విద్వేషకారులపై కఠిన చర్యలు

14 Jan, 2021 04:26 IST|Sakshi

డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ హెచ్చరిక 

ఆలయాలు ఆపదలో ఉన్నాయంటూ దుష్ప్రచారం

తప్పుడు వార్తలు ప్రసారం చేస్తే తీవ్ర చర్యలు 

ఏపీలో ఆలయాలకు కల్పిస్తున్న భద్రతపై ఇతర రాష్ట్రాల ప్రశంసలు

58,871 దేవాలయాలకు జియో ట్యాగింగ్‌

43,824 సీసీ కెమెరాలతో నిరంతరం నిఘా 

సాక్షి, అమరావతి: దేవాలయాలపై సామాజిక, ప్రచార మాధ్యమాల్లో తప్పుడు వార్తలను ప్రసారం చేస్తూ మత విద్వేషాలను రెచ్చగొట్టే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ గౌతం సవాంగ్‌ హెచ్చరించారు. బుధవారం డీజీపీ కార్యాలయంలో అదనపు డీజీ రవిశంకర్‌ అయ్యన్నార్, సిట్‌ చీఫ్‌ జీవీజీ అశోక్‌కుమార్, డీఐజీలు రాజశేఖర్‌బాబు, పాల్‌రాజులతో కలిసి సవాంగ్‌ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఆలయాలు ఆపదలో ఉన్నాయంటూ దు్రష్పచారం జరుగుతోందన్నారు. ఎప్పుడో జరిగిన ఘటనలు ప్రస్తుతం జరిగినట్లుగా సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తూ సమాజంలో ఉద్రిక్తతలు రేకెత్తించేందుకు ప్రయతి్నస్తున్నారని చెప్పారు. పోలీసులు ఏమాత్రం పట్టించుకోవడం లేదంటూ కొందరు విమర్శించడం సరికాదని డీజీపీ సవాంగ్‌ పేర్కొన్నారు. కులం, మతం పేరుతో పోలీసులపై వ్యాఖ్యలు చేయడాన్ని తన 35 ఏళ్ల సర్వీసులో ఎప్పుడూ చూడలేదన్నారు. పోలీసులు కులమతాలకు అనుగుణంగా కాకుండా రాజ్యాంగానికి లోబడి పని చేస్తారని స్పష్టం చేశారు. గత ఐదేళ్లలో జరిగిన సంఘటనలను పరిశీలిస్తే ప్రస్తుతం తక్కువగా ఉన్నాయన్నారు. ఏపీలో ఆలయాలకు కల్పిస్తున్న భద్రతా ప్రమాణాలపై ఇతర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కూడా ప్రశంసలు అందుతున్నాయని చెప్పారు. 

పటిష్ట భద్రత.. నిరంతర నిఘా
గత ఏడాది సెప్టెంబరు 5వ తేదీ నుండి ఇప్పటి వరకు 58,871 దేవాలయాలను జియో ట్యాగింగ్‌తో అనుసంధానం చేసినట్లు డీజీపీ వెల్లడించారు. 13,089 దేవాలయాల్లో 43,824 సీసీ కెమెరాలతో నిరంతర నిఘాతో పటిష్ట భద్రత కల్పిస్తున్నట్లు చెప్పారు. దేవాలయాలకు సంబంధించి 29 కేసులను ఛేదించి 80 మంది కరుడుగట్టిన అంతర్రాష్ట్ర నేరస్థులు, ముఠాలను అరెస్టు చేసినట్లు తెలిపారు. దేవాలయాలలో ప్రాపర్టీ అఫెన్స్‌కు సంబంధించి 180 కేసులను ఛేదించి 337 మంది నేరస్థులను అరెస్టు చేశామన్నారు. తరచూ ఇలాంటి నేరాలకు పాల్పడే వారిపై పీడీ యాక్ట్‌  ప్రయోగిస్తామని హెచ్చరించారు. మత సామరస్యాన్ని కాపాడేందుకు ప్రతి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో కమిటీలు నియమిస్తామని డీజీపీ చెప్పారు. గ్రామ స్థాయిలో ఇప్పటి వరకు 15,394 రక్షణ దళాలను నియమించామని, త్వరలో మరో 7,862 దళాలను ఏర్పాటు చేయనున్నుట్లు వివరించారు. 

సమాచారం ఇవ్వండి.. 
ఆలయాలు, ప్రార్థనా మందిరాల పరిసరాల్లో అనుమానాస్పద వ్యక్తులు కదలికలు కనిపిస్తే వెంటనే 9392903400 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని డీజీపీ కోరారు.    

మరిన్ని వార్తలు