ఏపీ ప్రభుత్వానికి గ్లోబల్‌ డిజిటల్‌ అవార్డు

30 Oct, 2022 12:04 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికి చౌకగా అత్యాధునిక వైద్యం అందించడమే రాష్ట్ర సీఎం వైఎస్‌ జగన్‌ ధ్యేయమని, అందుకోసం వైద్య రంగంలో విప్లవాత్మక విధానాలు ప్రవేశపెడుతున్నారని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని చెప్పారు. వైద్యుడు, మానవతావాది అయిన దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అడుగుజాడల్లోనే ఆయన తనయుడు సీఎం జగన్‌ సాగుతున్నారని పేర్కొన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ నేతృత్వంలో రాష్ట్రంలో వైద్య రంగం అభివృద్ధికి ప్రవేశపెట్టిన సంస్కరణలు, అందరికీ వైద్యాన్ని అందుబాటులో ఉంచేందుకు చేపట్టిన కార్యక్రమాలకు గుర్తింపుగా ఏపీ ప్రభుత్వానికి రెండు గ్లోబల్‌ డిజిటల్‌ హెల్త్‌ అవార్డులు దక్కాయి.

ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో శనివారం జరిగిన ప్రపంచ ఆరోగ్య సదస్సు (గ్లోబల్‌ డిజిటల్‌ హెల్త్‌ సమ్మిట్‌ – 2022) ముగింపు సమావేశంలో గౌరవ అతిథిగా పాల్గొన్న మంత్రి రజిని ఈ అవార్డులను అందుకున్నారు. మహిళల కోసం డిజిటల్‌ హెల్త్‌ లోగోను ఆవిష్కరించారు. 14 దేశాలకు చెందిన ప్రముఖ వైద్యులు, శాస్త్రవేత్తలు, వైద్య రంగ పారిశ్రామికవేత్తలు పాల్గొన్న ఈ సదస్సులో ఆంధ్రప్రదేశ్‌లో వైద్య, ఆరోగ్య రంగంలో అనుసరిస్తున్న విధానాలపై సవివరమైన ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. డిజిటల్‌ హెల్త్‌లో రాష్ట్రానికి వచ్చిన అవార్డులు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ దార్శనికతకు నిదర్శనమని చెప్పారు.

లభ్యత, సౌలభ్యత, ఆమోదయోగ్యత, స్తోమత (4ఏస్‌) పునాదులుగా వైద్య రంగాన్ని పటిష్టం చేస్తున్నట్టు వెల్లడించారు. దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందిన ‘నాడు–నేడు’ ద్వా రా అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో కార్పొరేట్‌ స్థాయి సమగ్ర వైద్య సదుపాయాలను కల్పిస్తున్నామని వివరించారు. ఆరోగ్య సంరక్షణలో భవిష్యత్తులో ఏపీ ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ఏపీ ప్రభుత్వ కృషికి కేంద్ర ప్రభుత్వం డిజిటల్‌ హెల్త్‌లో ఇప్పటికే ఆరు అవార్డులు ఇచ్చిందన్నారు.

పీపీపీ విధానంలో రాష్ట్రంలో హార్ట్‌ మెడికల్‌ టీచింగ్‌ యూనివర్సిటీ, రీసెర్చ్‌ వర్సిటీ, క్యాన్సర్‌ కేర్‌ సెంటర్‌ స్థాపన, డిజిటల్‌ వైద్య సేవల్లో కలిసి పని చేయాలని ఔత్సాహికులను ఆహ్వానించారు. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసే 16 మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో భాగస్వాములు కావాలన్నారు. త్వరలో ఏపీలో ‘ఇంటర్నెట్‌ ఆఫ్‌ మెడికల్‌ థింగ్స్‌’ను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. ఏపీలో డిజిటల్‌ పరిణామం మలుపు తీసుకున్న విధానంపై నమ్మి లక్ష్మి అనే మహిళ టెలీపాథాలజీ కథను వివరించారు. 

ఏపీలో సమర్థంగా ఆరోగ్య కార్యక్రమాలు 
ఏపీలో ఆరోగ్య కార్యక్రమాలను సమర్థంగా అమలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. దేశంలో అత్యధికంగా 3,40,15,800 ఆయుష్మాన్‌ భారత్‌ హెల్త్‌ ఖాతాలు ఏపీలోనే ఉన్నాయన్నారు. హెల్త్‌ కేర్‌ ప్రొఫెషనల్స్‌ రిజిస్ట్రీలో 9,500 మంది ప్రభుత్వ వైద్యులు, 11,152 స్టాఫ్‌ నర్సుల నమోదు పూర్తయిందన్నారు.

హెల్త్‌ ఫెసిలిటీ రిజిస్ట్రీలో 14,182 ప్రభుత్వ ఆరోగ్య సౌకర్యాలు, ఈ–హాస్పిటల్‌ సాఫ్ట్‌వేర్‌ ద్వారా 121, డాక్టర్‌ కేర్‌ సాఫ్ట్‌వేర్‌ ద్వారా మరో 1,648 వసతులు నమోదు చేసినట్టు చెప్పారు. ఏఎన్‌ఎం మొబైల్‌ యాప్, ఎంవో యాప్, డాక్టర్‌ కేర్‌ ఈ–హాస్పిటల్, ఎంఎల్‌హెచ్‌పీ అప్లికేషన్, మేనేజ్‌మెంట్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టం, డాష్‌ బోర్డుతో డిజిటల్‌ హెల్త్‌ను మరో మెట్టు ఎక్కించడంలో ఏపీ ముందుందని తెలిపారు. ఈ సదస్సులో ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి జీఎస్‌ నవీన్‌ కూడా పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు