సచివాలయ సిబ్బంది, అధికారుల హాజరు సంతృప్తికరంగా లేదు 

26 Dec, 2022 05:53 IST|Sakshi

ప్రతి శాఖలో ఓపీ ఇన్‌చార్జి మధ్యాహ్నం 2 గంటల్లోపు సిబ్బంది హాజరు ఏకీకృతం చేయాలి 

సంబంధిత కార్యదర్శికి సమర్పిం­చాలి.. సమయపాలన పాటించని వారిపై చర్యలు తీసుకోవాలి 

మెమో జారీచేసిన సాధారణ పరిపాలన శాఖ 

సాక్షి, అమరావతి: రాష్ట్ర సచివాలయ సిబ్బంది, అధికారుల హాజరు ఏ మాత్రం సంతృప్తికరంగా లేదని సాధారణ పరిపాలన శాఖ పేర్కొంది. సమయపాలన పాటించమని అనేకసార్లు ఆదేశాలు జారీచేసినా ఫలితం ఉండటం లేదని పేర్కొంది. ఏపీ సచివాలయ ఆఫీస్‌ మాన్యువల్‌ నిబంధనల మేరకు కార్యాలయాలకు హాజరవడంలో సమయపాలన పాటించడం లేదని తెలిపింది. ఉద్యోగులకు సంబంధించి సమయపాలన నిర్ధారించే బాధ్యత సంబంధిత విభాగాలపై ఉంటుందని సాధారణ పరిపాలన శాఖ ఇటీవల అన్ని శాఖలకు జారీచేసిన మెమోలో స్పష్టం చేసింది.

ఈ నేపథ్యంలో శాఖలోనే ఓపీ సెక్షన్‌ ఇన్‌చార్జి రోజూ మధ్యాహ్నం 2 గంటల్లోపు సిబ్బంది హాజరును ఏకీకృతం చేయాలని మెమోలో సూచించింది. ఆ ఫైలును అదేరోజు సంబంధిత కార్యదర్శికి సమర్పించాలని పేర్కొంది. సమయ­పాలన పాటించనివారిపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖ కార్యదర్శికి సూచించింది. ప్రస్తుతం సచివాలయంలో వారానికి ఐదురోజుల పనిదినాల్లో భాగంగా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం5.30 గంటల వరకు అధికారులు, సిబ్బంది తమ కార్యాలయాల్లో ఉండాల్సి ఉంది. అయితే సోమవారం, శుక్రవారాలైతే సిబ్బందితో పాటు అధికారులు సమయపాలన సంతృప్తికి చాలా దూరంగా ఉంది.

ప్రస్తుతం ఉదయం 11 గంటలకు, సాయంత్రం 5 గంటలకు సిబ్బంది, అధికారుల హాజరు నమోదు చేస్తుండగా చాలా ఆశ్చర్యకర అంశాలు వెల్లడవుతున్నాయి. ఉదయం 11 గంటలకు 70 నుంచి 75 శాతం ఉంటున్న సచివాలయ ఉద్యోగుల హాజరు సాయంత్రం 5 గంటలకు 40 నుంచి 45 శాతానికి మించి ఉండటం లేదు. ఈ నేపథ్యంలోనే సాధారణ పరిపాలన శాఖ మధ్యాహ్నం 2 గంటలకే హాజరు వివరాలను సంబంధిత శాఖ కార్యదర్శికి పంపాలని, సమయ­పాలన పాటించని ఉద్యోగులపై కార్యదర్శి తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది.     

తనిఖీలు చేయాలని నిర్ణయించుకున్న సీఎస్‌ 
సచివాలయ ఉద్యోగులు సమయపాలన పాటించకపోవడాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కె.ఎస్‌.జవహర్‌రెడ్డి తీవ్రంగా పరిగణించారు. ఈ నేపథ్యంలో సచివాలయ సిబ్బంది, అధికారుల హాజరును పరిశీలించేందుకు ఆకస్మికంగా సందర్శించాలని ఆయన నిర్ణయం తీసుకున్నారని సాధారణ పరిపాలన శాఖ జారీచేసిన మెమోలో తెలిపింది. 

మరిన్ని వార్తలు