ఖైదీలకు మధ్యంతర బెయిలివ్వండి

23 May, 2021 04:25 IST|Sakshi

జిల్లా ప్రిన్సిపల్‌ జడ్జిలు, జైళ్ల అధికారులకు హైకోర్టు ఆదేశం

అత్యాచార, పోక్సో కేసుల్లో ఖైదీలకు బెయిల్‌ ఇవ్వకూడదు

సాక్షి, అమరావతి: కరోనా నేపథ్యంలో రాష్ట్రంలోని జైళ్లలో పరిస్థితులు, ఖైదీల విడుదల తదితర అంశాలపై ఉన్నత స్థాయి కమిటీ ఇటీవల చేసిన తీర్మానాలను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అరూప్‌ కుమార్‌ గోస్వామి పరిగణనలోకి తీసుకున్నారు. ఈ తీర్మానాల మేరకు ఖైదీల విడుదలకు ఆదేశాలు జారీ చేసేందుకు వీలుగా న్యాయమూర్తులు జస్టిస్‌ చాగరి ప్రవీణ్‌ కుమార్, జస్టిస్‌ కన్నెగంటి లలితలతో ధర్మాసనం ఏర్పాటు చేశారు. ఈ ధర్మాసనం రెండు రోజుల క్రితం ఈ మొత్తం వ్యవహారంపై సుమోటో రిట్‌ పిటిషన్‌గా విచారణ జరిపింది. అనంతరం పలు ఆదేశాలిచ్చింది. ఏడేళ్లు, అంతకన్నా తక్కువ శిక్షపడే కేసుల్లో నిందితులను అరెస్ట్‌చేసే సమయంలో పోలీసులు అర్నేష్‌కుమార్‌ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను పాటించేలా  స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్లందరికీ తగిన ఆదేశాలిచ్చేలా రాష్ట్ర డీజీపీకి సూచనలు ఇవ్వాలని హోంశాఖ ముఖ్య కార్యదర్శిని ధర్మాసనం ఆదేశించింది. 

హైకోర్టు ఆదేశాల్లోని ముఖ్యాంశాలు..
► గతేడాది మధ్యంతర బెయిల్‌పై విడుదలై తిరిగి జైలుకు చేరిన ఖైదీలు, అండర్‌ ట్రయిల్‌ ఖైదీలకు, ఏడేళ్లు, అంతకన్నా తక్కువ శిక్ష పడే కేసుల్లో జైల్లో ఉన్న ఖైదీలకు మధ్యంతర బెయిల్‌ ఇవ్వాలి. 
► రెండోసారి నేరం చేసి శిక్ష పడిన ఖైదీలు, అత్యాచార, పోక్సో కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్న ఖైదీలను విడుదల చేయకూడదు.
► అంతర్రాష్ట్ర దోపిడీ దొంగలను మధ్యంతర బెయిల్‌పై విడుదల చేస్తే తిరిగి వారిని జైలుకు తేవడం కష్టమవుతోంది కాబట్టి వారికి బెయిల్‌ ఇవ్వవద్దన్న పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ (పీపీ) కె.శ్రీనివాసరెడ్డి అభ్యర్థన మేరకు దోపిడీ, దోపిడీతో పాటు హత్య చేసిన ఖైదీలకు మధ్యంతర బెయిల్‌ ఇవ్వవద్దని ధర్మాసనం ఆదేశించింది.
► మేజిస్ట్రేట్ల సంతృప్తి మేరకు బెయిల్‌ బాండ్లు ఉండాలని హైకోర్టు ఆదేశించింది. 90 రోజుల పాటు మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేయాలంది.
► మధ్యంతర బెయిల్‌పై విడుదలయ్యాక  14 రోజుల పాటు హోం క్వారంటైన్‌లో  ఉండేలా ఖైదీల నుంచి హామీ తీసుకోవాలని ఆదేశించింది. 
► తామిచ్చిన ఈ ఆదేశాలు ఎనిమిది వారాల పాటు అమల్లో ఉంటాయని, ఈ ఆదేశాల అమలుకు అధికారులతో పాటు జిల్లా ప్రిన్సిపల్‌ జడ్జిలు తక్షణమే చర్యలు తీసుకోవాలని ధర్మాసనం ఆదేశించింది. 
► తదుపరి విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది. n కాగా, రాష్ట్రంలోని మొత్తం 79 జైళ్ల సామర్థ్యం 8,732 కాగా, ప్రస్తుతం 6,905 మంది ఖైదీలున్నారని జైళ్ల శాఖ డీజీ హైకోర్టుకు నివేదిక సమర్పించారు.   

మరిన్ని వార్తలు