జనహితం కోరుతూ జెన్‌కో అడుగులు

30 Oct, 2020 18:59 IST|Sakshi

ఆమ్ల వాయువులకు అడ్డుకట్ట

థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల్లో ఎఫ్‌జీడీ ప్లాంట్లు మెగావాట్‌కు రూ.50 లక్షల ఖర్చు

సున్నపురాయితో సల్ఫర్‌కు చెక్‌

నిర్మాణాలకు అనువైన జిప్సమ్‌ తయారీ

గత సర్కారు నిర్లక్ష్యాన్ని సరిదిద్దే చర్యలు

పర్యావరణ శాఖ సూచనలకు కార్యాచరణ

సాక్షి, అమరావతి: వెలుగులు పంచే థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలు మరోపక్క విషవాయువులను వెదజల్లుతున్నాయి. దీన్ని తక్షణమే అదుపు చేయాలని కేంద్ర పర్యావరణ శాఖ అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. ముఖ్యంగా ఆమ్ల వాయువుల (సల్ఫ్యూరిక్‌ యాసిడ్‌) నియంత్రణ తప్పనిసరి చేసింది. వాస్తవానికి 2015లో తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పటికే అమలు కావాల్సి ఉంది. కానీ గత ప్రభుత్వం థర్మల్‌ ప్లాంట్లలో ప్లూగ్యాస్‌ డీ సల్ఫరైజేషన్‌ (ఎఫ్‌జీడీ) ప్రక్రియపై దృష్టి పెట్టలేదు. పర్యావరణానికి చేటు తెస్తున్న ఆమ్ల వాయువుల నియంత్రణపై ప్రస్తుత సర్కారు వేగంగా అడుగులేస్తోంది. రాష్ట్రంలోని థర్మల్‌ కేంద్రాల్లో ఎఫ్‌జీడీ ప్లాంట్ల ఏర్పాటుకు సిద్ధమైంది. 

సల్ఫర్‌తో చిక్కే..!
రాష్ట్రంలో ఏపీ జెన్‌కో పరిధిలో 5 వేల మెగావాట్ల సామర్థ్యం గల థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలున్నాయి. పూర్తి స్థాయిలో ఇవి విద్యుత్‌ ఉత్పత్తి చేయాలంటే రోజుకు 70 వేల మెట్రిక్‌ టన్నుల బొగ్గు అవసరం. బొగ్గును మండించినప్పుడు అందులోని నైట్రోజన్, సల్ఫర్‌ వంటి వాయువులు వెలువడతాయి. థర్మల్‌ కేంద్రాల నుంచి గాలిలోకి వెళ్లే వాయువుల్లో సల్ఫ్యూరిక్‌ యాసిడ్‌ బొగ్గు వినియోగంలో పాయింట్‌ ఒక్క శాతం మాత్రమే ఉండాలి. పాత విద్యుత్‌ కేంద్రాల వల్ల ఇది ఆరు రెట్లు ఎక్కువ ఉంటోందని పర్యావరణ శాఖ చెబుతోంది. విదేశీ బొగ్గు వాడే కేంద్రాల్లో ఇది పది శాతం వరకూ ఎక్కువగా ఉంటోంది. ఆమ్ల వర్షాలకు సల్ఫ్యూరిక్‌ యాసిడే కారణం. దాదాపు 50 కి.మీ. పరిధిలో దీని ప్రభావం ఉంటుంది. పంటలకు హాని చేస్తుంది. ప్రాణాలను హరించే జబ్బులకూ కారణమవుతుంది. (చదవండి: ‘థర్మల్‌’కు డిమాండ్)

ఎలా నియంత్రిస్తారు..?
బొగ్గును బాయిలర్‌లో మండించటం వల్ల సల్ఫ్యూరిక్‌ యాసిడ్‌ బయటకొస్తుంది. దీన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చిమ్నీ ద్వారా భూమికి 100 అడుగులపైకి పంపి గాలిలో కలుపుతారు. అది భూమిని చేరేలోపు తీవ్రత తగ్గుతుంది. ప్రస్తుతం థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలు అనుసరిస్తున్న విధానమిది. ఎఫ్‌జీడీ ప్రక్రియలో సున్నపురాయిని పొడిచేసి, నీళ్లతో కలిపి చిమ్నీపైకి పంపుతారు. రసాయన చర్య వల్ల సల్ఫర్‌ జిప్సమ్‌గా మారుతుంది. ఈ జిప్సమ్‌ను ఇళ్ల నిర్మాణానికి ఉపయోగిస్తారు.

భారీ ఖర్చే..!
ఎఫ్‌జీడీ ప్లాంట్‌ నిర్మించాలంటే ప్రతీ మెగావాట్‌కు రూ.50 లక్షలు ఖర్చు చేయాలి. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఏపీ జెన్‌కో దశల వారీగా ఈ ప్రక్రియను చేపడుతోంది. ముందుగా నార్ల తాతారావు థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం, కృష్ణపట్నం కేంద్రాల్లో ఎఫ్‌జీడీ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నారు. (చదవండి: ‘పవర్‌’ఫుల్‌ సెక్టార్)

టెండర్లు పిలుస్తున్నాం: శ్రీధర్‌, ఎండీ, జెన్‌కో
‘ఎఫ్‌జీడీ ప్లాంట్ల ఏర్పాటుకు టెండర్లు పిలుస్తున్నాం. ఇప్పటికే డాక్యుమెంట్లను జ్యుడీషియల్‌ ప్రివ్యూకు పంపాం. పర్యావరణానికి ఏమాత్రం హాని లేకుండా అత్యాధునిక టెక్నాలజీతో ఈ ప్లాంట్లను నిర్మించాలని చూస్తున్నాం’ అని జెన్‌కో ఎండీ శ్రీధర్‌ తెలిపారు. 

మరిన్ని వార్తలు