటాయన్నారు. అవగాహన కార్యక్రమాలు ప్రతి డివిజన్, మండల, గ్రామాల స్థాయిలో దీనిని నిర్వహిస్తామన్నారు.

‘స్పందన’తో సామాన్య ప్రజలకు న్యాయం 
గతంలో పోలీస్‌స్టేషన్లలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంవల్ల అక్కడకు వెళ్లేందుకు ప్రజలు వెనుకడుగు వేసేవారని డీజీపీ అన్నారు. కానీ, వీటన్నింటికీ చెక్‌ చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘స్పందన’తో సామాన్య ప్రజలు నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారని వివరించారు. ప్రస్తుతం ఎఫ్‌ఐఆర్‌ నమోదైన 59 రోజుల్లో ఆ కేసు చార్జిషీట్‌ ఫైల్‌ చేయకపోతే.. తక్షణమే ఎస్పీకి మెసేజ్‌ వెళ్తుందన్నారు. కాగా, స్పందన కార్యక్రమం తీసుకొచ్చిన 20 నెలల కాలంలో 31,100 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినట్లు గౌతమ్‌ సవాంగ్‌ చెప్పారు. మరోవైపు.. ఏఓబీలో ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని డీజీపీ తెలిపారు. ఏజెన్సీలో గంజాయి సాగుకు మావోయిస్టులు సహకరిస్తున్నారని.. అలాగే, లేటరైట్‌ సమస్య ఇప్పటిది కాదని, దీనిని కావాలని కొందరు రాజకీయం చేస్తున్నారని డీజీపీ చెప్పారు.   

>
మరిన్ని వార్తలు