రామాయపట్నానికి గ్లోబల్‌ టెండర్లు

18 Sep, 2020 04:49 IST|Sakshi

ఈపీసీ విధానంలో మూడు బెర్తులతో పోర్టు నిర్మాణం

ప్రాజెక్టు అంచనా విలువ రూ.2,169.62 కోట్లు

36 నెలల్లో పూర్తి చేయాలనే నిబంధన

న్యాయ పరిశీలనకు టెండర్లు పంపిన ఏపీ మారిటైమ్‌ బోర్డు

సాక్షి, అమరావతి: ప్రకాశం జిల్లా రామాయపట్నంలో పోర్టు నిర్మాణం కోసం అంతర్జాతీయ టెండర్లను ఆహ్వానించేందుకు ఏపీ మారిటైమ్‌ బోర్డు సన్నాహాలు చేస్తోంది. రూ.2,169.62 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించ తలపెట్టిన కొత్త ఓడరేవు పనులు చేపట్టేందుకు ఆసక్తి కలిగిన సంస్థల నుంచి టెండర్లను పిలిచేందుకు న్యాయ పరిశీలన కోసం జ్యుడీషియల్‌ ప్రివ్యూకు పంపింది. ఇంజనీరింగ్, ప్రొక్యూర్‌మెంట్, కాంట్రాక్టు (ఈపీసీ) విధానంలో నిర్మించే ఈ ఓడరేవు కోసం అంతర్జాతీయ సంస్థల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ టెండర్లు(ఆర్‌ఎఫ్‌క్యూ) పిలవాలని మారిటైమ్‌ బోర్డు నిర్ణయించింది.

తొలిదశలో 3 బెర్తులతో..
► రామాయపట్నం పోర్టును తొలిదశలో మొత్తం 900 మీటర్ల పొడవు, 34.5 మీటర్ల లోతు ఉండే విధంగా మూడు బెర్తులతో నిర్మించనున్నారు. ప్రాజెక్టును 36 నెలల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. పరిశ్రమలు, మౌలిక వసతులు, ఓడరేవుల నిర్మాణంలో ఏడేళ్ల అనుభవం ఉండటంతోపాటు కనీసం రూ.1,080 కోట్ల విలువైన పనులు చేసిన సంస్థలు బిడ్డింగ్‌లో పాల్గొనేందుకు అర్హత కలిగినవిగా నిర్ణయించారు. గత మూడేళ్లలో కంపెనీ టర్నోవర్‌ రూ. 651 కోట్లు ఉండాలి. 
► రెండు మూడు కంపెనీలు కలిపి భాగస్వామ్యంతో బిడ్‌ దాఖలు చేస్తే ఆర్థిక అర్హతలను కలిపి పరిగణిస్తారు. ప్రాజెక్టు విలువలో ఒక శాతం ఎర్నెస్ట్‌మనీ డిపాజిట్‌ (ఈఎండీ) కింద రూ.21.70 కోట్లు ముందుగా డిపాజిట్‌ చేయాలి.

డిసెంబర్‌లో నిర్మాణ పనులు..
► రామాయపట్నం పోర్టును రాష్ట్ర ప్రభుత్వం లాండ్‌ లార్డ్‌ విధానంలో సొంతంగా నిర్మించనుంది. ఈ పోర్టు నిర్మాణానికి ఏపీ మారిటైమ్‌ బోర్డు నిధులు సమకూర్చి అనంతరం బెర్తుల నిర్వహణను ప్రైవేటు సంస్థలకు లీజుపై ఇస్తుంది. 
► రివర్స్‌ టెండరింగ్‌ విధానంలో చేపట్టే ఈ బిడ్‌లకు జ్యుడిషియల్‌ ప్రివ్యూ అనుమతి రాగానే ఈ నెలలోనే అంతర్జాతీయ టెండర్లు పిలిచేందుకు ఏపీ మారిటైమ్‌ బోర్డు ఏర్పాట్లు చేసింది. టెండర్ల ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి డిసెంబర్‌ 15వ తేదీ నాటికి నిర్మాణ పనులు ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా