11 ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్‌

17 Nov, 2021 03:38 IST|Sakshi
క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ను కలిసి కృతజ్ఞతలు తెలుపుతున్న ఎమ్మెల్సీ అభ్యర్థులు డీసీ గోవిందరెడ్డి, పాలవలస విక్రాంత్, ఇషాక్‌బాషా

నామినేషన్లకు చివరి తేదీ ఈనెల 23

పోలింగ్‌ డిసెంబర్‌ 10న

డిసెంబర్‌ 14న ఓట్ల లెక్కింపు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో స్థానిక సంస్థల నియోజకవర్గాల నుంచి 11 ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు మంగళవారం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ అయింది. దీంతో మంగళవారం నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. మంగళవారం ఎటువంటి నామినేషన్లు దాఖలు కాలేదని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం వెల్లడించింది. గతంలో ఎన్నికైన ఎమ్మెల్సీల పదవీ కాలం ఈ ఏడాది ఆగస్టు 11తో ముగిసిన నేపథ్యంలో.. 11 ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలను నిర్వహిస్తోంది. గుంటూరు, కృష్ణా, విశాఖపట్నం స్థానిక సంస్థల నుంచి రెండేసి ఎమ్మెల్సీ స్థానాలకు, అనంతపురం, తూర్పు గోదావరి, విజయనగరం, చిత్తూరు, ప్రకాశం స్థానిక సంస్థల నుంచి ఒక్కో ఎమ్మెల్సీ స్థానాలకు డిసెంబర్‌ 10న పోలింగ్‌ నిర్వహించనున్నారు. 

ఎమ్మెల్యేల కోటా స్థానాలకు వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల నామినేషన్లు
ఇక ఎమ్మెల్యేల కోటాలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు వైఎస్సార్‌సీపీ  అభ్యర్థులు పాలవలస విక్రాంత్, ఇషాక్‌ బాషా, దేవసాని గోవిందరెడ్డిలు మంగళవారం నామినేషన్లు దాఖలు చేశారు. వెలగపూడిలోని అసెంబ్లీ సచివాలయంలో శాసన మండలి ఉప కార్యదర్శి, రిటర్నింగ్‌ అధికారి పీవీ సుబ్బారెడ్డికి నామినేషన్‌ పత్రాలతోపాటూ వైఎస్సార్‌సీపీ బీ–ఫామ్‌లను కూడా అందజేశారు. ముగ్గురు అభ్యర్థుల నామినేషన్‌ పత్రాలను పరిశీలించిన రిటర్నింగ్‌ అధికారి వారితో ఎన్నికల నియమావళిని అనుసరించి వ్యవహరిస్తామంటూ ప్రతిజ్ఞ చేయించారు.

ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ స్థానాలకు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులుగా పోటీచేస్తున్న ముగ్గురిలో తొలుత పాలవలస విక్రాంత్‌ నామినేషన్‌ పత్రాలను రిటర్నింగ్‌ అధికారికి అందజేశారు. అనంతరం దేవసాని గోవిందరెడ్డి, ఇషాక్‌ బాషా సమర్పించారు. వీరి వెంట డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రులు బొత్స సత్యనారాయణ, సీదిరి అప్పలరాజు, చీఫ్‌విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్‌ సుధ, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్‌రెడ్డి ఉన్నారు. 

అభ్యర్థులకు బీఫారాలు అందజేసిన సీఎం వైఎస్‌ జగన్‌
అంతకుముందు.. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులకు బీఫారాలు అందజేశారు. సీఎం క్యాంపు కార్యాలయంలో మంగళవారం వారు ముఖ్యమంత్రిని కలిశారు. ఎమ్మెల్యేల కోటాలో ఖాళీ అయిన ఎమ్మెల్సీల స్ధానాలకు తమను ఎంపిక చేయడంతో వారు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ఇదిలా ఉంటే.. పోటీలో వీరు ముగ్గురే ఉండడంతో వీరి ఎన్నిక ఏకగ్రీవం కానుంది. రిటర్నింగ్‌ అధికారి పీవీ సుబ్బారెడ్డి ప్రకటించడం లాంఛనమే.  

మరిన్ని వార్తలు