ఢిల్లీ చూడాలని ఇంటినుంచి వెళ్లిపోయిన బాలిక 

1 Oct, 2020 08:24 IST|Sakshi
మాట్లాడుతున్న సీఐ కరుణాకర్‌

మధ్యప్రదేశ్‌లో పట్టుకున్న పోలీసులు

ధర్మవరం అర్బన్‌: దేశ రాజధాని ఢిల్లీ చూడాలన్న మోజుతో ఓ బాలిక ఇంటి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించగా ధర్మవరం పోలీసులు రంగంలోకి దిగి మధ్యప్రదేశ్‌లో పట్టుకున్నారు. ఆ బాలికను తిరిగి తల్లి వద్దకు చేర్చారు. ఇందుకు సంబంధించిన వివరాలను సీఐ కరుణాకర్‌ ధర్మవరం అర్బన్‌ పోలీస్‌ స్టేషన్‌లో బుధవారం సాయంత్రం మీడియాకు వెల్లడించారు. పట్టణంలోని పీఆర్‌టీ వీధిలో తరుగు ఆదిలక్ష్మి  కుటుంబం నివాసం ఉంటోంది. ఈమెకు 15 ఏళ్ల వయసు గల కుమార్తెతో పాటు కుమారుడు ఉన్నారు. లాక్‌డౌన్‌ సమయంలో ఇంట్లోనే ఎక్కువగా టీవీ, సెల్‌ఫోన్‌ చూస్తుండిపోయిన కుమార్తె ఢిల్లీలోని పలు ప్రదేశాలను చూడాలనిపిస్తోందని తల్లి వద్ద అంటుండేది.  ఎలాగైనా అక్కడికి వెళ్లాలనుకున్న కుమార్తె అందుకు అవసరమైన డబ్బు కోసం తల్లి భద్రపరుచుకున్న రూ.లక్ష నగదు బ్యాగును తీసుకుని సెప్టెంబర్‌ 24న తెల్లవారుజామున ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయింది. (చదవండి: గృహ నిర్మాణ శాఖలో కొండంత అవినీతి..)

స్పందించిన పోలీసులు.. 
తన కూతురు కనిపించడం లేదని ఆదిలక్ష్మి అదే రోజు సాయంత్రం అర్బన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. వెంటనే స్పందించిన పోలీసులు బాలిక వద్ద గల సెల్‌నంబర్‌ను ట్రేస్‌ చేయగా ధర్మవరం ఆర్టీసీ బస్టాండ్‌ నుంచి తిరుపతికి చేరుకుని, అక్కడి నుంచి వేలూరుకు వెళ్లేందుకు బస్టాండ్‌లో ఉన్నట్లు తేలింది.  25వ తేదీ సాయంత్రం 6.20 గంటలకు మొబైల్‌ ఆన్‌ చేయగా సిగ్నల్‌ లొకేషన్‌ చెన్నై సెంట్రల్‌ రైల్వేస్టేషన్‌ చూపించింది. అదేరోజు రాత్రి 8.15గంటలకు సెల్‌ లొకేషన్‌ ద్వారా జీటీ ఎక్స్‌ప్రెస్‌ రైలులో వెళుతున్నట్లు తెలిసింది. 26వ తేదీ సాయంత్రం ఆరు గంటల సమయంలో జీటీ ట్రైన్‌లోని జనరల్‌ బోగీలో ఉన్నట్లు గుర్తించి మధ్యప్రదేశ్‌లోని ఇటార్శి రైల్వేస్టేషన్‌లో జీఆర్‌పీ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడి జీఆర్‌పీ పోలీసులు బాలికను పట్టుకుని ఛైల్డ్‌ వెల్ఫేర్‌ హోంలో అప్పగించారు. అనంతపురం జిల్లా ఎస్పీ అనుమతితో డీఎస్పీ రమాకాంత్‌ ద్వారా ఫారిన్‌ పాస్‌పోర్టు అందుకుని అర్బన్‌ ఎస్‌ఐ సతీష్‌, సిబ్బంది మధ్యప్రదేశ్‌లోని ఇటార్శికి వెళ్లి స్వాతిని తీసుకుని ధర్మవరం వచ్చారు. బుధవారం తల్లిని స్టేషన్‌కు పిలిపించి బాలికను అప్పగించారు. (చదవండి: వలంటీర్ కళ్లలో కారం కొట్టి..)

మరిన్ని వార్తలు