కుటుంబ పెన్షన్లలో జీవో 152 రాజ్యాంగ విరుద్ధం

23 Mar, 2021 05:12 IST|Sakshi

రద్దు చేస్తున్నట్లు హైకోర్టు ఉత్తర్వులు

ఆ మహిళలూ కుటుంబ పెన్షన్‌కు అర్హులే

సాక్షి, అమరావతి: ప్రభుత్వోద్యోగుల కుటుంబ పెన్షన్‌ నిబంధనలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం 2019 నవంబర్‌ 25న తెచ్చిన జీవో 152ని హైకోర్టు రద్దు చేసింది. ఈ జీవోను రాజ్యాంగ విరుద్ధంగా తేల్చింది. చట్టం ద్వారా తెచ్చిన నిబంధనలను కార్య నిర్వాహక ఉత్తర్వులు భర్తీ చేయజాలవని హైకోర్టు స్పష్టం చేసింది. 1980లో తీసుకొచి్చన ఏపీ రివైజ్డ్‌ పెన్షన్‌ రూల్స్‌ చట్టబద్ధమైనవని, ఇందులో వితంతు, విడాకులు తీసుకున్న కుమార్తెలు పెన్షన్‌ పొందే విషయంలో ఎలాంటి షరతులు విధించలేదని తెలిపింది. ఈ నిబంధనలను కార్య నిర్వాహక ఉత్తర్వుల ద్వారా మార్చడానికి వీల్లేదని పేర్కొంది.

పదవీ విరమణ తరువాత ప్రభుత్వ ఉద్యోగి మరణిస్తే ఆ ఉద్యోగి వితంతు కుమార్తె, విడాకులు తీసుకున్న కుమార్తె కుటుంబ పెన్షన్‌ పొందేందుకు అనర్హులుగా చేయడం సరికాదంది. వారు కూడా కుటుంబ పెన్షన్‌ పొందేందుకు అర్హులని తేల్చి చెప్పింది. పెన్షన్‌ పొందడం జీవనోపాధి హక్కుతో పాటు జీవించే హక్కులో భాగమని సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో చెప్పిందని హైకోర్టు గుర్తు చేసింది. పిటిషనర్లందరికీ గతంలో చెల్లించిన విధంగానే కుటుంబ పెన్షన్‌ చెల్లించాలని అధికారులను ఆదేశించింది. పెన్షన్‌ నిలిపివేసిన నాటి నుంచి 6 శాతం వడ్డీతో కలిపి వారికి పెన్షన్‌ చెల్లించాలంది. రెండు నెలల్లో ఈ చెల్లింపులు చేయాలని ఆదేశిస్తూ న్యాయమూర్తి జస్టిస్‌ మల్లవోలు సత్యనారాయణమూర్తి ఇటీవల తీర్పు వెలువరించారు. 

వయసుతోపాటు ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి..
పదవీ విరమణ తరువాత మరణించిన ప్రభుత్వ ఉద్యోగి కుమార్తె వితంతువు అయినా, విడాకులు తీసుకున్నా వారి కుటుంబ పెన్షన్‌ విషయంలో నిబంధనలను మారుస్తూ ప్రభుత్వం 2019 జీవో 152 జారీ చేసింది. ఆ కుమార్తెల పెన్షన్‌ వయసును 45 ఏళ్లుగా నిర్ధారించింది. వితంతు, విడాకులు తీసుకున్న కుమార్తెలు తిరిగి వివాహం చేసుకునేంత వరకు లేదా సంపాదన మొదలు పెట్టే వరకు లేదా ఆమె పిల్లల్లో ఎవరైనా మేజర్‌ అయ్యేంత వరకు లేదా ఆమె మరణం వరకు కుటుంబ పెన్షన్‌ వస్తుందని జీవోలో పేర్కొంది. ఈ జీవో ఆధారంగా పలువురికి పెన్షన్లు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో ఈ జీవోపై వితంతు, విడాకులు తీసుకున్న పలువురు మహిళలు వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.

ఈ వ్యాజ్యాలపై విచారణ సందర్భంగా పెన్షన్‌ వయసును 45 ఏళ్లుగా నిర్ణయించడం హాస్యాస్పదమన్న న్యాయమూర్తి, ఆ కారణంగా పెన్షన్‌ నిలిపేయడం సరికాదన్నారు. వయసు పెరిగే కొద్దీ ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయని, అలాంటప్పుడే ఆర్థిక అవసరాలు ఎక్కువగా ఉంటాయన్నారు. 45 ఏళ్ల లోపు, 45 ఏళ్లు దాటిన వితంతువులు, విడాకులు తీసుకున్న మహిళల విషయంలో వివక్ష చూపడం తగదన్నారు. ఈ వర్గీకరణలో హేతుబద్ధత లేదన్నారు. జీవో జారీ చేసే ముందు అధికారులు సామాన్యుడి ఆలోచనా విధానాన్ని, క్షేత్రస్థాయి పరిస్థితులను పరిగణనలోకి తీసుకోలేదని తీర్పులో పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు