బంగారు తల్లులు అమ్మకే బరువుగా మారుతున్నారు..!

16 Nov, 2021 14:44 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే జైలుశిక్షే 

పుట్టబోయేది ఆడ,మగ అని అడగకండి 

ఒక్క నెలలో 12 ఆస్పత్రుల్లో నిఘా పెట్టిన వైద్యశాఖ 

లింగ భేదం వెల్లడిస్తే వైద్య ధ్రువీకరణ పత్రం శాశ్వతంగా రద్దు: డీఎంహెచ్‌ఓ రమణకుమారి హెచ్చరిక

ఔను...అమ్మకే ఆడ శిశువు బరువవుతోంది. దీంతో జిల్లాలో మగ,ఆడ పిల్లల నిష్పత్తిలో భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. తొలి కాన్పులో కూడా ఆడపిల్లను తిరస్కరించడంతో పిండ దశలోనే పిండేస్తున్నారు. చట్టరీత్యా నేరమని తెలిసినా నారీ గళాన్ని నిర్వీర్యం చేసేస్తున్నారు. నిఘాల మాటునే నీరుగార్చేస్తున్నారు. 

సాక్షి,విజయనగరం: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో ఆడపిల్లను పిండ దశలోనే పిండేస్తున్నారు. దీంతో మగపిల్లల నిష్పత్తితో పోల్చుకుంటే ఆడపిల్లల నిష్పత్తి (1000:938)గా గుర్తించారు. జిల్లాలో బంగారు తల్లులను ఉమ్మనీటిలోనే కన్నుమూసే పరిస్థితి ఎదురవుతోంది. గర్భిణిగా ఉన్నప్పుడే లోపల పెరిగేది ఆడ, మగ అని తెలుసుకుని మరీ చంపేస్తున్న ఘటనలు వైద్యుల సాయంతోనే గుట్టుగా జరిగిపోతున్నాయి. ఇందుకు గర్భిణులు కూడా సహకరిస్తుండడంతో ఇవేవీ బయటకు రావడం లేదు.

జిల్లాలో 66 ప్రైవేట్, 14 ప్రభుత్వ స్కానింగ్‌ సెంటర్లున్నాయి. స్కానింగ్‌ సెంటర్లలో లింగ నిర్ధారణ పరీక్షలు చేసిన అనంతరం సంబంధిత వ్యక్తులకు సైగలతో చెప్పడంతో గర్భస్రావాలకు పాల్పడుతున్నారు. ఇలా చేయడం చట్టరీత్యా నేరమని, పీసీ అండ్‌ పీఎన్‌డీటీ యాక్ట్‌ కింద రూ.10 వేలు జరిమానా, మూడేళ్ల జైలు శిక్ష ఉంటుందని తెలిసినా పరస్పర ఒప్పంద ప్రాతిపదికగా చట్టానికి దొరక్కుండా తప్పించుకుంటున్నారు. రెండోసారి తప్పు చేసినట్లు నిర్ధారణయితే ఐదేళ్లపాటు జైలు శిక్ష, రూ.50 వేల జరిమానాతోపాటు వైద్య ధ్రువీకరణ పత్రం భారత వైద్య మండలి ద్వారా ఐదేళ్ల రద్దు చేస్తారు. తర్వాత కూడా ఇదే పనికి పాల్పడితే ఐదేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానాతోపాటు శాశ్వతంగా వైద్య ధ్రువీకరణ పత్రం రద్దు చేస్తారు.  

 12 ఆసుపత్రుల్లో నిఘా పెట్టాం  
లింగనిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయనే అనుమానంతో జిల్లాలో బొబ్బిలి, ఎస్‌.కోట, సాలూరు ఆసుపత్రుల్లో నిఘా పెట్టాం. ఇలా మొత్తం 12  ఆసుపత్రుల్లో తమ సిబ్బంది డెకోయ్‌ ఆపరేషన్‌ నిర్వహించింది. వైద్యులు తప్పిదాలకు పాల్పడితే వారి వైద్య ధ్రువీకరణ పత్రం శాశ్వతంగా రద్దు చేస్తాం. గర్భస్ధ పిండం పరిస్ధితి, వ్యాధుల గుర్తింపు తదితర పరీక్షలకు వినియోగించాల్సిన యంత్రాలను లింగ నిర్ధారణకు ఉపయోగిస్తే క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని, లింగ నిష్పత్తి తక్కువగా ఉన్న మండలాల్లో డెకోయ్‌ ఆపరేషన్లు నిర్వహించాలని జాయింట్‌ కలెక్టర్‌ ఆధ్వర్యంలో అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఆసుపత్రుల్లో ఎవరైనా సరే లింగ నిర్ధారణకు పాల్పడుతున్నారని తెలిస్తే నేరుగా 9849902385 నెంబరుకు ఫిర్యాదు చేయవచ్చు.  
– డాక్టర్‌ ఎస్‌వీ రమణకుమారి, డీఎంహెచ్‌ఓ, విజయనగరం  

చదవండి: ‘ముందు జైల్లో పెట్టేది తిను.. నీ వల్ల కాకపోతే అప్పుడు చూద్దాం’

మరిన్ని వార్తలు