ఏపీ: శైలజానాథ్‌ తొలగింపు.. పీసీసీ కొత్త చీఫ్‌గా గిడుగు రుద్రరాజు

23 Nov, 2022 21:14 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ పీసీసీ అధ్యక్షుడిగా గిడుగు రుద్రరాజును నియమించింది కాంగ్రెస్‌ అధిష్టానం. ఈ మేరకు బుధవారం సాయంత్రం అధికారిక ప్రకటన వెలువడింది. 

చాలాకాలంగా ఏపీసీసీ చీఫ్‌ను మార్చే యోచనలో ఉంది కాం‍గ్రెస్‌ అధిష్టానం. శైల‌జానాథ్ ప‌నితీరు స‌రిగా లేద‌ని అధిష్టానం భావిస్తూ వస్తోంది. ఈ క్రమంలో ఏడాది కాలంగా పలువురి పేర్లను పరిశీలించింది. ఇక శైలజనాథ్‌ను పీసీసీ చీఫ్‌గా తొలగిస్తూనే.. గిడుగు రుద్రరాజు నియామకానికి మొగ్గు చూపించింది ఏఐసీసీ.

గిడుగు రుద్ర‌రాజు.. ఏఐసీసీ కార్య‌ద‌ర్శిగా ఒడిశా రాష్ట్ర స‌హాయ ఇన్‌చార్జి బాధ్య‌త‌లు నిర్వ‌హించారు. గ‌తంలో ఎమ్మెల్సీగా ప‌నిచేయ‌డంతో పాటు వైఎస్సార్‌, కెవీపీలకు స‌న్నిహితుడిగా మెలిగారు. చిన్ననాటి నుంచి కాంగ్రెస్‌లోనే పెరిగిన గిడుగు.. పార్టీ కోసం చురుగ్గా తిర‌గ గ‌లుగుతార‌నే అధిష్టానం భావించినట్లు తెలుస్తోంది.

ఇక ఏపీలో హస్తం పార్టీ బలోపేతానికి పద్దెనిమిది మందితో పొలిటికల్‌ అఫైర్స్‌ కమిటీ, 34 మందితో కో-ఆర్డినేషన్‌ కమిటీ ఏర్పాటు చేసింది. వర్కింగ్‌ ప్రెసిడెంట్లుగా మస్తాన్‌వలీ, జంగా గౌతమ్‌, సుంకర పద్మశ్రీ, పీ రాకేష్‌, ప్రోగ్రామ్‌ కమిటీ చైర్మన్‌గా పల్లంరాజు, ప్రచార కమిటీ చైర్మన్‌గా జీవీ హర్షకుమార్‌, మీడియా కమిటీ చైర్మన్‌గా తులసిరెడ్డిలను నియమిస్తున్నట్లు ప్రకటించింది ఏఐసీసీ.

ఇదీ చదవండి: శివయ్య ప్రసాదం.. మూగజీవులకు ఆహారం

మరిన్ని వార్తలు