స్టార్టప్స్‌కు ఊతమిచ్చిన జీఐఎస్‌ 

12 Mar, 2023 05:12 IST|Sakshi

రాష్ట్ర స్టార్టప్స్‌కు 36 జాతీయ, అంతర్జాతీయ సంస్థల దన్ను

సాంకేతిక పరిజ్ఞానం, ఆర్థిక సాయం అందించడానికి సిద్ధం 

ఈ సంస్థలతో ఒప్పందం చేసుకున్న ఏపీ ఇన్నోవేషన్‌ సొసైటీ 

పేటీఎం, ఒప్పో వంటి సంస్థల ద్వారా ప్రచారం, సాంకేతిక పరిజ్ఞానం 

ఆర్థి క సాయానికి ఈఈడీసీ, సీటీఈ, ఈస్క్వేర్‌ ఒప్పందాలు 

సాక్షి, అమరావతి: విశాఖ గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ (జీఐఎస్‌) కేవలం భారీ పెట్టుబడులను ఆకర్షించడానికే కాకుండా రాష్ట్ర స్టార్టప్‌ రంగాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించడానికి కూడా వేదికగా నిలిచింది. నూత­న సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు జీఐఎస్‌లో  36కు పైగా జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.

ఆలోచన దగ్గర నుంచి దాన్ని వాణిజ్యపరంగా పూర్తిస్థాయి నూతన ఆవిష్కరణగా తీర్చిదిద్దేలా స్టార్టప్‌ ఎకో సిస్టమ్‌ను తయారు చేసే విధంగా పరిశ్రమలు, ఇంక్యుబేటర్లు, యాక్సిలేటర్స్, పరిశ్రమలతో రాష్ట్ర ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ శాఖకు చెందిన ఆంధ్రప్రదేశ్‌ ఇన్నొవేషన్‌ సొసైటీ (ఏపీఐఎస్‌) పలు ఒప్పందాలను కుదుర్చుకుంది. ఇందుకోసం జీఐఎస్‌ ఎగ్జిబిషన్‌లో ఏపీ ఇన్నోవేషన్‌ సొసైటీ ప్రత్యేకంగా స్టాల్‌ ఏర్పాటు చేసి, స్టార్టప్స్‌పై ప్రత్యేక చర్చా కార్యక్రమాన్ని కూడా నిర్వహించింది.

రాష్ట్రంలో ప్రస్తుతం 595 స్టార్టప్స్,  30 ఇంక్యుబేటర్స్‌ ఉన్నాయి. ఏపీ ఐటీ శాఖ నుంచి నాలుగు ఇంక్యుబేటర్లు,  వివిధ కళాశాలల్లో మరో 26 ఇంక్యుబేటర్స్‌ ఉన్నాయి. ఇవి కాకుండా 1,500 మంది సొంతంగా ఇంటి నుంచే స్టార్టప్స్‌ కింద పనిచేయడానికి నమోదు చేసుకొన్నారు. రాష్ట్రంలోని స్టార్టప్స్‌ అంతర్జాతీయంగా ఎదిగేలా ఐటీ శాఖ ప్రణాళిక రూపొందించింది. ఇందులో భాగంగా పలు సంస్థల సహకారాన్ని స్టార్టప్స్‌కి అందిస్తోంది.  

స్టార్టప్స్‌కు పరిశ్రమల మద్దతు 
రాష్ట్రంలోని స్టార్టప్‌ ఎకోసిస్టమ్‌కు సహాయ సహకారాలందించడానికి పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ముందుకొచ్చాయి. బహుళజాతి సంస్థలు పేటీఎం, ఒప్పొ, డసాల్ట్, స్మార్ట్‌ఫారి్మంగ్‌ టెక్, గ్లోబ­ల్‌ యాక్సలేటర్‌ ఫర్‌ ఇన్నోవేషన్‌ నెట్‌వర్క్‌ వంటి సంస్థలు స్టార్టప్స్‌ను ప్రోత్సహించనున్నాయి. ఈ మేరకు ఏపీ ఇన్నొవేషన్స్‌ సొసైటీతో ఒప్పందాలు చేసుకున్నాయి. రాష్ట్రంలోని స్టార్టప్స్‌కు జాతీయంగా, అంతర్జాతీయంగా ప్రాచుర్యం కల్పించేందుకు పేటీఎం ముందుకొచ్చింది.

అలాగే ప్రముఖ సెల్‌ఫోన్ల  తయారీ సంస్థ ఒప్పో తన అనుంబంధ సంస్థ  ఓప్లస్‌ ఇండియా రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ లిమిటెడ్‌ ద్వారా రాష్ట్రంలోని స్టార్టప్స్‌ ప్రమోట్‌ చేయనుంది. రాష్ట్రంలోని స్టార్టప్స్‌ అభివృద్ధి చేసిన ప్రొడక్ట్సను 100 రోజుల్లో మార్కెటింగ్‌ చేసేందుకు డసాల్ట్‌ ఇండియా సిస్టమ్స్‌ ఆసక్తి కనబరుస్తోంది. వ్యవసాయం, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగాల్లో ఆవిష్కరించే నూత­న టెక్నాలజీలకు ఆర్థిక సాయం అందించేందుకు నెదర్లాండ్స్‌కు చెందిన స్మార్ట్‌ ఫార్మింగ్‌ టెక్‌ బీవీ ముం­దుకొచ్చింది. బెంగళూరుకు చెందిన యాక్సిలేటర్‌ ఇన్నోవేషన్‌ నెట్‌వర్క్‌ రాష్ట్రంలోని స్టార్టప్స్‌ను దేశ విదేశాల్లోని ఇతర ప్రాంతాలకు తీసుకువెళ్లడానికి ఆర్థి క వనరులను సమకూర్చనుంది.
 
ఫండింగ్‌ చేయడానికి మూడు సంస్థలు 
అలాగే రాష్ట్రంలోని స్టార్టప్స్‌ అభివృద్ధి చేసిన నూతన ఆవిష్కరణలకు దేశ విదేశాల్లోని అవకాశాలను అందిపుచ్చుకోవడానికి వెంచర్‌ క్యాపిటలిస్ట్, ఏంజెల్‌ ఫండింగ్‌ రూపంలో ఆర్థి కసాయం అందించే విధంగా మూడు సంస్థలతో ఏపీ ఇన్నోవేషన్‌ సొసైటీ ఒప్పందాలు చేసుకుంది.

స్పెయిన్‌కు చెందిన యూరోపియన్‌ ఎకనామిక్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌ (ఈఈడీసీ), చెన్నైకి చెందిన కన్సార్టీయం ఫర్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ (సీటీఈ), బ్రిటన్‌కు చెందిన ఈస్క్వేర్‌ ఇన్నొవేషన్స్‌ లిమిటెడ్‌ సంస్థలతో రాష్ట్ర ప్రభు­త్వం ఒప్పందం చేసుకుంది.

అదే విధంగా డీఎల్టీ ల్యాబ్‌ టెక్నాలజీస్, దుబాయ్‌కు చెందిన క్రియేటర్స్‌ ఎఫ్‌జెడ్‌కో, మై స్టార్టప్‌ టీవీ, నెక్టŠస్‌ వేవ్‌ వంటి స్టార్టప్‌ సంస్థలతో కూడా ఒప్పందాలు జరిగాయి. ఇవి కాకుండా రాష్ట్రంలోని 13కుపైగా ఇంక్యుబేటర్‌ సంస్థలు, ఎస్‌టీపీఐ నెక్ట్స్, నాస్కాంలతో ఏపీఐఎస్‌ ఒప్పందాలు కుదుర్చుకుంది. 

పూర్తిస్థాయి ఎకోసిస్టమ్‌ అభివృద్ధే లక్ష్యం 
నూతన ఆవిష్కరణలు ఆలోచన దగ్గర నుంచి వ్యాపార పరంగా నూతన అప్లికేషన్‌ ఆవిష్కరించే విధంగా పూర్తిస్థాయి ఎకో సిస్టమ్‌ను రాష్ట్రంలో అభివృద్ధి చేస్తున్నాం. ప్రధానంగా మెటావర్స్, ఆర్టీఫిషియల్‌ ఇంటెలిజెన్స్, గేమ్‌ డెవలప్‌మెంట్, యానిమేషన్, విజువల్‌ ఎఫెక్ట్స్, కామిక్స్, డిజిటల్‌ ఆర్ట్, మార్కెటింగ్, మీడియా డిస్ట్రిబ్యూషన్‌ రంగాలను ప్రోత్సహించడంపై దృష్టి సారించాం.

నాలుగో తరం టెక్నాలజీలో పనిచేస్తున్న వారందరినీ ఆన్‌లైన్‌లో ఒకే వేదికపైకి తేవడం ద్వారా అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీతో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహిస్తాం. ఇందుకోసం ప్రణాళికలను సిద్ధం చేసుకున్నాం. రంగాల వారీగా నెలవారీ, మూడు నెలలకు, ఆరు నెలలకు ఒకసారి సమీక్షలతో పాటు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్‌ ప్రో గ్రాంలు, హ్యాక్‌థాన్‌లు, పోటీలు నిర్వహిస్తాం.  – ఏపీ ఇన్నొవేషన్‌ సొసైటీ సీఈవో అనిల్‌ తెంటు 

మరిన్ని వార్తలు